నిరాధార ఆరోపణలతో బెయిల్‌ రద్దు కుదరదు 

2 Mar, 2022 05:46 IST|Sakshi

పెసరవాయి జంటహత్య కేసు నిందితుల బెయిల్‌ రద్దుచేయలేం 

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ తీర్పు 

సాక్షి, అమరావతి: నిందితులపై వచ్చే అస్పష్ట ఆరోపణల ఆధారంగా వారికిచ్చిన బెయిల్‌ను రద్దుచేయడం సాధ్యం కాదని హైకోర్టు తీర్పు  చెప్పింది. ఆరోపణలకు ఆధారాలు లేనప్పుడు బెయిల్‌ రద్దుచేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో గత ఏడాది జూన్‌లో జరిగిన జంటహత్య కేసులో నిందితులకు కింది కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేయాలని కోరుతూ మృతుల్లో ఒకరైన ప్రతాపరెడ్డి సతీమణి లక్ష్మీదేవి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ జంటహత్య కేసులో చార్జిషీట్‌ దాఖలు చేసేవరకు నిందితులు పెసరవాయి గ్రామంలోకి అడుగుపెట్టడానికి వీల్లేదని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ ఇటీవల తీర్పు చెప్పారు.

పెసరవాయిలో గత ఏడాది జూన్‌ 17న టీడీపీ నేతలైన వడ్డు ప్రతాప్‌రెడ్డి, వడ్డు నాగేశ్వరరెడ్డి హత్యకు గురయ్యారు. రాజకీయ కక్షలతో జరిగిన ఈ హత్యలపై దర్యాప్తు జరిపిన గడివేముల పోలీసులు నిందితులు ద్వారం శ్రీకాంత్‌రెడ్డి, ద్వారం కేదారనాథ్‌రెడ్డిలతో పాటు మరికొందరిని అదేనెల 25న అరెస్ట్‌ చేశారు. అనంతరం వీరు నంద్యాల కోర్టులో బెయిల్‌ కోసం పిటిషన్లు వేసుకున్నారు. రెండుసార్లు బెయిల్‌ పిటిషన్లను కొట్టేసిన కోర్టు మూడోసారి షరతులతో బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో నిందితులు విడుదలయ్యారు. నిందితుల బెయిల్‌ను రద్దుచేయాలని కోరుతూ మృతుడు ప్రతాప్‌రెడ్డి సతీమణి లక్ష్మీదేవి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ విచారించారు. సాక్షులను బెదిరిస్తూ, దర్యాప్తులో జోక్యం చేసుకుంటున్నందున నిందితులకు కింది కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేయాలని పిటిషనర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోరారు.  

సాక్షులను బెదిరిస్తున్నట్లు ఫిర్యాదు లేదు 
పోలీసుల తరఫున అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శెట్టిపల్లె దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. నిందితులు పెసరవాయిలోకి అడుగుపెట్టరాదన్న కోర్టు బెయిల్‌ షరతును వారు పాటిస్తున్నట్లు చెప్పారు. నిందితులు బెదిరిస్తున్నట్లు ఒక్క సాక్షి నుంచి కూడా పోలీసులకు ఫిర్యాదు అందలేదన్నారు. నిందితుల న్యాయవాదులు కూడా పిటిషనర్‌ ఆరోపణలను తోసిపుచ్చారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి.. నిందితులు సాక్షులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలకు ఆధారాలు చూపనందున బెయిల్‌ను రద్దుచేయడం సాధ్యం కాదని తీర్పు చెప్పారు.   

మరిన్ని వార్తలు