పేదల ఆరోగ్యం కోసం ఖర్చుకు వెనుకాడం 

15 May, 2021 04:13 IST|Sakshi
కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను పరిశీలిస్తున్న మంత్రి బాలినేని, కలెక్టర్‌ పోల భాస్కర్‌ తదితరులు

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి    

రూ.35 లక్షల సొంత నిధులతో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు   

ఒంగోలు టౌన్‌: పేదల ఆరోగ్యం కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడబోమని రాష్ట్ర విద్యుత్, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. కరోనా బారినపడిన వారంతా ఆరోగ్యంగా ఇంటికి వెళ్లాలన్నదే తన ముందున్న బాధ్యత అని పేర్కొన్నారు. సొంత నిధులు రూ.35 లక్షలతో ఒంగోలు జీజీహెచ్‌లో బాలినేని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ కింద ఆక్సిజన్‌తో కూడిన 100 పడకలతో ఏర్పాటుచేసిన జర్మన్‌ షెడ్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీజీహెచ్‌ పైఅంతస్తులో ఏర్పాటు చేయనున్న 100 పడకలకు అవసరమైన ఆక్సిజన్‌ వంటివి అమర్చేందుకు తన సొంత నిధులు రూ.15 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు.
బాలినేని ఉచిత కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్స్‌తో ఏర్పాటు చేసిన బెడ్స్‌  

తన కుటుంబంలోనూ కరోనా వచ్చిందన్నారు. తమ కుటుంబమంతా ఆలోచించి కరోనా బాధితులకు సేవచేసేందుకు ఎంత ఖర్చుకైనా వెనకాడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పేదలకు సేవచేసేందుకు జిల్లాలో కోటీశ్వరులు ముందుకు రావాలన్నారు. పేదలకు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను ఉచితంగా ఇస్తానని, ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఆదుకుంటానని చెప్పారు. ఇందుకోసం తన కార్యాలయంలో ఐదుగురిని నియమించినట్లు తెలిపారు. కరోనా వైద్యం విషయంలో సమస్యలు వస్తే తన దృష్టికి లేదా, కలెక్టర్‌ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మంత్రి వెంట కలెక్టర్‌ పోల భాస్కర్, జేసీ చేతన్, నగర మేయర్‌ సుజాత ఉన్నారు. 

మరిన్ని వార్తలు