విద్యుత్‌ రంగ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు

29 Oct, 2020 03:45 IST|Sakshi

కేంద్ర విద్యుత్‌ సవరణ చట్టాన్నే వ్యతిరేకిస్తున్నాం

ఆర్టీపీపీ అమ్ముతారనేది దుష్ప్రచారమే

30 ఏళ్లదాకా 9 గంటల ఉచిత విద్యుత్‌

మంత్రి బాలినేని స్పష్టీకరణ 

సాక్షి, అమరావతి: విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జెన్‌కో విద్యుత్‌ ప్లాంట్లను అమ్మేస్తున్నారనేది కేవలం కొంతమంది పనిగట్టుకుని చేసే దుష్ప్రచారమేనన్నారు. రైతన్నకు మరో 30 ఏళ్లదాకా పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యుత్‌ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై బుధవారం ఆయా సంఘాల ప్రతినిధులతో మంత్రి చర్చలు జరిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను అమ్మేస్తున్నారనేది వదంతులు మాత్రమేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ సవరణ బిల్లు 2020ను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఇదే విషయాన్ని తెలియజేస్తూ కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. 

ఉద్యోగుల సమస్యలపై సీఎంతో చర్చిస్తా
విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని మంత్రి చెప్పారు. 1999–2004 మధ్య కాలంలో చేరిన విద్యుత్‌ ఉద్యోగులకు పెన్షన్‌ పథకాన్ని వర్తింపజేయడంపై కూడా సీఎంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. కోవిడ్‌ సంక్షోభంలోని మార్చి, ఏప్రిల్‌ నెలలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సగం జీతాలు త్వరలోనే చెల్లిస్తామన్నారు. ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న విద్యుత్‌ ఉద్యోగుల వేతనాలు నేరుగా సంస్థల ద్వారా ఇవ్వాలనే డిమాండ్‌నూ పరిశీలిస్తామన్నారు.

వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారంటూ కొంతమంది రైతులను రెచ్చగొడుతున్నారని, అయితే రైతన్నపై పైసా భారం పడకుండా, మరింత జవాబుదారీతనంతో విద్యుత్‌ సరఫరా చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని బాలినేని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి, జెన్‌కో ఎండీ శ్రీధర్, డిస్కమ్‌ల సీఎండీలు పద్మాజనార్థన్‌ రెడ్డి, హరినాథ్‌రావు, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాగా మంత్రి తమ సమస్యలు సానుకూలంగా విన్నారని ఉద్యోగ సంఘాల నేతలు చంద్రశేఖర్, వేదవ్యాస్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు