ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు, బ్యానర్లపై నిషేధం

23 Sep, 2022 04:02 IST|Sakshi

నవంబర్‌ ఒకటో తేదీ నుంచి అమలు

గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నవంబర్‌ 1వ తేదీ నుంచి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు, బ్యానర్లను నిషేధిస్తూ ప్రభుత్వం గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ నిషేధం అమలు, ఉల్లంఘనలు, వాటిపై చర్యలు, ప్రత్యామ్నాయాలు తదితరాలకు సంబంధించిన మార్గదర్శకాలను నోటిఫికేషన్‌లో వివరించారు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల ఉత్పత్తి, దిగుమతులతోపాటు వినియోగం, ముద్రణ, రవాణా, ప్రదర్శనలకు నిషేధం వర్తిస్తుంది.

నిషేధం అమలును పట్టణాలు, నగరాల్లో కాలుష్య నియంత్రణ అధికారులు, మునిసిపల్‌ కమిషనర్లు, శానిటేషన్‌ సిబ్బంది పర్యవేక్షిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యవేక్షణ బాధ్యతను కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, పంచాయతీలు, గ్రామ సచివాలయాల సిబ్బందికి అప్పగించారు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు, బ్యానర్లకు బదులుగా కాటన్, నేత వ్రస్తాలను వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. 

ఉల్లంఘిస్తే జరిమానా  
నిబంధనలు ఉల్లంఘిస్తే ఫ్లెక్సీ చదరపు అడుగుకు రూ.100 జరిమానా విధిస్తారు. ఉల్లంఘనులపై పర్యావరణ చట్టం–1986 ప్రకారం చర్యలు తీసుకుంటారు. సీజ్‌చేసిన బ్యానర్లను శాస్త్రీయంగా డిస్పోజ్‌ చేయడానికి అవసరమైన ఖర్చును నిబంధనలు ఉల్లంఘించిన వారినుంచి వసూలుచేస్తారు.  పోలీస్, రెవెన్యూ, ట్రాన్స్‌పోర్ట్, జీఎస్టీ అధికారులు ప్లాస్టిక్‌ ఫెక్సీల నిషేధాన్ని పర్యవేక్షించే అధికారులకు సహాయపడతారు.    

మరిన్ని వార్తలు