బాలయ్యా... గుర్తున్నామా! 

17 Aug, 2022 09:29 IST|Sakshi
చుట్టపుచూపుగా 2019 అక్టోబర్‌ 24వ తేదీన లేపాక్షి మండలం గలిబిపల్లికి వచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణను అడ్డుకుని ప్రశ్నిస్తున్న గ్రామస్తులు

సాక్షి, పుట్టపర్తి: హిందూపురం నియోజకవర్గం...టీడీపీకి అండగా ఉన్న ప్రాంతం. నందమూరి తారక రామారావుతో పాటు ఆయన తనయులు హరికృష్ణ, బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నందమూరి బాలకృష్ణ హిందూపురంలో రెండోసారి విజయం సాధించి ప్రస్తుత అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే తమను ఇంతలా ఆదరిస్తున్న హిందూపురం వాసుల గురించి మాత్రం బాలయ్య పట్టించుకోవడం లేదు.

సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూ నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారు. గత 8 నెలల కాలంలో బాలకృష్ణ ఒకట్రెండు సార్లు మాత్రమే హిందూపురంలో కనిపించారు. అది కూడా గృహ ప్రవేశాలు, వివాహాల్లో హాజరయ్యేందుకు వచ్చారు. అంతేకానీ ప్రజలు ఎలా ఉన్నారు.. నమ్మి ఓట్లేసిన ప్రజల యోగ క్షేమాల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ నేపథ్యంలో రెండు రోజుల పర్యటన కోసం బాలకృష్ణ బుధవారం హిందూపురం వస్తుండగా...జనం ఇన్నాళ్లకు గుర్తొచ్చామా? అని ప్రశ్నిస్తున్నారు. 

టీడీపీ హయాంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై అప్పటి సీఎం చంద్రబాబు వివక్ష చూపించారు. నిధులు విడుదల చేయకుండా ఇబ్బందులు పెట్టారు. అయితే ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ప్రాంతాలు, కులాలు, మతాలు, పారీ్టలు చూడకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా జనరంజక పాలన సాగిస్తున్నారు.

టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాల అభివృద్ధికీ నిధులు కేటాయిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఈ క్రమంలో హిందూపురం నుంచి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్నా.. ప్రభుత్వం ఈ ప్రాంతంపై ఎలాంటి వివక్ష చూపలేదు. అన్ని రకాల సంక్షేమ పథకాలు, అన్ని వర్గాల వారికి అందజేస్తున్నారు. దీనికి తోడు ప్రజలకు ఎలాంటి కష్టమొచ్చినా.. పార్టీ చూడకుండా.. ఎమ్మెల్సీ ఇక్బాల్‌ సాయం చేస్తున్నారు. దీంతో బాలకృష్ణతో జనానికి పనిలేకుండా పోయింది. 

గత ఆరు నెలల్లో బాలకృష్ణ ఇలా....

  • జనవరిలో ఓసారి కూడా హిందూపురం రాలేదు. 
  • ఫిబ్రవరి 3,4 తేదీల్లో హిందూపురం జిల్లా సాధన పేరుతో ధర్నా చేసేందుకు వచ్చారు.  
  • మార్చి 27వ తేదీన హిందూపురంలో ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
  •  ఏప్రిల్‌లో ఒక్కసారి కూడా హిందూపురం సందర్శించలేదు. 
  • మే  27వ తేదీన హిందూపురం విచ్చేసి ఓ వివాహానికి హాజరయ్యారు.  
  • జూన్‌ 2వ తేదీన హిందూపురంలో ఓ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
  • జూలైలో హిందూపురంలో పర్యటించలేదు. 

తాజాగా 17, 18 తేదీల్లో పర్యటించేందుకు షెడ్యూల్‌ ఖరారు చేశారు. బాలకృష్ణ స్థానిక వ్యవహారాలన్నీ పీఏ (వ్యక్తిగత కార్యదర్శి)కి అప్పగించారు. వారు ఎలా చెబితే అలా డైలాగులు చెప్పేసి వెళ్లిపోతారు. కనీసం పార్టీ కార్యకర్తలెవరో కూడా తెలియని పరిస్థితి. ఎవరైనా అభిమానంతో దగ్గరకు పోయినా లాగి లెంపకాయ కొట్టడం అలవాటు చేసుకున్నారు.

దీంతో ఆయన దగ్గరకు వెళ్లే సాహసం ఎవరూ చేయడం లేదు. పోనీ ఆయన పీఏలనైనా నమ్ముకుందామంటే... గత టీడీపీ హయాంలో అప్పటి పీఏ శేఖర్‌ పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం పీఏగా వ్యవహరిస్తున్న బాలాజీ హైటెక్‌ పద్ధతిలో జూదం ఆడుతూ పోలీసులకు గత మార్చి 21వ తేదీన పట్టుబడ్డాడు. ఇలా బాలకృష్ణ అందుబాటులో లేక, ఆయన పీఏలు పట్టించుకోకపోవడంతో జనం ఎమ్మెల్యే గురించే మరచిపోయారు.  


ఈ చిత్రంలో ఎమ్మెల్సీ ఇక్బాల్‌ పరామర్శిస్తున్న వ్యక్తి పేరు తిమ్మారెడ్డి. ఎన్‌టీఆర్‌ వీరాభిమాని. మొదటి నుంచీ టీడీపీలో క్రియాశీలక కార్యకర్త. గత ఏడాది తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. ఏళ్లుగా పారీ్టకి సేవ చేసినా టీడీపీ నేతలు గానీ, స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణగానీ తిమ్మారెడ్డి గురించి పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్‌ 2021 మే 5వ తేదీన తిమ్మారెడ్డి ఇంటికే వెళ్లి పరామర్శించారు. వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం చేశారు. అంతేకాకుండా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద రూ.2,70,000 మంజూరు చేయించారు.

ప్రస్తుతం తిమ్మారెడ్డి ఆరోగ్యంగా ఉన్నారు. లేపాక్షికి చెందిన ఓ టీడీపీ కార్యకర్తకు ఇటీవల ఓ పెద్ద కష్టం వచ్చింది. సాయం కోసం బాలకృష్ణను సంప్రదించాలని చూడగా ఆయన అందుబాటులో లేరు. ఎమ్మెల్యే పీఏను కలిస్తే చీదరించుకున్నారు. ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తే తన పరిస్థితి ఇలా అయ్యిందని సదరు కార్యకర్త మనస్తాపం చెందారు. చివరకు విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఇక్బాల్‌ అతన్ని పిలిపించుకుని విషయం ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి సదరు కార్యకర్తకు అండగా నిలిచారు. 

...ఇలా టీడీపీ నాయకులు, కార్యకర్తలే కాదు. హిందూపురం వాసులంతా బాలయ్య అందుబాటులో లేక ఇబ్బంది పడ్డారు. అయితే అధికార వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పారీ్టలకు అతీతంగా పథకాలు అమలు చేయడంతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల అభివృద్ధికీ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుండటంతో జనంతో పాటు టీడీపీ నేతలూ ఇప్పుడు ఆ పార్టీ వెంట నడుస్తున్నారు. అందువల్లే హిందూపురం వాసులు కూడా బాలయ్యతో తమకేం పెద్దగా పనిలేదంటున్నారు.   

(చదవండి: వారంతా చంద్రబాబుతో చేతులు కలిపారు: ఎంపీ గోరంట్ల మాధవ్‌)

మరిన్ని వార్తలు