రేపటి తరాలకు సీఎం జగన్‌ ఆదర్శం

31 Oct, 2020 22:49 IST|Sakshi

సాక్షి, గుంటూరు: దేశంలో ఎక్కడలేని విధంగా ప్రభుత్వ స్కూళ్లను మోడల్‌ పాఠశాలలుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీర్చిదిద్దుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ పేదలకు కార్పోరేషన్లు ఏర్పాటు చేశారని వ్యాఖ్యానించారు. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా అమ్మవడి పధకం వంటి పధకం ఎక్కడలేదని ప్రశంసించారు. దేశంలో ఎంతో మంది బీసీ ముఖ్య మంత్రులు రాష్ట్రాలను పరిపాలించారు కానీ, బీసీల ఎదుగుదలకు దోహదపడలేదన్నారు. ఏపీలో ఒక్క వైఎస్‌ జగన్‌కి మాత్రమే సాధ్యపడిందని తెలిపారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు గొప్ప విద్యా ప్రణాళికలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కి దక్కుతుందని తెలిపారు. రేపటి తరాలు, పాలకులకు సీఎం జగన్‌ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన పాలనలో ప్రజలు తల ఎత్తుకొని జీవిస్తున్నారని తెలిపారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమం కోసం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం సాహసోపేతమైన, జాతీయ స్థాయి నేతలే  సీఎం జగన్‌ను అభినందిస్తున్నారని అన్నారు. ఆయన అణగారిన వర్గాల వారికి, జీవన విధానాన్ని మార్చిన నాయకుడని కొనియాడారు. మంత్రి శ్రీరంగనాధరాజు మాట్లాడుతూ.. రాజమండ్రి బీసీ డిక్లరేషన్ బహిరంగ సభలో బీసీలకు ఇచ్చిన హామీలను సీఎం వైఎస్‌ జగన్‌ నెరవేర్చారని గుర్తు చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ బీసీ అంటే బ్యాక్‌ వార్డ్ కాదని బ్యాక్‌బోన్‌ అని నిరూపించారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని మాట్లాడుతూ.. బీసీ కులానికి చెందిన తనకు సీటు అడగగానే జగనన్న చిలకలూరిపేట నుంచి అవకాశం ఇచ్చారని తెలిపారు.టీడీపీ నాయకుల తీరు చూస్తుంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నట్లుగా ఉందన్నారు. బీసీలంతా తమ వైపే ఉన్నారని చెప్పుకునే టీడీపీ బీసీ కులాలతో ఆడుకుని వారిని ఆర్థికంగా, రాజకీయంగా ఎదగనివ్వకుండా చేసిందని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు