టీడీపీలో మరోసారి బయటపడ్డ విభేదాలు

23 Oct, 2020 18:22 IST|Sakshi

సాక్షి, అమరావతి : గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ప్రతిపక్ష టీడీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అనంతపురం జిల్లాలో ఆ పార్టీల నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. పార్టీలో వ్యక్తుల ఆధిపత్య పోరు కారణంగా సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ శమంతకమణితో పాటు ఆమె కుమార్తె, మాజీ ఎమ్మెల్యే యామినిబాల ఇటీవల టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే శమంతకమణి నిష్క్రమణతో నేతల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. సింగనమల నియోజకవర్గ ప్రస్తుత ఇంఛార్జీ బండారు శ్రావణి పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు కాకుండా టీడీపీ నేత ఎంఎస్ రాజు వర్గానికి ప్రాధాన్యత ఇవ్వటంపై శ్రావణి అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇరువర్గల మధ్య పచ్చగడ్డేస్తే మండే విధంగా పరిస్థితి తారాస్థాయికి చేరింది.

లోకేష్‌ పర్యటనకు దూరంగా శ్రావణి..
ఈ క్రమంలోనే టీడీపీ నేత నారా లోకేష్‌ అనంతపురం పర్యటన విభేదాలను బయపడేసింది. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై సింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన శ్రావణి.. లోకేష్‌ పర్యటనకు దూరంగా ఉన్నారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోగా.. ఎంఎస్‌ రాజుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. నేతల పర్యటనపై తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో లోకేష్‌ పర్యటనకు దూరంగా ఉన్నారు. మరోవైపు అనంతపురం పర్యటన సందర్భంగా లోకేష్‌ కరోనా నిబంధనలు ఉల్లంఘించారు. కనీస సామాజిక దూరం పాటించకుండా.. నిబంధనలకు విరుద్ధంగా జనసమీకరణ చేశారు. కరోనా జాగ్రత్తలు పక్కనపెట్టి భారీ కాన్వాయ్ నడుమ పర్యటన చేశారు. లోకేష్‌ తీరుపై స్థానిక నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నారా లోకేష్ అబద్ధాలు బట్టబయలు..
శుక్రవారం జిల్లాలోని కరడికొండ, ధర్మాపురం, మిడుతూరు, రాందాస్ పేట, ,కామారుపల్లి గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన లోకేష్‌.. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ఆరోపణలు చేశారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. అయితే వరద నష్టంపై కలెక్టర్‌ గంధం చంద్రుడు వాస్తవాలు బహిర్గతం చేశారు. అనంతలో భారీ వర్షాలకు 38.53 కోట్ల పంట నష్టం జరిగిందని తెలిపారు. 13861 హెక్టార్లలో పంటలు నష్టపోయాయని వివరించారు. నష్టపోయిన రైతులకు వాతావరణ బీమా, ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తామని హామీ ఇచ్చారు. సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపామని, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సాధారణం కన్నా 60 శాతం అధికంగా వర్షాలు నమోదు కావటంతో క్రాప్ డ్యామేజ్ జరిగిందని కలెక్టర్‌ వెల్లడించారు. దీంతో నారా లోకేష్‌ అబద్ధాలు మరోసారి బట్టబయలు అయ్యాయి.

మరిన్ని వార్తలు