బషీర్ బాగ్ కాల్పులకు 21 ఏళ్ళు..

28 Aug, 2021 13:10 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: బషీర్ బాగ్ కాల్పులు జరిగి నేటికి 21 ఏళ్ళు అయ్యింది ఈ సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బషీర్ బాగ్ కాల్పుల అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఇందులో వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సీపీఎం నేత నర్సింగరావు  మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ చార్జీలు తగ్గించమంటే చంద్రబాబు దుర్మార్గంగా కాల్పులు జరిపించారని, ఈ కాల్పుల్లో ముగ్గురు అమరులు కాగా ఎంతోమంది విద్యార్థులు క్షతగాత్రులు అయ్యారన్నారు.

అప్పట్లో జరిగిన ఈ ఉద్యమంలో రాజశేఖర్ రెడ్డితో ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారని, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన రాజశేఖర్‌ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం విద్యుత్ చార్జీలు పెంచలేదన్నారు. చరిత్రలో బషీర్ బాగ్ ఉద్యమం నిలిచిపోతుందని తెలిపారు. బషీర్ బాగ్ ఉద్యమంతోనే చంద్రబాబు పాలన అంతమైందని విమర్శించారు.

కాగా, విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ 2000 ఆగష్టు 28న వామపక్షాలు చలో అసెంబ్లీ చేపట్టారు. ఆనాటి ఈ విద్యుత్ ఉద్యమానికి రైతులు భారీగా తరలివచ్చారు. ఆ సమయంలో జరిపిన కాల్పుల్లో బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్రెడ్డి మృతి చెందారు. ఈ ముగ్గురు అమరవీరులకు వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు శనివారం నివాళులు అర్పించారు.

మరిన్ని వార్తలు