Balineni Srinivas Reddy: పదవులు ముఖ్యం కాదు.. అధినేత మాటే శిరోధార్యం

12 Apr, 2022 12:08 IST|Sakshi
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో బాలినేని శ్రీనివాసరెడ్డి   

బాలినేనికి మంత్రి పదవి రానందుకు నాయకుల భావోద్వేగం 

బాలినేని వారిస్తున్నా నిరసనలకు దిగిన వైనం 

సీఎం జగన్‌తో భేటీ తర్వాత క్యాడర్‌కు సర్దిచెప్పిన మాజీ మంత్రి 

టీ కప్పులో తుపానులా సద్దుమణిగిన వివాదం

తమ అభిమాన నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర మంత్రిమండలిలో చోటు దక్కకపోవడంతో జిల్లాలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. బాలినేని వారిస్తున్నా.. ప్రకాశం జిల్లాతోపాటు, బాపట్ల జిల్లా పరిధిలోని పర్చూరు, అద్దంకి, చీరాల నియోజకవర్గం పలువురు నేతలు పదవులను త్యజించేందుకు సిద్ధమయ్యారు. ‘‘పదవులు ముఖ్యం కాదు..అధినేత మాటే శిరోధార్యం..జిల్లాలో పార్టీ అభ్యున్నతికి అహర్నిశలు పాటు పడదాం..’’ అంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. ఆయన సీఎంతో భేటీ అయిన తర్వాత క్యాడర్‌కు సర్ది చెప్పారు. 

'సాక్షి, ఒంగోలు: ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి పట్టున్న జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటింది. నాయకులు, క్యాడర్‌ అహర్నిశలు పార్టీ అభ్యున్నతికి పాటు పడ్డారు. సార్వత్రిక ఎన్నికల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకూ అన్నింటా పార్టీ సత్తాచాటింది. జెడ్పీ ఎన్నికల్లో అయితే ప్రతిపక్షాలకు ఒక్కటంటే ఒక్కస్థానం కూడా లేకుండా పోయింది. ఇంత కీలకంగా ఉన్న జిల్లా నుంచి జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రి మండలిలో బాలినేని శ్రీనివాసరెడ్డి చోటు దక్కించుకున్నారు. మంత్రిగా జిల్లా అభివృద్ధికి పాటుపడ్డారు. ఎన్నో కీలక ప్రాజెక్టులు తీసుకొచ్చేందుకు కృషిచేశారు. మరో వైపు పార్టీ పటిష్టానికి సైతం తన వంతు కృషి చేశారు. అందరికీ అందుబాటులో ఉంటూ వచ్చారు. బాలినేనికి రెండో విడత రాష్ట్ర క్యాబినెట్‌ విస్తరణలో మంత్రి పదవి ఖాయమని అభిమానులంతా భావించారు.

అయితే సామాజిక సర్దుబాటుల్లో భాగంగా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని నేతలు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. బాలినేని వారిస్తున్నా వినకుండా తమ పదవులకు రాజీనామా చేసేందుకు ముందుకొచ్చారు. కొన్ని ప్రాంతాల్లో రాస్తారోకోలు చేశారు. పార్టీ అధినాయకులు బాలినేనితో దఫ..దఫాలుగా చర్చలు జరుపుతున్న సమయంలో వీరు మరింత ఆందోళనకు గురయ్యారు. చలో విజయవాడ అంటూ పరుగుపెట్టారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కరణం బలరామకృష్ణమూర్తి, నాగార్జునరెడ్డి, ఎమ్మెల్సీ తూమాటి మాధవరెడ్డి, పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ మాదాసి వెంకయ్య, శాప్‌నెట్‌ చైర్మన్‌ బాచిన కృష్ణ చైతన్య, ఇతర కీలక నేతలు విజయవాడలో బాలినేనిని కలిశారు. సుదీర్ఘ చర్చలు జరిపారు.

చదవండి: (పదవి పోయినందుకు ఎలాంటి బాధ లేదు..)
 
అంతా టీ కప్పులో తుపానులా.. 
అయితే ఇదంతా టీ కప్పులో తుపానులా అంతా సర్దుమణిగిపోయింది. సోమవారం సాయంత్రం సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో బాలినేని సుదీర్ఘ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని, అధినేత ఆదేశాలే శిరోధార్యమన్నారు. జిల్లాలో పార్టీ పటిష్టానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ క్యాడర్‌ సంయమనం పాటించాలంటూ పిలుపునిచ్చారు. ‘‘అభిమాన నేత అనగానే ఎవరికైనా సహజంగానే భావోద్వేగాలు ఉంటుంటాయి. ఆ కోణంలోనుంచే తమలో ఆందోళన నెలకొందని, అంతే తప్ప తాము పార్టీకి వ్యతిరేకం కామంటూ’’నేతలు స్పష్టం చేశారు. సీఎం జగన్‌ పిలుపు మేరకు పార్టీ అభ్యున్నతికి పాటు పడతామని ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్‌ గంగాడ సుజాత స్పష్టం చేశారు. మంత్రి పదవి కన్నా 2024లో పార్టీ గెలుపే మనకు ముఖ్యమని వాసన్న స్పష్టం చేశారని, ఈ నేపథ్యంలో ఆయన ఆదేశాలతో తాను, కార్పొరేటర్లు అంతా మా రాజీనామాలను ఉపసంహరించుకుంటున్నామని స్పష్టం చేశారు.

బాపట్ల జిల్లా ఇంకొల్లు జెడ్పీటీసీ భవనం శ్రీలక్ష్మి, చినగంజాం జెడ్పీటీసీ ఆసోది భాగ్యలక్ష్మి, ఎంపీపీ కోమట్ల అంకమ్మరెడ్డి, కారంచేడు జెడ్పీటీసీ యార్లగడ్డ రజనీ, ఎంపీపీ నీరుకట్టు వాసుబాబు, సంతమాగులూరు ఎంపీపీ అట్లా చిన వెంకటరెడ్డి, ప్రకాశం జిల్లా మర్రిపూడి ఎంపీపీ వాకా వెంకటరెడ్డి, చీమకుర్తి జెడ్పీటీసీ దుంపా రమణమ్మ, ఒంగోలు ఎంపీపీ పల్లపోలు మల్లికార్జునరెడ్డి, జెడ్పీటీసీ చుండూరి కోమలేశ్వరి తదితరులు తమ రాజీనామా నిర్ణయాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. జగన్న మాటంటే తమకు వేదవాక్కు అని, ఆయన మాటను జవదాటే ప్రశ్నేలేదన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి అన్నా, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నా తమకు ఎంతో ఇష్టమని, అంతా ఒకటే కుటుంబ సభ్యులమని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు