అన్నదాతకు 'ఆర్థిక దన్ను'

9 Feb, 2021 05:27 IST|Sakshi

ప్రభుత్వ చేయూతకు తోడు భారీగా రుణాలిస్తున్న బ్యాంకులు 

2020–21లో రూ.1.28 లక్షల కోట్ల రుణవితరణ లక్ష్యం 

ఇప్పటివరకు రూ.90,558 కోట్ల రుణాల మంజూరు 

2019–20లో 94.47 లక్షల మందికి రూ.1.14 లక్షల కోట్ల రుణాలు 

కౌలుదారులకు కూడా పెద్ద ఎత్తున చేయూత

సాక్షి, అమరావతి: ఆరుగాలం శ్రమించే అన్నదాతకు ప్రభుత్వం అండగా ఉండటంతో వారికి మరింత చేయూత లభిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నదాతకు రుణాల మంజూరుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. రైతులతోపాటు కౌలుదారులకు కూడా విరివిగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. సీజన్‌ ఆరంభం కాగానే పెట్టుబడికి అవసరమైన రుణాల కోసం అన్నదాతల అగచాట్లు వర్ణనాతీతంగా ఉండేవి. చెప్పులరిగేలా బ్యాంకుల చుట్టూ తిరిగినా అదునుకు రుణాలందేవి కావు. దీంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, దళారుల వద్ద ఎక్కువ వడ్డీకి డబ్బు తీసుకోవాల్సి వచ్చేది. వచ్చిన పంటను అప్పు ఇచ్చినవాళ్ల చేతిలో పెట్టగా మిగిలిందే రైతులకు దిక్కయ్యేది. ఒకవేళ పంట విపత్తు బారిన పడితే ఆ అప్పులు తీర్చేదారి కనిపించేదికాదు. రెండేళ్లుగా ఈ పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సీజన్‌ ప్రారంభానికి ముందే చేతికందుతున్న వైఎస్సార్‌ రైతుభరోసాతో నారుమళ్లు పోసుకునేందుకు ఇబ్బందిలేకుండా ఉంది.  

2019–20లో 94.47 లక్షల మందికి రూ.1.14 లక్షల కోట్ల రుణాలు 
ప్రభుత్వం రైతుకు దన్నుగా ఉండటంతో వారికి రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. 2019–20 వ్యవసాయ సీజన్‌లో రూ.1.15 లక్షల కోట్ల రుణాలివ్వాలన్నది లక్ష్యం కాగా.. 94,47,103 మంది రైతులకు రూ.1,13,998 కోట్ల రుణాలిచ్చాయి. ఖరీఫ్‌లో పంట రుణాలు 48.60 లక్షల మందికి రూ.52,669 కోట్లు, టర్మ్‌ రుణాలు 6,36,266 మందికి రూ.12,908 కోట్లు ఇవ్వగా.. రబీలో పంటరుణాలు 34,48,181 మందికి రూ.36,604 కోట్లు, టర్మ్‌ రుణాలు 5,02,656 మందికి రూ.11,817 కోట్లు ఇచ్చాయి. 

2020–21లో రూ.1.28 లక్షల కోట్ల రుణవితరణ లక్ష్యం 
2020–21 వ్యవసాయ సీజన్‌లో రూ.1,28,659 కోట్ల రుణాలు మంజూరు చేయాలని బ్యాంకులకు లక్ష్యంగా నిర్దేశించారు. బ్యాంకులు జనవరి 20 నాటికి 69,87,298 మంది రైతులకు రూ.90,558 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. గడిచిన ఖరీఫ్‌లో రూ.75,237 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, 56,74,500 మంది రైతులకు రూ.74,155 కోట్లు (99శాతం) ఇచ్చాయి. దీన్లో 48,19,306 మంది రైతులకు రూ.57,575 కోట్ల పంటరుణాలు, 8,55,194 మందికి రూ.16,580 కోట్ల టర్మ్‌ రుణాలు ఉన్నాయి. 2019 ఖరీఫ్‌తో పోలిస్తే గడిచిన ఖరీఫ్‌లో పంటరుణాలు రూ.4,906 కోట్లు, టర్మ్‌రుణాలు రూ.3,672 కోట్లు అదనంగా ఇచ్చాయి. 

రబీలోను అదే జోరు 
ప్రస్తుత రబీ సీజన్‌లో రూ.53,422 కోట్లు రుణాలు ఇవ్వాలన్నది బ్యాంకులకు లక్ష్యంకాగా.. ఇప్పటివరకు 13,12,798 మంది రైతులకు రూ.16,403 కోట్లు ఇచ్చాయి. పంటరుణాలు రూ.36,407 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 11,33,185 మంది రైతులకు రూ.12,584 కోట్లు అందజేశాయి. టర్మ్‌రుణాలు రూ.17,015 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 1,79,613 మంది రైతులకు రూ.3819 కోట్లు ఇచ్చాయి.  

సీసీఆర్‌సీపై రూ.లక్ష రుణమిచ్చారు. 
నాకు సొంతంగా ఎకరం ఉంది. ఆరెకరాలు కౌలుకు తీసుకున్నా. దాళ్వాలో కంద, క్యాబేజీ, మినుము సాగుచేస్తున్నా. కౌలుకార్డు (సీసీఆర్‌సీ) ఇచ్చారు. ఆ కార్డుపైనే మా గ్రామంలో సహకార బ్యాంకులో అప్పు కోసం దరఖాస్తు చేశా. రూ.లక్ష మంజూరు చేశారు. గతంలో ఇలా కార్డుపై ఎప్పుడూ రుణం పొందలేదు. చాలా సంతోషంగా ఉంది. 
– పావులూరి మురళీకృష్ణ, కౌలురైతు, పెద ఓగిరాల, కృష్ణాజిల్లా 

లక్ష్యానికి మించే రుణాలిస్తాం 
గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా లక్ష్యానికి మించే రుణాలిస్తాం. ఖరీఫ్‌లో 99 శాతం రుణాలిచ్చాం. రబీలో ఇప్పటికే రూ.16 వేల కోట్ల రుణాలిచ్చాం. వచ్చే రెండు నెలల్లో లక్ష్యానికి అనుగుణంగా రైతులకు రుణాలిస్తాం.     
– బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, ఎస్‌ఎల్‌బీసీ 

కౌలురైతులకు విరివిగా రుణాలు 
2020–21 వ్యవసాయ సీజన్‌లో బ్యాంకులు 1,81,102 మంది కౌలుదారులకు రూ.760 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. 4,13,278 మంది సాగుదారులకు క్రాప్‌ కల్టివేటర్స్‌ రైట్‌ కార్డు (సీసీఆర్‌సీ) జారీచేయగా, వారిలో 58,772 మందికి వ్యక్తిగతంగా రూ.318 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. ఈ కార్డుదారులతో ఏర్పాటైన 16,387 జాయింట్‌ లయబిలిటీ గ్రూప్స్‌ (జేఎల్‌జీ), రైతుమిత్ర గ్రూపు (ఆర్‌ఎంజీ)ల్లోని 1,22,330 మందికి రూ.442 కోట్ల రుణాలు మంజూరు చేశారు.  

మరిన్ని వార్తలు