బాలుపై అభిమానంతో ‘బామా’

26 Sep, 2020 04:40 IST|Sakshi

కావలి: ఎస్పీబీ అంటే కావలికి చెందిన బ్యాంకు ఉద్యోగి లేబాకుల సుధాకర్‌రెడ్డికి వల్లమానిన అభిమానం. తన అభిమాన గాయకుడి పేరుతో సాంస్కృతిక సేవా సంస్థను ఏర్పాటు చేసి, ఆ సంస్థ ద్వారా వర్ధమాన గాయకులను వెలుగులోకి తీసుకురావాలని సుధాకర్‌రెడ్డి భావించారు. దీంతో ‘బాలసుబ్రహ్మణ్యం ఆర్ట్స్‌ అండ్‌ మ్యూజిక్‌ అకాడమీ’ (బామా) కావలిలో 2004లో పురుడుపోసుకుంది.

ఈ సంస్థను బాలు ప్రారంభించారు. చెన్నైలో వైద్యుడిగా స్థిరపడ్డాక ‘కళాసాగర్‌’ అనే సాంస్కృతిక సంస్థను స్థాపించిన కావలికి చెందిన డాక్టర్‌ సీఎంకే రెడ్డితో కలసి సుధాకర్‌రెడ్డి.. బాలు వద్దకు వెళ్లి ‘బామా’ను నెలకొల్పడానికి ఒప్పించారు. ఏటా ఈ సంస్థ నిర్వహించే పోటీల్లో తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి యువతీ యువకులు పాల్గొంటారు. ఇక్కడి పోటీల్లో గెలిచినవాళ్లలో పలువురు సినీ నేపథ్యగాయకులుగా ఉన్నారు. 2013లో జరిగిన ‘బామా’ పదో వార్షికోత్సవ వేడుకల్లో ఎస్పీ బాలు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు