కోర్టుల్లో కేసులు వేయడం అన్యాయం

24 Jan, 2021 05:30 IST|Sakshi
దీక్షల్లో పాల్గొన్న దళిత నాయకులు

నేటితో 117వ రోజుకు చేరిన బహుజన పరిరక్షణ సమితి దీక్షలు

తాడికొండ: స్థానికంగా ఉండే పేదలకు ఇళ్ల స్థలాలిస్తే డెమోగ్రాఫికల్‌ ఇన్‌బ్యాలెన్స్‌ నెలకొంటుందంటూ కోర్టుల్లో కేసులు వేయడం అన్యాయమని బహుజన పరిరక్షణ సమితి నాయకులు మండిపడ్డారు. మూడు రాజధానులకు మద్దతుగా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో 116వ రోజు  రిలే నిరాహార దీక్షల్లో పలువురు నేతలు మాట్లాడారు. తెలంగాణలో ఆంధ్రాకు చెందిన ఓ అగ్రకులం సెటిలర్స్‌గా చేరి పెత్తనం చేసినపుడు డెమోగ్రాఫికల్‌ ఇన్‌బ్యాలెన్స్‌ కనిపించలేదా అని మండిపడ్డారు. అంబేడ్కర్‌ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలను కొంతమంది అగ్రకుల పెత్తందారులు అనుభవిస్తూ వ్యవస్థలను లోబర్చుకుని పేదలకు  తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

చంద్రబాబు అండ్‌ కో అడ్డదారుల్లో వెళుతూ పేదల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వారి ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు సహకరించకుండా అడ్డుకుంటే బహుజనులంతా కలిసి ఏకమై.. రాజకీయంగా సమాధి చేస్తామని హెచ్చరించారు. 5 సంవత్సరాలు అధికారం అనుభవించి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా కోట్లాది రూపాయలు లాభం పొందిన చంద్రబాబు అండ్‌ కో పేదల అభివృద్ధిని చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలతో ఫేక్‌ ఉద్యమాలు చేస్తున్నారని మండిపడ్డారు. బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాదిగాని గురునాధం, నత్తా యోనారాజు, మల్లవరపు సుధారాణి, జూపూడి బాలస్వామి, బొందపల్లి గిరిజ, యాతం క్రాంతి కుమార్, మంద గిరీష్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు