అరటి ధరహాసం.. హెక్టారుకు రూ.15లక్షల ఆదాయం

5 Jul, 2022 09:07 IST|Sakshi

అరటి రైతుల మోములో ఆనందం 

టన్ను ధర రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు  

హెక్టారుకు ఖర్చులు పోను సుమారు రూ.15 లక్షల ఆదాయం 

నంద్యాల జిల్లాలో 8 వేల ఎకరాల్లో సాగు 

ఎకరాకు 30 నుంచి 40 టన్నుల దిగుబడి

రోజు రోజుకూ అరటి ధరలు పెరుగుతున్నాయి. సాగు తక్కువగా ఉండటంతో ఉత్పత్తి తగ్గి అరటిధరలు రెట్టింపు అయ్యాయి. రెండు నెలల కిందట టన్ను రూ.5 వేల నుంచి రూ.8 వేలు ఉన్న ధర ఇప్పుడు ఏకంగా రూ.20 వేలకు చేరింది. యాపిల్‌ పండ్ల ధరలతో అరటి పోటీ పడుతోంది. పెరిగిన ధరలతో అరటి రైతుల ఆనందపడుతున్నారు.

ఆళ్లగడ్డ: ఈ ఏడాది అరటి సాగు చేసిన రైతులకు లాభాల పంట పండుతోంది. కాస్త ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ నికరంగా ఆదాయం తెచ్చిపెడుతుండటంతో రైతులు అరటి సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఉత్సాహంగా పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. నంద్యాల జిల్లా పరిధిలో ఈసారి సుమారు 10 వేల ఎకరాల్లో అరటి తోటలు సాగవుతున్నాయి. ముఖ్యంగా మహానంది, ప్యాపిలి, ఆళ్లగడ్డ, చాగలమర్రి, రుద్రవరం తదితర మండలాల్లోని రైతులు అధికంగా అరటి తోటల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. 

లాభాల వైపు అడుగులు 
రెండేళ్ల నుంచి ధర అంతంత మాత్రమే ఉన్న అరటి గెలల ధరలు ఇటీవల ఒక్కసారిగా భారీగా పెరిగాయి. రెండు నెలల వరకు టన్ను రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు ధర పలికింది. ఒక్కో సమయంలో కొనుగోలు చేసేందుకు  వ్యాపారులు రాక తోటలోనే వదిలేసిన సంఘటనలు ఉన్నాయి. అయితే అనూహ్యంగా జూన్‌ నుంచి ధరలు పెరగడం మొదలు కాగా ప్రస్తుతం ధరలు మరింత పెరిగి టన్ను రూ.20 వేల నుంచి రూ.25 వేల పైగానే ధర పలుకుతోంది.

అరటి తోట 

ప్రస్తుతం జీ9 రకం అరటికి మంచి గిరాకీ ఉంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలతో పాటు కృష్ణా, ఉభయ గోదావరి తదితర ప్రాంతాల్లో అరటి దిగుబడులు లేకపోవడంతో ప్రస్తుతం రాయలసీమ అరటి గెలలకు మంచి డిమాండ్‌ వచ్చింది. కేరళ, తమిళనాడు, బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ధర ఊహించిన దానికంటే ఎక్కువగా పలుకుతుండటంతో నిన్నటి మొన్నటి వరకూ ధరలేక నష్టపోయిన రైతులు పెరిగిన ధరను చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. 

10 వేల ఎకరాల్లో సాగు 
నంద్యాల జిల్లాలోని వివిధ మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నారు. ఎకరాకు 1,200 మొక్కలు (టిష్యూ కల్చర్‌) చొప్పున రూ.60 వేలు ఖర్చు చేసి నాటుతున్నారు. సాగు ఖర్చులు, మందులకు అంతా కలిపి ఎకరాకు మరో రూ..40 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు అవుతుంది. కౌలు రైతుకు అయితే మరో రూ.30 వేలు అదనంగా అవుతుంది. 1,200 మొక్కల్లో కనీసం 900 నుంచి 1,000 చెట్లు గెలలు తెగినా సరాసరి 30 నుంచి 40 టన్నుల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం ఉన్న ధర ఉంటే ఖర్చులు పోను ఎకరాకు రూ.4 లక్షల వరకు ఆదాయం లభిస్తుంది. 

రెండో పంటకు ఖర్చు తక్కువ 
అరటి తోట సాగుకు తొలిసారి మాత్రమే ఖర్చు అధికంగా ఉంటుంది. రెండో ఏడాది ఎక్కువగా ఉండదు. కాండం నుంచి వచ్చిన ఐదారు పిలకల్లో మంచి పిలకను ఎంచుకుని మిగతావి తీసి వేస్తే సరిపోతుంది. దీంతో విత్తనం ఖర్చు సుమారు ఎకరాకు రూ.60 వేల వరకు తగ్గుతుంది. సేద్యాల ఖర్చు ఉండదు. ఎరువులు కూడా పెద్దగా అవసరముండక పోవడంతో రైతన్నలకు ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. 

రైతులకు చేయూత ఇలా.. 
ఏరియా, వాతావరణ పరిస్థితులను బట్టి ఆ ప్రాంతంలో సాగుకు అవసరమైన నాణ్యమైన టిష్యూ కల్చర్‌ మొక్కల నుంచి మైక్రో ఇరిగేషన్, సమగ్ర సస్యరక్షణ (ఐఎన్‌ఎం), సమగ్ర ఎరువులు, పురుగుల మందుల యాజమాన్యం (ఐపీఎం) ప్రూట్‌ కేర్‌ యాక్టివిటీ వరకు ఒక్కో రైతుకు గరిష్టంగా హెక్టార్‌కు రూ.40 వేల వరకు ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇస్తోంది. తోట బడుల ద్వారా రైతులకు సాగులో మెలకువలపై శిక్షణ ఇస్తున్నారు. సాగుచేసే ప్రతి రైతుకు గుడ్‌ అగ్రికల్చర్‌ ప్రాక్టీసెస్‌ సర్టిఫికేషన్‌ (జీఏపీ) ఇస్తారు.

మరిన్ని వార్తలు