ఇల్లు చూపి ఇల్లాలిని చేసుకునే ఓ ‘పిట్ట’ కథ

23 Oct, 2022 17:55 IST|Sakshi

ఆత్మకూరు రూరల్‌(నంద్యాల జిల్లా): అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే అన్నాడో కవి.. ఆమె ఓర చూపే మోక్ష మార్గం అని కూడా వర్ణించాడు. ప్రేయసి కోసం మనుషులు ఇలా కవిత్వాన్ని ఆశ్రయిస్తే.. ఓ పక్షి మాత్రం గూడుకట్టి తన గుండె స్పందనను తెలుపుతోంది. ప్రేమ కోసం తన అద్భుత నైపుణ్యాన్ని ప్రదరిస్తున్న అందరికీ తెలిసిన ‘పిట్ట’ కథ ఇదీ..
చదవండి: రెస్టారెంట్‌లో బిర్యానీ తింటున్నారా?.. అయితే మీకో చేదు వార్త

ఏటి ఒడ్డునో, చెరువు గట్టునో ఈత, తుమ్మ వంటి చెట్ల చిటారు కొమ్మలకు వేలాడుతూ గిజిగాళ్లు నిర్మించిన గూళ్లు కనపడుతుంటాయి. వీటి నిర్మాణ శైలి అద్భుతంగా ఉంటుంది. ఈతనారను జాగ్రత్తగా సేకరించే మగ పక్షులు అద్భుతమైన నైపుణ్యంతో గూళ్లు నిర్మిస్తాయి. తమకు ప్రమాదకరమైన పాములు, కాకులు వంటి వాటి నుంచి రక్షించుకునేందుకు ఏటినీళ్ల పైన వేలాడే విధంగా, గట్టుపైన ఉండే చెట్ల కొమ్మలు నీటిపై వేలాడే చోట గూళ్లు కడతాయి. తిరగవేసిన కిరోసిన్‌ దీపం చిమ్నిలా ఈ గూళ్లలో ప్రత్యేకమైన గదులు, మెత్తటి పాన్పులాంటి నిర్మాణాలుంటాయి. నల్లమల అటవీ సమీప గ్రామాలు, పరిసర ప్రాంతాల్లో గిజిగాడి గూళ్లు విరివిగా కనిపిస్తుంటాయి.  

 

ప్రేమకోసం.. 
ఆంగ్లంలో వీవర్‌ బర్డ్‌గా ఈ పక్షిని పిలుస్తారు. ఆత్మకూరు పరిసర ప్రాంతాల ప్రజలు వీటిని పిట్టలుగానే గుర్తిస్తారు. మగపక్షి గూడును నిర్మించి ఆడపక్షిని ఆకర్షిస్తుంది. గూడు చూపి ఆడపక్షితో జతకట్టేందుకు ఆహ్వానిస్తుంది. ఇల్లును చూసి ఇల్లాలి నైజం గ్రహించ వచ్చని పెద్దలు చెబుతుంటారు. అయితే గిజిగాడి పక్షుల్లో మాత్రం ఇల్లాలి కోసం మగ పక్షి ఇల్లు(గూడు) కడుతుంది. సగం గూడు నిర్మించే మగ పక్షి అటు వెళ్లే ఆడపక్షులకు తన గూడును చూడరమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా గూటిపై వాలి రెక్కలల్లారుస్తూ కువకువలాడుతుంది. ఈ దృశ్యం చూడముచ్చటగా ఉంటుంది.

గూడు నచ్చితే ఆడపక్షి మగపక్షితో జతకట్టేందుకు అంగీకరిస్తుంది. గూడు నచ్చక ఆడపక్షి ‘నో ’ చెబితే అసంపూర్ణ నిర్మాణాన్ని (గూడు) వదలి మరోచోట మరో గూడు కట్టేందుకు మగ పక్షి సిద్ధమవుతుంది. ఆడపక్షి గూడు నచ్చి అంగీకారం వ్యక్తపరచగానే మగపక్షి మిగిలిన గూడు నిర్మాణం పూర్తి చేస్తుంది. ఆడపక్షి గూటిలో గుడ్లు పెడితే వాటి సంరక్షణ మగపక్షి చూసుకుంటుంది. పిల్లలు గుడ్లనుంచి బయటికి రాగానే వాటి పోషణ భారం మాత్రం ఆడపక్షే మోస్తుంది. ఒక్కో ప్రదేశంలో గిజిగాళ్లు  రెండు వందల వరకు సామూహికంగా గూళ్లు నిర్మించుకుని సామాజిక జీవనం గడుపుతాయి. శత్రువులు దాడి చేసినపుడు మూకుమ్మడిగా పెద్దగా అరుస్తూ తమ పిల్లలను, గూళ్లలోని గుడ్లను రక్షించుకునే ప్రయత్నం చేస్తాయి.

గిజిగాడిపై ఖండకావ్యం 
గిజిగాళ్లు జీవిత కాలం 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇవి కీటకాలు, వివిధ రకాల విత్తనాలను తిని బతుకుతుంటాయి. ఎంత వర్షం వచ్చినా, సుడిగాలి వీచినా గూడు చెదరకుండా, తడవకుండా బలంగా నిర్మించుకుంటాయి. గిజిగాడి నైపుణ్యానికి మెచ్చి మహాకవి గుర్రం జాషువా ఖండ కావ్యాన్ని రచించారు. ‘‘తేలిక గడ్డి పోచలను దెచ్చి, రచించెదవీవు తూగుటు య్యేల గృహంబు’’ అంటూ తన పద్యంలో  ‘‘బంగారువన్నెగల దుస్తులు ధరించి, నీ భార్యా పిల్లలు నీ పొదిగిట నిద్రిస్తుండగా, హాయిగా వీచే పిల్లగాలులు మీరున్న ఊయల గృహాన్ని ఊపుతూ ఉండగా, ఏమాత్రం భయంలేకుండా ప్రశాంతంగా నిద్రిస్తుంటావు. నీకున్న ఆ గొప్ప సుఖం మాకెక్కడుందిరా గిజిగా! అసలు మాకేమిటిరా.. ఏ మహరాజుకైనా అంతటి సుఖం ఉంటుందంటావా?’’ అంటూ ఆ గిజిగాని వైభవాన్ని కీర్తించారు.    

మరిన్ని వార్తలు