AP: మహిళలకు బ్యాంకుల రెట్టింపు రుణాలు 

25 Oct, 2022 08:03 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలకు బ్యాంకులు పెద్దపీట వేశాయి. ఒక్క ఏడాదిలోనే రెట్టింపు రుణాలను మంజూరు చేశాయి. గత ఏడాది మార్చి నెలాఖరు నాటికి బ్యాంకులు రూ.51,127 కోట్ల మేర రుణాలు మంజూరు చేయగా అదే ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఏకంగా రూ.1,05,399 కోట్లు ఇచ్చాయి. అంటే ఏడాదిలోనే బ్యాంకులు మహిళలకు రెట్టింపుకు పైగా రూ.54,272 కోట్లు (106 శాతం) మేర రుణాలను మంజూరు చేశాయి.  నిజానికి.. ఆర్‌బీఐ నిబంధనల మేరకు మొత్తం రుణాల మంజూరులో ఐదు శాతం మేర రుణాలను మహిళలకు ఇవ్వాలని ఉంది.
చదవండి: రైతుభరోసాపై ‘ఈనాడు’ విష ప్రచారం

కానీ, రాష్ట్రంలో మహిళలకు ఆర్‌బీఐ నిబంధనలకు మించి 20.95 శాతం మేర రుణాలను మంజూరు చేశాయని ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక వెల్లడించింది. ఇందుకు ప్రధాన కారణం మహిళల జీవనోపాధి మెరుగుదల.. మహిళా సాధికారత సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం వారికి అమలుచేస్తున్న పథకాలేనని స్పష్టమవుతోంది.

ఇందులో భాగంగానే.. ఎన్నికల్లో హామీఇచ్చిన మేరకు స్వయం సహాయక సంఘాల మహిళలకు ఎన్నికల నాటికి ఉన్న రుణాలను నాలుగు విడతల్లో తిరిగి ఇచ్చేందుకు వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని అమలుచేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాక.. సకాలంలో రుణాలు చెల్లించే స్వయం సహాయక సంఘాల మహిళలకు సున్నా వడ్డీని ప్రభుత్వం క్రమం తప్పకుండా అమలుచేస్తోంది. దీంతో పొదుపు సంఘాల మహిళల్లో క్రమశిక్షణ పెరిగింది. ఈ నేపథ్యంలో.. చేయూత, ఆసరా పథకాల మహిళలకు బ్యాంకులు గత మూడేళ్ల నుంచి లక్ష్యానికి మించి రుణాలు మంజూరు చేశాయి.

ఇంటి నిర్మాణానికీ పావలా వడ్డీకే రుణం 
అలాగే, నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో మంజూరు చేసిన 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను మహిళల పేరిటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పేదల ఇళ్ల నిర్మాణాల నిమిత్తం బ్యాంకులు ఒక్కో ఇంటి లబ్ధిదారునికి రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకే రుణాలిస్తున్నాయి. ఇలా గత నెలాఖరు నాటికి 5.21 లక్షల మంది ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు బ్యాంకులు రూ.1,836 కోట్లు మంజూరు చేశాయి. 

మరిన్ని వార్తలు