సుజనా విదేశీ పర్యటన.. బ్యాంకింగ్‌ వర్గాల ఆందోళన

12 Jul, 2021 01:47 IST|Sakshi

ఆయన అమెరికా పర్యటనపై బ్యాంకింగ్‌ వర్గాల ఆందోళన

మాల్యా, నీరవ్‌ మోదీ, చోక్సీ బాటపడతారేమోనని అనుమానాలు

సాక్షి, అమరావతి: బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకుని పారిపోయిన విజయ్‌మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ బాటలోనే టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్‌ సుజనా చౌదరి విదేశాలకు వెళ్తుండటంపై బ్యాంకింగ్‌ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. 

ఇప్పటికే విజయ్‌మాల్యా, నీరవ్‌ మోదీ, చోక్సీలు రుణాలు ఎగ్గొటి విదేశాల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న విధంగానే సుజనా చేయనున్నాడా అన్నదే వారి ఆందోళనకు కారణం. ప్రజలు డిపాజిట్ల రూపంలో దాచుకున్న సొమ్మును ఎగ్గొట్టిన వారిపై వేగంగా చర్యలు తీసుకోకుండా అమెరికా పర్యటనకు అనుమతించడాన్ని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి బీఎస్‌ రాంబాబు తీవ్రంగా తప్పుబట్టారు. సుజనా చౌదరిని జూలై 12 నుంచి ఆగస్టు 11 వరకు అమెరికా పర్యటనకు అనుమతిస్తూ తెలంగాణ హైకోర్టు శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే.

డొల్ల కంపెనీలకు రూ.5,700 కోట్లు
బ్యాంకుల నుంచి సుజనా గ్రూపు రూ.5,700 కోట్ల రుణాలు తీసుకుని ఆ మొత్తాన్ని డొల్ల కంపెనీల ద్వారా మనీల్యాండరింగ్‌ విధానంలో నగదును తరలించినట్లు సీబీఐ స్వయంగా చార్జీషీటులో నమోదు చేయడమే కాక ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలియజేసింది. సుజనా సంస్థల్లో జరిపిన సోదాల్లో 126 సూట్‌కేస్‌ కంపెనీలకు చెందిన ఒరిజనల్‌ పాన్‌కార్డులు, 278 రబ్బర్‌ స్టాంపులు, ఖాళీ లెటర్‌హెడ్స్‌తోపాటు కీలక డాక్యుమెంట్లు లభించాయని తెలిపింది.

వీటిని పరిశీలిస్తే ఇక్కడ నుంచే బినామీ కంపెనీల లావాదేవీలను నిర్వహించనట్లు ప్రాథమికంగా నిర్థారణ అయ్యిందని సీబీఐ స్పష్టంచేసింది. అంతేకాక.. కేసు విచారణలో భాగంగా సుజనా చౌదరికి 2019లో నోటీసులు జారీచేయగా దర్యాప్తునకు సహకరించడంలేదని కూడా కోర్టుకు తెలిపింది. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు