మైమరపించే మారేడుమిల్లి అందాలు...

1 Aug, 2022 10:21 IST|Sakshi

అల్లూరి సీతారామరాజు (మారేడుమిల్లి): నిన్న మొన్నటి వరకు వాడిపోయిన చెట్లకు ఇటీవల కురిసిన వర్షాలు కొత్త ఊపిరులూదాయి. ఏజెన్సీలో ఎటుచూసినా ఆకుపచ్చని తివాచీ పరిచినట్లు ప్రకృతి కనువిందు చేస్తోంది. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, ఒంపులు తిరిగే రహదారులు, జలజలపారే సెలయేర్లు, ఉరికే జలపాతాలు, వాగులు, వంకలతో సుందర దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.

ఈ ప్రకృతి అందాలను తిలకించడానికి పర్యాటకులు మారేడుమిల్లికి తరలివస్తున్నారు. ఇక్కడి నుంచి చింతూరు వెళ్లే ఘాట్‌రోడ్డు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.రోడ్డుకు ఇరువైపులా పచ్చదనంతో కూడిన దట్టమైన ఆడవులు, పక్షుల రాగాలు, ఒంపుసొంపుల మార్గంలో సాగే ప్రయాణం, చల్లని వాతావారణంలో తొలకరి చినుకుల మధ్య ఘాట్‌లో ప్రయాణం వాహనచోదకులకు మధురానుభూతిని కలిగిస్తోంది.

ఘాట్‌లోని మన్యం వ్యూపాయింట్‌ నుంచి అందమైన ప్రకృతిని చూసే వారికి రెండు కళ్లూ సరిపోవడం లేదు. మండలంలో పేరొందిన పర్యాటక ప్రాంతం గుడిస హిల్‌ టాప్‌. ఈ ప్రదేశం చాలా ఎత్తులో ఉంటుంది. పై భాగం చదునుగా ఉండి.. చుట్టూ గడ్డి మాత్రమే ఉంటుంది. ఇక్కడ చేతికి అందే ఎత్తులో మేఘాలు వెళుతుంటాయి. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి మెలికలు తిరిగిన ఘాట్‌ రోడ్డులో ప్రయాణించాలి. ఈ ప్రదేశం పచ్చదనంతో ఎంతో సుందరంగా ఉంది. అయితే ప్రస్తుతం గుడిస సందర్శనకు అనుమతి లేదు.   

మరిన్ని వార్తలు