బండీకూట్‌ అనే నేను..

9 Feb, 2021 09:29 IST|Sakshi
రోబో పనితీరుని పరిశీలిస్తున్న కమిషనర్‌ సృజన, చీఫ్‌ ఇంజినీర్‌ వెంకటేశ్వరరావు

నగరానికి వచ్చేశా... సోమవారం సాయంత్రం రామ్‌నగర్‌ రహదారిలో ట్రయల్‌ రన్‌లో పాల్గొన్నాను. మ్యాన్‌హోల్స్‌ను చిటికెలో శుభ్రం చేసేశాను. త్వరలోనే నగరంలోని అన్ని మ్యాన్‌హోల్స్‌ను క్లియర్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాను. నా పనితీరు, సామర్థ్యం గురించి చెబుతా మరి
– సాక్షి, విశాఖపట్నం  


హాయ్‌... సిటిజన్స్‌... ఐయామ్‌ బండీకూట్‌.. వెర్షన్‌ 2.0.. మేడిన్‌ ఇండియా.. 

నీ స్పెషల్‌ ఏంటి బండీకూట్‌..? 
ఇన్నాళ్లూ.. ఎంతో మంది మనుషుల ప్రాణాలు హరించిన మ్యాన్‌హోల్స్‌ని ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా ఒంటిచేత్తో శుభ్రం చేయగలను. 

ఎలాంటి పనులు చెయ్యగలవ్‌..? 
ఒక మ్యాన్‌ హోల్‌ శుభ్రం చేయడానికి స్కావెంజర్లు ఎంత ఇబ్బంది పడతారో మీకు తెలుసా..? సఫాయి కార్మికులు లోపలికి దిగి, శుభ్రం చేసి తిరిగి పైకి చేరుకునే వరకూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పనిచేస్తుంటారు. నేనలా కాదు.. ఒన్స్‌ ఇన్‌ ఫీల్డ్‌ మ్యాన్‌హోల్‌ క్లీన్‌ అవ్వాల్సిందే. 

అవునా.. మరి నీకేం కాదా...? 
జీవీఎంసీ పరిధిలో 781 కిలోమీటర్ల యూజీడీ నెట్‌ వర్క్‌ ఉంది. నగర పరిధిలో మొత్తం 38,700 మ్యాన్‌హోల్స్‌ ఉన్నాయి. వీటిని క్లియర్‌ చేసేందుకు 500 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. మ్యాన్‌ హోల్‌ క్లియర్‌ చేసేందుకు లోపలికి దిగుతున్న కార్మికులు అందులోంచి ఉత్పన్నమయ్యే విషవాయువుల కారణంగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. నేను రోబో కదా ఏ చిన్న ప్రమాదానికి గురికాకుండానే క్లీన్‌ చేసేస్తాను.

నీ ప్రోగ్రామింగ్‌ ఎలా ఉంటుంది.? ఎలా పనిచేస్తావ్‌..?
నేను స్పైడర్‌ టెక్నాలజీతో పనిచేస్తాను. మ్యాన్‌హోల్‌ బ్లాక్‌ అయితే సెన్సార్‌ ద్వారా సమాచారం తెలుసుకొని అధికారులు నన్ను ఆ మ్యాన్‌హోల్‌ దగ్గరికి తీసుకెళ్తారు. నాలో ఇన్‌బిల్ట్‌ కెమెరా ఉంటుంది. నైట్‌ విజువల్‌తో రాత్రి సమయంలోనూ మ్యాన్‌హోల్‌ లోపల స్పష్టంగా కనింపిచేలా వాటర్‌ప్రూఫ్‌ కెమెరాలు నాలో ఉన్నాయి. ముందుగా... కెమెరాల ద్వారా.. ప్రోబ్లెమ్‌ ఎక్కడో గుర్తిస్తాను. మీకు చేతులున్నట్లుగానే.. నాకూ ఉంటాయి. అవి బయట 45 సెంటీమీటర్ల విస్తీర్ణంతో కనిపిస్తాయి. కానీ.. మ్యాన్‌హోల్‌లోకి వెళ్లాక.. ఎంత కావాలంటే అంత పెద్దగా విస్తరించగలను. ఎక్కడ బ్లాక్‌ అయిందో దాన్ని నిమిషాల వ్యవధిలో శుభ్రం చేసేస్తాను. అవరోధాల్ని బయటికి తీసి పారేస్తాను. 30 నుంచి 50 అడుగుల లోతున్న మ్యాన్‌ హోల్స్‌ని క్లియర్‌ చేయగలను.

ఎంత టైమ్‌లో క్లియర్‌ చేయగలవు.?
సాధారణంగా ఒక మ్యాన్‌హోల్‌ని ఇద్దరు సఫాయి కారి్మకులు 3 గంటలు క్లీన్‌ చేస్తారు. నేను గంటకు రెండు చొప్పున ఏకధాటిగా.. 4 గంటల్లో 8 మ్యాన్‌ హోల్స్‌ని క్లియర్‌ చేయగలను. ముందుగా మ్యాన్‌హో ల్‌లో ఉత్పన్నమయ్యే అమ్మోనియం నైట్రేట్, మీథేన్, హైడ్రోక్లోరిక్‌ సలై్ఫడ్‌.. ఎంత మోతాదులో ఉన్నాయని గుర్తించి బరిలో దిగుతాను.

వైజాగ్‌ ఎప్పుడు వచ్చావ్‌..? 
∙పైలట్‌ ప్రాజెక్టుగా నన్ను తీసుకొచ్చారు. సోమవారం సాయంత్రం రామ్‌నగర్‌ రహదారిలో జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన, చీఫ్‌ ఇంజినీర్‌ వెంకటేశ్వరరావు, నీటి సరఫరా విభాగం ఎస్‌ఈ వేణుగోపాల్‌ పర్యవేక్షణలో ట్రయల్‌ రన్‌లో పాల్గొన్నాను. నా పనితీరుని కమిషనర్‌ మెచ్చుకున్నారు తెలుసా..

ఇంతకీ మా వీధిలోకి ఎప్పుడొస్తావ్‌..?
నెలరోజుల్లో నగరమంతటా తిరుగుతా.. మీ మ్యాన్‌హోల్స్‌ మొత్తం క్లీన్‌ చేస్తా. మురుగు ముంచెత్తకుండా క్లియర్‌గా ఉంచుతా.
(చదవండి: గ్యాస్‌తో పంటకు నీరంట..!)
రసవత్తర పోరు: మామా అల్లుళ్ల సవాల్‌ 
 

మరిన్ని వార్తలు