బీసీల సంక్రాంతి

9 Dec, 2020 04:49 IST|Sakshi
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో విలేకరులతో మాట్లాడుతున్న మంత్రులు పెద్దిరెడ్డి, వెలంపల్లి, చెల్లుబోయిన తదితరులు

11న బీసీ కార్పొరేషన్‌ చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం

సీఎం వైఎస్‌ జగన్‌ హాజరు

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు పెద్దిరెడ్డి, చెల్లుబోయిన, వెలంపల్లి

లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఇటీవల నియమితులైన 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఈనెల 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో బీసీల సంక్రాంతి పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని,  వారిపట్ల తనకున్న ప్రేమ, నమ్మకాన్ని చాటనున్నారని ఆయన చెప్పారు. స్టేడియంలో  ప్రమాణ స్వీకార ఏర్పాట్లను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బీసీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వెలంపల్లి శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో డిక్లరేషన్‌ ప్రకటించి వెనుకబడిన కులాలకు అండగా ఉంటానని, వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్రంలో ఉన్న 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్నారు. బీసీల కోసం ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. ఈ కార్యక్రమాన్ని 6 వేల మంది ప్రత్యక్షంగా వీక్షించేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తున్నామని, దీనికి హాజరయ్యే వారికి పాస్‌లు జారీ చేస్తామని చెప్పారు.
 
బీసీల కల నెరవేరబోతోంది: మంత్రి  చెల్లుబోయిన 
వెనుకబడిన తరగతుల వారిని కల్చర్‌ ఆఫ్‌ ఇండియాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తించారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు కోసం అధ్యయన కమిటీ వేసి, ఏడాది వ్యవధిలో 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, 56 మంది చైర్మన్లు, 672 మంది డైరెక్టర్లను నియమించినట్టు వివరించారు. వారిలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఒకే వేదికపై డైరెక్టర్లు, చైర్మన్లు ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా బీసీలకు ముందే సంక్రాంతి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్లాది విష్ణు, ఎమ్మెల్యే జోగి రమేష్, బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్, కార్యదర్శి బి.రామారావు, డీసీపీ హర్షవర్దన్‌రాజు, వైఎస్సార్‌సీపీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు