మన ఫలం..ఎడారికి పయనం

26 Apr, 2022 12:55 IST|Sakshi

గల్ఫ్‌ దేశాలకు సీమ జిల్లాల నుంచి అరటి

ఎగుమతుల కేంద్రంగా పులివెందుల

రూ. 13 కోట్లతో అరటి ఎగుమతి కేంద్రం

రూ. 5 కోట్లతో ప్రాసెసింగ్‌ సెంటర్‌

జిల్లా వ్యాప్తంగా 23 వేల ఎకరాలకు పైగా సాగు

ఆనందం వ్యక్తం చేస్తున్న అరటి రైతులు

రైతు సుభిక్షంగా ఉంటే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష. ఇందుకు అనుగుణంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు  పెద్దపీట వేస్తూ రైతాంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. దీంతోపాటు రైతులు పండించిన పంట దిగుబడులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ అన్నదాతకు అండగా నిలుస్తున్నారు.   

కడప అగ్రికల్చర్‌: జిల్లాలో సాగు చేస్తున్న అరటికి గిట్టుబాటు ధర లభించేలా ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఈ ప్రాంతం నుంచి గల్ఫ్‌ దేశాలకు అరటిని తరలిస్తున్నారు. పులివెందులలో అరటి ఎగుమతి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే వైఎస్సార్‌ జిల్లాతోపాటు పక్కనున్న అన్నమయ్య, అనంతపురం జిల్లాల్లో పండించే అరటిని సైతం ఇక్కడి నుంచే విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం లభిస్తుంది.  

పులివెందుల నియోజక వర్గం నుంచే 
పులివెందుల, వేముల, వేంపల్లి, సింహాద్రిపురం ప్రాంతాలలో గ్రాండ్‌ –9 రకానికి చెందిన అరటిని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. ఈ రకం అధిక దిగుబడి రావడంతోపాటు ఎక్కువ కాలం నిల్వ ఉండి ఎగుమతులకు అనుకూలంగా ఉంటుందని పలువురు రైతులు తెలిపారు. పులివెందుల ప్రాంతంలో సాగు చేసే ఈ రకాన్ని గత మూడేళ్ల నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇలా ఎగుమతి చేసే అరటికి స్థానిక మార్కెట్‌ ధరకంటే కొంతమేర రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. స్థానిక మార్కెట్‌కు అరటిని తరలించాలంటే అందుకు తగ్గ ఖర్చులన్నీ రైతులే భరించాల్సి ఉంటుంది. ఇదే అరటిని ఇతర దేశాలకు ఎగుమతికి అనుమతి వస్తే పంట దిగుబడికి మూడు నెలల ముందు నుంచే కంపెనీ ప్రతినిధులు పంటను పర్యవేక్షించుకుంటూ.. పరిరక్షించుకుంటారు. పంట దిగుబడి వచ్చే వరకు అయ్యే  ఖర్చులన్నీ వారే భరిస్తారు.  

 ముమ్మరంగా ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్‌ పనులు  
పులివెందుల, వేంపల్లి, వేముల, సింహాద్రిపురం మండలాలతోపాటు జిల్లాలో ఇంకా పలు మండలాల్లో అధికంగా పండించే అరటిని స్టాకు పెట్టుకుని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసుకునేందుకు వీలుగా 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్‌ పనులను పులివెందులలో చేపట్టారు. 125 మెట్రిక్‌ టన్నుల కెపాసిటీతోపాటు 600 మెట్రిక్‌ టన్నుల కోల్డ్‌స్టోరేజ్‌  కెపాసిటీతో ఈ పనులను ప్రారంభించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 13 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులు ముమ్మరంగా నడుస్తున్నాయి.   

మూడేళ్ల నుంచి ఎగుమతులు  
పులివెందుల ప్రాంతంలో పండించిన గ్రాండ్‌–9 అరటి రకాన్ని గత మూడేళ్ల నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇందులో 2018–19 ఏడాదికి సంబంధించి 25 మెట్రిక్‌ టన్నులను, 2020–21 సంవత్సరానికి సంబంధించి 2177 మెట్రిక్‌ టన్నులను, 2021–22 సంవత్సరానికి సంబంధించి 983 మెట్రిక్‌ టన్నులను ఎగుమతి చేశారు. ఈ ఎగుమతి చేసిన అరటి పండ్లను సింగపూర్, దుబాయ్, ఇరాన్, ఇరాక్‌ దేశాలకు కంటైనర్ల ద్వారా తరలించినట్లు స్థానిక ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. గతంలో అనంతపురం నుంచి మాత్రమే అరటిని ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేసేవారు. ప్రస్తుతం పులివెందుల ప్రాంతం నుంచి కూడా అరటిని ఇతర రాష్ట్రాలతోపాటు దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.   

అరటి రైతుకు భరోసా  
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్‌ ప్యాక్‌ హౌస్‌తోపాటు కోల్డ్‌ స్టోరేజ్‌ అందుబాటులోకి రానుండటం వల్ల అరటి రైతులకు మరింత భరోసా వచ్చింది. ఎగుమతులకు అనుగుణంగా అర టిని సిద్ధం చేసుకుని ఇతర రాష్ట్రాలకు, దేశాలకు పంపించుకునే  వెసులుబాటు లభిస్తుంది.      
– కొమ్మా రాంమల్లేశ్వరెడ్డి, అరటి రైతు, పులివెందుల

టన్ను రూ. 16 వేలకు అమ్ముకున్నా  
నేను 13 ఎకరాల్లో అరటిని సాగు చేశాను. ఇందులో 30 టన్నులను టన్ను రూ. 13 వేలతో నవంబర్, డిసెంబర్‌ నెలలో లోకల్‌ మార్కెట్‌లో అమ్ముకున్నాను. తరువాత ఫిబ్రవరి, మార్చిలో మరో 46 టన్నులను టన్ను రూ. 16 వేలకు పైగా రేటుతో ఎక్స్‌పోర్టుకు అమ్మాను. దీంతో మంచి డబ్బులు వచ్చాయి.
– భాస్కర్‌రెడ్డి, అరటిరైతు, నల్లపురెడ్డిపల్లె

రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది  
పులివెందులలో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్‌ హౌస్‌తోపాటు కోల్డ్‌ స్టోరేజీతో అరటి రైతుకు మేలు చేకూరనుంది. జిల్లాలో పండిన అరటిని స్టాక్‌ పెట్టుకోవడంతోపాటు ప్యాకింగ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇతర ప్రాంతాలకు ఎక్స్‌పోర్టు చేసుకునే వీలవుతుంది.  
– వెంకటేశ్వరరెడ్డి,  అసిస్టెంట్‌ డైరెక్టర్, ఉద్యానశాఖ 

మరిన్ని వార్తలు