సమగ్ర భూ సర్వేలో వేగం పెంచండి

20 Jul, 2022 03:57 IST|Sakshi
మంత్రుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ధర్మాన, పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ

అక్టోబర్‌ నాటికి 2 వేల గ్రామాల్లో సర్వే పూర్తి కావాలి 

వివాదాస్పద భూముల విషయంలో అప్రమత్తంగా ఉండాలి 

రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించిన మంత్రుల కమిటీ 

సాక్షి, అమరావతి: సమగ్ర భూ సర్వేలో వేగం పెంచాలని, అక్టోబర్‌ నాటికి కనీసం 2 వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేసే లక్ష్యంతో పని చేయాలని ఉన్నతాధికారులను మంత్రుల కమిటీ ఆదేశించింది. వెలగపూడి సచివాలయంలో జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకం అమలు తీరును కమిటీకి నేతృత్వం వహిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సభ్యులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సర్వేను పట్టణ ప్రాంతాల్లోనూ వేగంగా చేయాలని చెప్పారు.

తాడేపల్లిగూడెం మునిసిపాలిటీలో ప్రయోగాత్మకంగా చేపట్టిన సర్వేను ఎప్పటికప్పుడు సమీక్షించుకుని ఎదురయ్యే అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ప్రతి జిల్లాలోనూ అర్బన్‌ ప్రాంతాల్లో సర్వేను ప్రారంభించేందుకు కనీసం రెండు రోవర్లు, డ్రోన్లు కేటాయిస్తామని తెలిపారు. గ్రామ కంఠాల సమస్యను కూడా ప్రభుత్వం సానుకూలంగానే పరిశీలించిందని, అర్హులైన వారికి యాజమాన్య హక్కు పత్రాలను జారీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తానని హామీ ఇచ్చారని, అందుకోసం చేపట్టాల్సిన చర్యలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సమగ్ర సర్వేలో అన్ని అంశాలు క్షుణ్ణంగా పరిశీలించకపోతే వివాదాస్పద భూములు, అటవీ భూములకు పట్టాలు ఇచ్చే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. దొంగ సర్టిఫికెట్లతో పెద్దఎత్తున అటవీ భూములను ఆక్రమించుకుని అనుభవిస్తున్నారని, ఈ భూముల విషయంలో రెవెన్యూ, ఫారెస్ట్‌ అధికారులు జాయింట్‌ సర్వే నిర్వహించాలని చెప్పారు.  

మరిన్ని వార్తలు