కరెంటు అక్కర్లేని ఏసీ.. నిమిషాల్లో కూల్‌ అయ్యే బెడ్‌ షీట్లు 

18 Sep, 2022 06:23 IST|Sakshi
జెల్‌ మాట్రెస్‌

వైర్లు, కరెంట్‌ అవసరం లేని ఏసీలు 

విద్యుత్‌ లేకపోయినా ఇంటిని చల్లబరిచే టెక్నాలజీ 

అందుబాటులోకి వస్తున్న కొత్త ఆవిష్కరణలు 

సాక్షి, అమరావతి: మానవ విజ్ఞానం క్షణానికో సరికొత్త ఆవిష్కరణతో ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటోంది. ప్రస్తుతం విద్యుత్‌ యుగం నడుస్తోంది. మోటార్లు, స్కూటర్లు, ఏసీలు, మొబైళ్లు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల విద్యుత్‌తో పనిచేసే పరికరాలు మనుషులకు అందుబాటులో ఉన్నాయి. బొగ్గుతోనే ఎక్కువ విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. అయితే ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ కాలుష్యంపై ఆందోళన మొదలై కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

ఫలితంగా పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అయితే సౌర, పవన, జల విద్యుత్‌ ఉత్పత్తి కూడా ఖర్చుతో కూడుకున్నదే కావడంతో అసలు విద్యుత్‌ అవసరమే లేకుండా పనులు జరిగిపోతే ఎలా ఉంటుందనే ఆలోచన కొన్ని దేశాల్లో శాస్త్రవేత్తలను కొత్త ప్రయోగాలకు పురిగొల్పింది. దేశ, విదేశాల్లో వెలుగుచూస్తున్న అలాంటి సరికొత్త ఆవిష్కరణల్లో కొన్ని ఇవి. 

కూలింగ్‌ దుప్పట్లు 
మంచంపై వేసే దుప్పటి సరైనది కాకపోతే ఉక్కపోతకు గురికావాల్సి వస్తుంది. వెంటనే ఏసీ వేసుకోవాలనిపిస్తుంది. కానీ కరెంట్‌ లేకుండానే, ఏసీ వేయకుండానే మనల్ని అచ్చం ఏసీలా కూల్‌ చేసే బెడ్‌ షీట్లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

ఈ బెడ్‌షీట్‌ను చాలా తక్కువ ధరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో కొనుగోలు చేయవచ్చు. దీని ధర దాదాపు రూ.1,500. కొన్ని ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ వెబ్‌సైట్స్‌లో రూ. 699కే లభిస్తోంది. ఇది జెల్‌ టెక్నాలజీ ద్వారా పని చేస్తుంది. దీనిని ఉపయోగించిన నిమిషాల్లోనే మనకు చల్లదనాన్ని అందిస్తుంది. మురికిగా అయితే, దానిని పొడి గుడ్డతో సులువుగా శుభ్రం చేయవచ్చు. 

ఏసీ లేకుండానే ఇల్లు కూల్‌ 
విద్యుత్‌ బిల్లులకు భయపడి ఏసీలకు దూరంగా ఉండే సామాన్యుల కోసం గువహటి ఐఐటీ శాస్త్రవేత్తలు ఒక మార్గాన్ని కనిపెట్టారు. రేడియేటివ్‌ కూలర్‌ పూతను అభివృద్ధి చేశారు. దీనిని ఇంటి పైకప్పులకు వేస్తే కరెంటు అవసరం లేకుండా ఇంటి మొత్తానికీ చల్లదనం అందిస్తుందని వారు చెబుతున్నారు.

ఇలాంటి విధానాలను ‘పాసివ్‌ రేడియేటివ్‌ కూలింగ్‌’ అని పిలుస్తున్నారు. పరిసరాల్లోని వేడిని గ్రహించి దానిని పరారుణ రేడియోధార్మికత రూపంలో వాతావరణంలోకి విడుదల చేసే సాంకేతికత ఇందులో ఉంటుంది. ఈ రేడియేటివ్‌ కూలర్‌ పూత కారణంగా ఇంట్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్‌ వరకు తగ్గుతాయట.   

కరెంటు అక్కర్లేని ఏసీ 
ఎయిర్‌ కండిషనర్‌ (ఏసీ)ని ప్రస్తుతం నాలుగు గోడల మధ్య వినియోగిస్తున్నాం. బహిరంగ ప్రదేశాల్లో వినియోగించేందుకు టవర్‌ కూలర్లు ఉన్నప్పటికీ వాటికి చాలా విద్యుత్‌ అవసరం. ఆరుబయట విద్యుత్‌ అవసరం లేకుండా ఏసీ పెట్టుకుని పరిసరాలను చల్లగా మార్చవచ్చంటోంది ఇజ్రాయెల్‌కు చెందిన కెన్షో కంపెనీ.

ఈ కంపెనీ లిక్విడ్‌ నైట్రోజన్‌ ఆధారంగా పనిచేసే ఏసీని అభివృద్ధి చేసింది. ఏసీలోని ప్రామాణిక ట్యాంకుల్లో ద్రవ నత్రజని –196 డిగ్రీల వద్ద ఫ్రీజ్‌ అయ్యి ఉంటుంది. ఇది గ్యాస్‌గా మారే క్రమంలో బలమైన ఒత్తిడిని కలగచేస్తుంది. ఆ ఒత్తిడితో ఈ ఏసీ పనిచేస్తుంది. దీంతో ఆ పరిసర ప్రాంతం పూర్తిగా చల్లబడుతుంది. ఈ ఏసీలకు ఇప్పటికే 40 దేశాల నుంచి ఆర్డర్లు వచ్చాయట.  

మరిన్ని వార్తలు