‘ఉక్కు’ సంకల్పంతో నేడు రాష్ట్ర బంద్‌ 

5 Mar, 2021 02:24 IST|Sakshi

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమం ఉధృతం 

బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు 

కార్మికులతో కలిసి నడుస్తాం: మంత్రి పేర్ని నాని  

కేంద్రానికి జనగళం వినిపించిన సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ నినాదంతో నేడు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ జరుగనుంది. బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలనే నినాదంతో తలపెట్టిన ఈ బంద్‌కు తాము పూర్తిగా సహకరిస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ప్రకటించారు. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు నినాదంతో ఆవిర్భవించిన స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు అన్ని పక్షాలు ఏకతాటిపై ముందుకు కదులుతున్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేసేలా ఐక్య కార్యాచరణ చేపట్టారు. నష్టాల పేరుతో బడా కార్పొరేట్‌ సంస్థలకు విశాఖ ఉక్కును ధారాదత్తం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని కార్మిక సంఘాలు నినదిస్తున్నాయి.

గత ఐదు రోజులుగా రాష్ట్రంలో పలు రాజకీయ పార్టీలు, సంఘాలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టాయి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బంద్‌ను విజయవంతం చేసి స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరించకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించాయి. సీపీఎం, సీపీఐలతోపాటు పలు కార్మిక సంఘాలతో విశాఖ ఉక్కు ఉద్యమంలో పాలుపంచుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు బంద్‌కు సంఘీభావం ప్రకటించారు. వర్తక, వ్యాపార సంస్థలతోపాటు విద్యాసంస్థలు, బ్యాంకులు, సినిమా థియేటర్లను స్వచ్ఛదంగా మూసివేసి బంద్‌కు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేసేలా తాము కూడా ప్రత్యక్షంగా పాల్గొంటామని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. బంద్‌ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తామని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు తెలిపారు. 

బంద్‌కు మద్దతుగా పలుచోట్ల బైక్‌ ర్యాలీలు
విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు నినాదంతో చేపడుతున్న బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. కేంద్రం తీసుకున్న మొండి నిర్ణయంతో కార్మికులు రోడ్డున పడతారని, వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను ఉ«ధృతం చేస్తామని హెచ్చరించారు. విజయవాడ బీసెంట్‌ రోడ్‌లో నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు, వి.ఉమామహేశ్వరరావు, సీపీఐ కృష్ణా జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, అనంతపురం తదితర జిల్లాల్లో కూడా ర్యాలీలు నిర్వహించారు.

చదవండి: (దేశవ్యాప్తంగా ఉత్తమ సిటీగా విశాఖ)

మరిన్ని వార్తలు