సామాజిక న్యాయమే పరమావధి 

22 Apr, 2023 05:39 IST|Sakshi

ప్రపంచ స్థాయి రాజధానికంటే పేదల సంక్షేమమే మాకు ముఖ్యం  

హైకోర్టు ధర్మాసనానికి నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం 

అక్కడ కనీసం 5 శాతం భూమిని కేటాయించాలని చట్టం చెబుతోంది 

గత ప్రభుత్వ పెద్దలు మాత్రం అక్కడ ధనికులకు మాత్రమే చోటన్నారు 

అందుకే మాస్టర్‌ ప్లాన్‌లో 5 శాతం భూమి కేటాయించలేదు 

ఆ తప్పు పునరావృతం కాకూడదనే చట్ట సవరణతో ఆర్‌ 5 జోన్‌ సృష్టి 

ప్రభుత్వం హైకోర్టు తీర్పును ధిక్కరిస్తోందన్న రైతుల తరఫు న్యాయవాదులు  

అందరి వాదనలు విని తీర్పు రిజర్వ్‌ చేసిన ధర్మాసనం 

సాక్షి, అమరావతి:  ప్రపంచ స్థాయి రాజధాని కంటే కూడా పేదల సంక్షేమమే తమకు ముఖ్యమని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు నివేదించింది. తమది సామాజిక న్యాయమే పరమావధిగా పని చేస్తున్న ప్రభుత్వమని స్పష్టం చేసింది. రాజధాని ప్రాంతంలోని మొత్తం విస్తీర్ణంలో కనీసం 5 శాతం భూమిని పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని సీఆర్‌డీఏ చట్టం స్పష్టంగా చెబుతున్నా, గత ప్రభుత్వం మాత్రం ధనికుల కోసం ని ర్మిస్తున్న రాజధానిలో పేదలు ఉండకూడదన్న ఉద్దేశంతో ఆ చట్టాన్ని అమలు చేయలేదని తెలిపింది.

కేవలం 44 ఎకరాలను మాత్రమే పేదల కోసం కేటాయించిందని, అలాంటి తప్పిదం పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతోనే సీఆర్‌డీఏ చట్టాన్ని సవరించి.. మాస్టర్‌ ప్లాన్‌లో ఆర్‌ 5 జోన్‌ను సృష్టించామని చెప్పింది. ‘ఈ జోన్‌లో పేదలకు 1,134 ఎకరాల భూమిని కేటాయించాం. ఈ  భూమిని ఇళ్ల స్థలాల కింద పేదలకు పంచాలని నిర్ణయించాం. ఇది ఓర్వలేని గత ప్రభుత్వ పెద్దలు హైకోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు వేయించి పేదలకు ఇళ్ల స్థలాలు దక్కకుండా చేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం పాపమన్నట్లు ప్రభుత్వ తీరును అమరావతి రైతుల పేరుతో తప్పు పడుతున్నారు.

సీఆర్‌డీఏ నుంచి ఈ 1,134 ఎకరాలను రూ.1,100 కోట్లకు పైగా మొత్తాన్ని వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. దీని వల్ల సీఆర్‌డీఏకు రూ.1,100 కోట్లపైగా మొత్తం సమకూరుతుంది. సీఆర్‌డీఏకు డబ్బు వస్తేనే రాజధాని అభివృద్ధి సాధ్యమవుతుంది’ అని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. హైకోర్టు విస్తృత ధర్మాసనం సైతం తన తీర్పులో ఇదే విషయాన్ని చెప్పిందని తెలిపారు.  
 
అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలివ్వొద్దు 
రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 1,134 ఎకరాల భూమిని ఎన్‌టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదలాయించేందుకు సీఆర్‌డీఏకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో 45 జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ అమరావతి రైతులు రకరకాల ఎత్తుగడలతో  పిటిషన్లు దాఖలు చేశారు.

జీవో 45 అమలును నిలుపుదల చేయడంతో పాటు పేదలకు ఎలాంటి ఇళ్ల స్థలాలు కేటాయించకుండా ప్రభుత్వాన్ని నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలంటూ అనుబంధ వ్యాజ్యాలు  వేశారు.  ఈ వ్యాజ్యాలపై శుక్రవారం సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్య ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది.   

