‘నేలపట్టు’కు విదేశీ విహంగాలు.. మొదలైన సందర్శకుల తాకిడి 

22 Oct, 2022 08:25 IST|Sakshi

దొరవారిసత్రం : ఖండాంతరాలు దాటి వేల కిలోమీటర్లు ఆకాశమార్గంలో ప్రయాణించి నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రానికి విచ్చేసే విదేశీ శీతాకాలపు వలస విహంగాలు స్థానికంగా కేంద్రం పరిధిలో ఉన్న నేరేడు, మారేడు, అత్తిగుంట చెరువుల్లోని కడప చెట్లపై గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి విడిది చేస్తూ సమీపంలోని పులికాట్‌ సరస్సులో చేపలను వేటాడి జీవనం సాగిస్తాయి.

సీజన్‌కు ముందే (అక్టోబరు నుంచి ఏప్రిల్‌ వరకు) సెప్టెంబరు నెలలోనే వందల సంఖ్యలో నత్తగుళ్ల కొంగలు (ఓపెన్‌బిల్‌స్టార్క్స్‌) విచ్చేశాయి. స్థానికంగా ప్రసిద్ధి చెందిన విహంగాలు, పక్షుల్లోనే రారాజుగా పిలిచే గూడబాతులు (పెలికాన్స్‌) వారం కిందటే కేంద్రంలో తిష్టవేసి ఆడ, మగ పక్షులు స్నేహం కుదుర్చుకుని కడప చెట్లపై పుల్లలతో గూళ్లు కట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం పక్షుల కేంద్రంలో గూడబాతులు200కి పైగా, నత్తగుళ్లకొంగలు  500, నీటికాకులు (కార్మోరెంట్స్‌) 200, తెల్లకంకణాయిలు(వైట్‌ఐబీస్‌) 200, తెడ్డుముక్కుకొంగలు (స్పూన్‌బిల్స్‌) పాముమెడ పక్షులు (డాటర్స్‌), స్వాతి కొంగలు, బాతు జాతికి చెందిన పలు రకాల పక్షులు పదుల సంఖ్యలో విడిది చేస్తున్నాయి.  

రైతులకు పరోక్షంగా.. ప్రత్యక్షంగా..  
పక్షుల కేంద్రంలో విడిది చేసే విహంగాలు రక్షిత కేంద్రానికి చుట్టు పక్కల గ్రామాల్లోని రైతులకు పరోక్షంగా, ప్రత్యక్షంగా ఎంతగానో మేలు చేస్తున్నాయి. వీటి రాక మొదలైతే ఈ ప్రాంతంలో వర్షాలు కురుస్తాయి. దీంతో విహంగాలను దేవత పక్షులుగా రైతులు పిలుస్తారు. ముఖ్యంగా నేలపట్టు పక్షుల కేంద్రంలో విడిది చేయడం వల్ల అవి వేసే రెట్ట చెరువు నీటిలో కలుస్తుంది.

ఈ నీటినే నేలపట్టు, మైలాంగం గ్రామాల్లోని రైతులు పంటల సాగుకు నీళ్లు వినియోగిస్తారు. ఈ నీళ్లలో గంధకం, పొటాష్‌ వంటివి పుష్కలంగా ఉండడంతో రైతులు వేసిన పంట ఏపుగా పెరిగి అధిక దిగుబడులు వచ్చేందుకు పక్షులు పరోక్షంగా దోహదపడుతున్నాయి. అదే విధంగా దుక్కులు దున్నినప్పటి నుంచి పంటలు కోత వచ్చే వరకు కేంద్రంలోని విహంగాలు పంటలపై గుంపులు గుంపులుగా వాలిపోయి పంటకు నష్టం కలిగించే క్రిమికీటకాలను తిని రైతులకు ప్రత్యేక్షంగా మేలు చేస్తాయి.

పక్షుల కేంద్రం ఇలా ఏర్పడింది..  
నేలపట్టు పక్షుల కేంద్రం 458.92 హెక్టార్లలో విస్తరించి ఉంది. 1970లో పక్షి శాస్త్రజ్ఞుడు డాక్టర్‌ సలీంఅలీ కేంద్రాన్ని కనుగొన్నారు. 1976లో పక్షుల రక్షిత కేంద్రంగా గుర్తించి, వన్యప్రాణి విభాగం అధికారులు పరిరక్షిస్తున్నారు. తొలుత పక్షుల కేంద్రం నెల్లూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో ఉండేది. 1984–85లో సూళ్లూరుపేట సబ్‌ డివిజన్‌గా ఏర్పాటు చేశారు. 30ఏళ్ల కిందట పక్షుల కేంద్రంలో 36 రకాల విదేశీ పక్షులు వచ్చి విడిది చేసేవి. క్రమేపి పక్షి జాతుల సంఖ్య తగ్గుతూ ప్రస్తుతం సుమారు 16 జాతుల పక్షులు కేంద్రంలో విడిది చేసి సంతానం అభివృద్ధి చేసుకుంటున్నాయి.   

విహంగాల రాక వ్యవసాయ సూచిక..  
పక్షుల కేంద్రానికి వలస విహంగాల రాక మొదలైతే ఇక్కడ వర్షాలు కురవడం మొదలవుతుందని రైతుల నమ్మకం. రైతులు చెబుతున్న ప్రకారం కార్తీక మాసంలో పక్షులు విచ్చేసి జత కట్టి గూళ్లు కట్టుకుంటాయి. మార్గశిరంలో గుడ్లు పెట్టి పుష్య మాసంలో పిల్లలను పొదిగి మాఘ, ఫాల్గుణ, చైత్ర మాసాల్లో పెంచి పెద్ద చేస్తాయి. వైశాఖంలో ఆయా దేశాలకు వెళ్లిపోతాయి. ఇదే తరహాలో ఈ ప్రాంతంలో కార్తీక మాసంతో వరి సాగు పనులు మొదలై విహంగాల సంతానం అభివృద్ధి పూర్తయ్యేసరికి కోతలు పూర్తవుతాయి.

మరిన్ని వార్తలు