అడ్డాకుల వినియోగం.. ఆరోగ్యానికి మేలు

29 Mar, 2022 23:08 IST|Sakshi
వారపుసంతలో విక్రయాలు చేస్తున్న అడ్డ గింజలు, వారపు సంతల్లో విక్రయాలు చేస్తున్న అడ్డ ఆకులు

హుకుంపేట(అరకు): గిరిజన ప్రాంతంలో ఆరోగ్యపరంగా, వాణిజ్యపరంగా పేరు గాంచింది అడ్డ తీగ. ఫణెర వహ్లి అనే శాస్త్రీయ నామంతో పిలిచే ఈ అడ్డ చెట్లు విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో అడవితో పాటు పలు చోట్ల సహజంగాను పెరుగుతాయి. ఈ అడ్డ ఆకులతో విస్తరాకులు, బెరడుతో తాళ్లు, అడ్డ గింజలు.. ఇలా చెట్టులోని అన్ని భాగాలు గిరిజనులకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ ఆకులను, గింజలను, అడవుల నుంచి సేకరించి వారపు సంతల్లో విక్రయిస్తుంటారు.  

సమృద్ధిగా యాంటీ ఆక్సిడెంట్లు 
అడ్డ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉండటం వలన ఈ ఆకులను తింటే ఆరోగ్యానికి మేలు చేకూరటమే కాక, జీర్ణ సంబంధిత సమస్యలు కూడ తగ్గుతాయి. అడ్డ గింజల్లో ప్రోటీన్, కాల్షియం ఇంకా ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది  షుగర్‌ బారిన పడకుండా కాపాడుతుంది. ఏజెన్సీలో సంక్రాంతి రోజు గిరిజన సంప్రదాయ వంటరం పులగం అన్నంలో ఈ అడ్డ గింజలను వేసి దేవతలకు నివేదిస్తారు. ఆ తర్వాత పులగం అన్నం వండుకుని అడ్డాకులలో భుజిస్తారు. కొన్ని ప్రముఖ దేవాలయాల్లో అడ్డాకులను ప్రసాదం ప్యాకింగ్‌ కోసం నేటికీ సంప్రదాయంగా వాడటం విశేషం. 

అడ్డ చెట్టులో కాచిన అడ్డ కాయలు, అడ్డ కాయలకు కట్టిన అడ్డ తాడు

నేటి తరానికి వివరించాలి 
క్రమేపీ గిరిజనుల్లో అడ్డ ఆకుల సంప్రదాయపు అలవాట్లు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత తరానికి వీటి ప్రాముఖ్యత తెలియక వాటిని పట్టించుకోవటం లేదు. మరోవైపు అడ్డాకుతో తయారయ్యే విస్తరాకుల ఉత్పత్తి తగ్గటం వలన పేపర్‌ ప్లేట్‌ వాడటం పెరిగింది. పేపర్‌ ప్లేట్లు  పర్యవరణానికి అంత అనుకూలమైనది కాదు కనుక ఈ అడ్డతీగ ప్రాముఖ్యత అందరికి తెలియాల్సిన అవసరం ఉంది. సహజంగా దొరికే ఈ అడ్డాకులతో విస్తర్లుగా చేసి పేపర్‌ ప్లేట్లకు ప్రత్యామ్నయంగా వాడితే పర్యవరణానికి మేలు చేసినట్లేనని పలువురు మేధావులు, గిరిజనులు అభిప్రాయ పడుతున్నారు. 

అప్పట్లో అడ్డాకులే జీవనాధారం 
మా చిన్నతనంలో అడవిలోకి వెళ్లి అడ్డాకులు సేకరించే వాళ్లం. వాటిని ఎండబెట్టి, వారానికి ఒకసారి వారపు సంతల్లో విక్రయించి వచ్చిన డబ్బులతో జీవనం కొనసాగించాం. అడ్డ గింజలతో కూర వండుకునేవాళ్లం. ఇప్పుడు అడ్డాకులు సంతల్లో అమ్ముదామన్నా గిట్టుబాటు ధర ఉండట్లేదు. ప్రభుత్వ అధికారులు జీసీసీ ద్వారా అడ్డాకులు కొనుగోలు చేస్తే మాకు ఉపాధి కలుగుతుంది.  
–పాంగి కాసులమ్మ, కామయ్యపేట గ్రామం, హుకుంపేట మండలం 

ఆరోగ్యానికి మంచిది 
విశాఖ ఏజెన్సీ అడవుల్లో సహజంగా దొరికే ఈ అడ్డాకులు, అడ్డ గింజలు ఆరోగ్యపరంగా ఎంతో మంచివి. వీటిని వీడీవీకే కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తే గిరిజనులకు మంచి ఉపాధి లభిస్తుంది. వీటితో విస్తరాకులు తయారు చేసి  ఉపయోగిస్తే పేపర్‌ ప్లేట్లు విక్రయాలు తగ్గించి, పర్యావరణాన్ని కాపాడవచ్చు. విస్తరాకుల ద్వారా మంచి ఉపాధితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.  
–డా.శ్రావణ్‌కుమార్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, పర్యావరణ విభాగం, బాబా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, విశాఖ  

అడ్డ ఆకు, తీగలతో ప్రయోజనాలు 
అడ్డాకులతో విస్తరాకుల తయారీ 
అడ్డ తీగలతో నారలు చేసి కంచెలు కట్టడం 
 అడ్డ తీగలతో బుట్టలు అల్లుకోవటం 
 అడ్డ గింజలను ఆహారం(స్నాక్స్‌) రూపంలో తీసుకోవటం

మరిన్ని వార్తలు