జూలై నుంచి ప్లాస్టిక్‌పై నిషేధం

31 Oct, 2021 03:36 IST|Sakshi

ప్రత్యామ్నాయాలు వినియోగించాలి

రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి  

సాక్షి, అమరావతి: పర్యావరణానికి ఎంతో హాని చేసే సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ (ఒకసారి వాడి పడవేసేవి) వస్తువుల వాడకాన్ని ప్రజలు స్వచ్ఛందంగా ఆపివేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కోరింది. వచ్చే ఏడాది జూలై ఒకటి నుంచి సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించనుందని తెలిపింది. దీన్ని అంతా పాటించాలని అందుకోసం దశల వారీగా వాటిని వినియోగించడం మానివేయాలని కోరింది. నిషేధం అమల్లోకి వచ్చేలోగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపింది. సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిందని కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఈ ప్లాస్టిక్‌ వస్తువుల తయారీదారులపై జరిమానా విధించే అధికారం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి కల్పించినట్లు తెలిపింది. 

వాడకూడనివి ఇవే..
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల నిబంధనల ప్రకారం అలంకరణ కోసం వాడే థర్మాకోల్, స్వీట్‌ బాక్సులు, ఆహ్వాన పత్రికలు, సిగరెట్‌ ప్యాకెట్లలో వాడే ప్యాకింగ్‌ ఫిల్ములు, ప్లాస్టిక్‌ స్టిక్స్‌ ఉండే ఇయర్‌ బడ్స్, బెలూన్లకు వాడే ప్లాస్టిక్‌ స్టిక్స్, ప్లాస్టిక్‌ జెండాలు, క్యాండీ స్టిక్స్‌  ఐస్‌క్రీం పుల్లలు, ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, చెంచాలు, కత్తులు, స్ట్రాలు, ట్రేలు, వంద మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే పీవీసీ లేదా ప్లాస్టిక్‌ బ్యానర్లు వాడకూడదు. 

ప్రత్యామ్నాయాలివే..
సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ బదులుగా సేంద్రీయ పత్తి, వెదురు, చెక్క, మట్టి, పింగాణీ, త్వరగా ప్రకృతిలో కలిసిపోయే (కంపోస్టబుల్‌) ప్లాస్టిక్స్‌తో చేసిన వస్తువులు వాడాలి. మట్టిపాత్రలు, పింగాణీ పాత్రలను ఆహారం నిల్వ చేయడానికి వాడవచ్చు. చెత్త బుట్టలో వాడే సంచులు, కాగితపు కప్పులకు వాడే పైపూత, దుకాణాల్లో వాడే సంచులు, పండ్లు, ఆహార పదార్థాలను కప్పి ఉంచే పారదర్శక కవర్లు, ప్యాకేజింగ్, పంట పొలాల్లో మట్టిని కప్పడానికి వాడే కవర్లను కంపోస్టబుల్‌ ప్లాస్టిక్స్‌తో తయారు చేయవచ్చు.   

మరిన్ని వార్తలు