పేదలకు ఇవ్వకుంటే వచ్చే నష్టమేమీ లేదు.. 
పిటిషనర్ల తరఫున తొలుత దేవ్‌దత్‌ కామత్‌ వాదనలు వినిపిస్తూ.. పేదలకు ఇప్పటికిప్పుడు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే మిన్ను విరిగి మీద పడదన్నారు. పాత మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం సీఆర్‌డీఏ వద్ద ల్యాండ్‌ బ్యాంక్‌ ఉందని, అందులో నుంచి ఇళ్ల స్థలాలు ఇచ్చుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు.

మరో సీనియర్‌ న్యాయవాది వీఎస్సార్‌ ఆంజనేయులు వాదనలు వినిపిస్తూ, మాస్టర్‌ ప్లాన్‌లో చాలా మార్పులు చేశారన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారం హైకోర్టులో పెండింగ్‌లో ఉండగా, క్షేత్ర స్థాయిలో పనులు ప్రారంభించడం కోర్టు ధిక్కారం కిందకే వస్తుందన్నారు. సీఆర్‌డీఏ ప్రతిపాదనలను రైతులు గ్రామ సభల్లో తిరస్కరించారని, అయినా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని అనుమోలు జ్యోతిరత్న వివరించారు. 

అభివృద్ధిలో భాగంగానే ఇళ్ల స్థలాలు 
 ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పాండవుల కోసం శ్రీకృష్ణుడు ఉన్నట్లు పేదల కోసం జగన్‌ ఉన్నారన్నారు. పేదల నివాసానికి కనీసం 5 శాతం భూములు ఇవ్వాలని సీఆర్‌డీఏ చట్టంలో స్పష్టంగా ఉండగా, మాస్టర్‌ ప్లాన్‌లో మాత్రం దానికి స్థానం కల్పించలేదన్నారు. ఈ తప్పును సరిదిద్ది చట్ట ప్రకారం పేదల నివాసం కోసం 5 శాతం భూమిని కేటాయిస్తున్నామని తెలిపారు. నిర్ధిష్టంగా ఫలానా చోటే ఇవ్వాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు.

పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని ఓర్చుకోలేక హైకోర్టు, తరువాత సుప్రీంకోర్టు, మళ్లీ హైకోర్టు.. అడ్డుకునేందుకు ఇలా తిరుగుతూనే ఉన్నారన్నారు. ఇటీవల సుప్రీంకోర్టుకెళ్లగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఎలా తప్పు అవుతుందంటూ రైతులను నిలదీసిందని, దీంతో వాళ్లు అక్కడ తమ పిటిషన్లను ఉపసంహరించుకున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని హైకోర్టు విస్తృత ధర్మాసనం చెప్పిందని, అందులో భాగంగానే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామన్నారు. అభివృద్ధి చేయకుంటే చేయలేదంటున్నారని, చేస్తుంటే ఎలా చేస్తారంటూ కోర్టులకెక్కుతున్నారని  వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. లిఖితపూర్వక వాదనలు ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చునని  స్పష్టం చేసింది.   

నవ్వుల పువ్వులు 
హైకోర్టులో న్యాయవాదులకు మౌలిక సదుపాయాలు లేవని ధర్మాసనం నవ్వుతూ వ్యాఖ్యానించింది.  సీఆర్‌డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ.. 2024 వరకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉందని, అయితే ఓ పెద్ద మనిషి తనపై క్రిమినల్‌ కేసు నమోదు కాగానే భయపడి అప్పటికప్పుడు రాజధానిని అమరావతికి మార్చారని తెలిపారు. దీంతో కోట్ల రూపాయల విలువైన ఆస్తులను వదులుకుని అందరూ హడావుడిగా అమరావతికి వచ్చారన్నారు. దాని పర్యవసానమే సౌకర్యాల కొరత అని వివరించారు. ‘ఆ కోట్ల రూపాయల కోసమే అందరూ ప్రతి శుక్రవారం హైదరాబాద్‌ వెళుతున్నారా? అంటూ ధర్మాసనం నవ్వుతూ వ్యాఖ్యానించింది. 

మరిన్ని వార్తలు