భల్లూక కల్లోలం 

24 Jan, 2022 05:43 IST|Sakshi
రోడ్డుపై గుంపులుగా సంచరిస్తున్న ఎలుగులు

ఉద్దానంలో విచ్చలవిడిగా సంచరిస్తున్న ఎలుగులు

జీడి సాగు చేయలేని దుస్థితి

ఇప్పటికే పలువురిపై దాడి  

వజ్రపుకొత్తూరు రూరల్‌: జంతువులు వనాల నుంచి జనాల మధ్యకు చేరుతున్నాయి. అటవీ ప్రాంతాలు కుచించుకుపోతుండడంతో వన్య మృగాలు ఆవాసాలను వెతుక్కుంటూ ఊళ్ల మీద పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఎలుగు బంట్లు ఇలాగే గ్రామాల్లోకి జొరబడుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యల్లో ఎలుగులు గుంపులు గుంపులుగా ఉద్దాన తీర ప్రాంత గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. రాత్రి వేళల్లో సైతం ఎలుగులు గ్రామ వీధుల్లో విచ్చల విడిగా సంచరిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ప్రధానంగా తమ జీవనాధారం అయిన జీడి పంట సాగు చేసేందుకు తోటలకు వెళ్లడానికి సైతం ప్రాణ భయంతో వెనుకంజ వేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

రైతులకు భయం..భయం 
జిల్లాలో ఉద్యానవనంగా ప్రత్యేక గుర్తింపు కలిగిన ఉద్దానానికి భల్లూకాల భయం వెంటాడుతోంది. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలో గల వజ్రపుకొత్తూరు, పలాస, మందస, కవిటి, కంచిలి, సోంపేట మండలాల్లో దాదాపుగా 15 వేల హెక్టార్లలో జీడి పంటను రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం జీడి పంట పూత దశలో ఉండటంతో రైతులు పంట రక్షణకు కంచె ఏర్పాట్లు, పురుగు మందులు పిచికారీతో పాటు ఇతర పనులు చేసేందుకు జీడి తోటలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఎలుగులు విచ్చల విడిగా తోటల్లో సంచరిస్తుండటంతో ఏ సమయంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. 

రాత్రిళ్లు వీధుల్లో సంచారం  
ప్రధానంగా ఉద్దాన తీర ప్రాంతాలైన గుణుపల్లి, మెట్టూరు, చీపురుపల్లి, రాజాం అనకాపల్లి, బహడపల్లి, సిరిపురం, డోకులపాడు, బాతుపురం, అక్కుపల్లి, బైపల్లి, గరుడబద్ర, ఎం.గడూరు, పల్లిసారథి తదితర గ్రామాల్లో రాత్రి సమయంలో ఎలుగులు సంచరిస్తుండటంతో ప్రజలు ఆరుబయట అడుగు పెట్టేందుకు వణికిపోతున్నారు. అలాగే రోడ్డులపై ప్రయాణం చేయడానికి సైతం వాహనదారులు భయపడుతున్నారు. ఇప్పటికే అనేక మంది ఎలుగు దాడికి గురైన సంఘటనలు ఉద్దానంలో చోటు చేసుకున్నాయి. అలాగే అక్కుపల్లిలో ఓ దుకాణంలోకి, రాజాంలో అంగన్‌వాడీ కేంద్రంలోకి జొరబడి సరుకులు ధ్వంసం చేశాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎలుగులు సంచారాన్ని నియంత్రించాలని కోరుతున్నారు.

తోటకు వెళ్లడానికి భయం వేస్తోంది  
కౌలుకు తీసుకున్న జీడి పంటను సాగు చేసేందుకు తోటకు వెళ్దామంటేనే భయం వేస్తోంది. నిత్యం ఎలుగులు తోటలో సంచరిస్తుండటంతో ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందో తెలీని పరిస్థితి ఉంది. జీవనాధారం అయిన జీడి పంటను విడిచి పెట్టలేక, సాగు చేయలేక అయోమయంగా ఉంది.  
– మడ్డు భూలక్ష్మి, జీడి కౌలు రైతు, డోకులపాడు, వజ్రపుకొత్తూరు మండలం. 

 కవ్వింపు చర్యలు వద్దు.. 
ఎలుగుల సంచారంపై ఇప్పటికే గ్రామాల్లో అవగాహన చర్యలు చేపడుతున్నాం. తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరిస్తున్నాం. ఎలుగు కనబడినా.. ఎదురుపడినా కవ్వింపు చర్యలకు పాల్పడొద్దు. వాటిని రెచ్చగొట్టేలా ప్రవర్తించొద్దు. అరుపులు కేకలు వేస్తే భయాందోళనకు గురై మనిషి మీద దాడికి యత్నిస్తాయి. అలాగే రైతులు జీడి తోటలకు ఒంటరిగా వెళ్లొద్దు. తోటల్లోకి వెళ్లేటప్పడు రక్షణాయుధాలను, పనిముట్లను వెంట ఉంచుకోవడం తప్పనిసరి.
– రజినీకాంత్, అటవీశాఖాధికారి, కాశీబుగ్గ 

మరిన్ని వార్తలు