బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే సీఎం లక్ష్యం

23 Feb, 2023 04:13 IST|Sakshi
ఫిషింగ్‌ హార్బర్‌లో సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న మత్స్యకార మహిళలు

బీసీ, ఎస్సీ సంఘాల హర్షం

సీఎం జగన్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం

అమలాపురం రూరల్‌/చిలకలూరిపేట/మహారాణిపేట (విశాఖ దక్షిణ): బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం వైఎస్‌ జగన్‌ పనిచేస్తున్నారని ఎస్సీ, బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తాజాగా ప్రకటించిన 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 14 ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించినందుకు సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపాయి.

బుధవారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికిపూడిలో సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి మంత్రి విడదల రజిని క్షీరాభిషేకం నిర్వహించారు. అలాగే బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రోళ్లపాలెంలో ఎస్సీ సంఘాలు కేక్‌ కట్‌ చేసి ఆనందం వ్యక్తం చేశాయి. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించాయి.

అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోలా గురువులును ప్రకటించినందుకు విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో మత్స్యకార మహిళలు, బోటు యజమానులు, డ్రైవర్లు, వ్యాపారులు సంతోషం వ్యక్తం చేశారు.

‘సీఎం సార్‌ థ్యాంక్స్‌’ అంటూ నినదించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘాల నాయకులు మూగి రాజా,జోగి సుధాకర్, దుంపు ఈశ్వర్‌ రెడ్డి, పిల్లా సుభద్రమ్మ, కె.పోలమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న మంత్రి రజిని తదితరులు 

బీసీలకు వెన్నుదన్నుగా సీఎం జగన్‌: మంత్రి గుమ్మనూరు 
ఆలూరు రూరల్‌: బీసీలకు సముచిత స్థానం కల్పించిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌ అని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. బుధవారం ఆయన ఆలూరులో మీడియాతో మాట్లాడారు.

శాసనమండలికి వైఎస్సార్‌సీపీ తరఫున 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించగా.. అందులో 11 మంది బీసీలేనని చెప్పారు. 68 శాతానికి పైగా ఎమ్మెల్సీ పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కట్టబెట్టడం ద్వారా సీఎం జగన్‌ తన నిబద్ధతను మరో­సారి చాటుకున్నారని పేర్కొన్నారు. 

వైఎస్సార్‌సీపీతోనే బీసీలకు ఆత్మగౌరవం: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి 
సాక్షి, విశాఖపట్నం: చట్టసభల్లో బీసీలకు సీఎం జగన్‌ పెద్దపీట వేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. టీడీపీ హయాంలో బీసీలకు అవమానాలు ఎదురవ్వగా.. జగన్‌ ప్రభుత్వంలో ఆత్మగౌరవం పెరిగిందన్నారు.

బుధవారం విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడారు. మత్స్యకారులను చంద్రబాబు తాట తీస్తా­నంటే.. సీఎం జగన్‌ వారిని అక్కున చేర్చు­కున్నారని కొనియాడారు. మత్స్యకారులంతా కాలర్‌ ఎగురేసుకొని తిరిగేలా రాజకీయ ప్రాధాన్యం కల్పించారని ప్రశంసించారు.  

>
మరిన్ని వార్తలు