నేను ఐఏఎస్‌ అయ్యేదాకా మీరే సీఎంగా ఉండాలి సార్‌

19 May, 2022 16:40 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై కొందరు అనవసర రాద్ధాంతం సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ వారి వాదనను తప్పని నిరూపించారు కాకినాడ బెండపూడి విద్యార్థులు. దీనివల్ల పేద విద్యార్థులకు మేలు జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ప్రస్తావించారు బెండపూడి విద్యార్థులు. జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో చదువుతున్న ఆ విద్యార్థుల ఆంగ్ల భాషా పటిమకు సీఎం జగన్‌ ఫిదా అయిపోయారు. 

గురువారం తాడేపల్లికి ఆ విద్యార్థులను రప్పించుకుని కాసేపు మాట్లాడారాయన. ఈ సందర్భంగా.. రేష్మా అనే పదో తరగతి విద్యార్థిని మాట్లాడిన తీరుకు సీఎం జగన్‌ మురిసిపోయారు.  హామీలన్నింటిని నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి మీరని(సీఎం జగన్‌ను ఉద్దేశించి)..  ఇంగ్లీష్‌ నేర్చుకుంటే అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడవచ్చని చెప్పింది రేష్మా.  

ఇక మేఘన అనే విద్యార్థి మాట్లాడుతూ.. అమ్మ ఒడి పథకం పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పింది. సగటు విద్యార్థిగా ఉన్న తనను.. మంచి వక్తంగా, అదీ ఇంగ్లీష్‌ ద్వారా రాటుదేల్చారని సంతోషం వ్యక్తం చేసింది. ప్రత్యేకించి.. మీ(సీఎం జగన్‌ను ఉద్దేశించి) ఇంగ్లీష్‌ ఇంటర్వ్యూలు ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పింది మేఘన. 

అనుదీప్‌ అనే విద్యార్థి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందని, అందుకు కృతజ్ఞతలని అన్నాడు. ఎవరెన్ని విమర్శలు చేసినా.. విద్యార్థులంతా మీ వెన్నంటి ఉంటామని చెప్పాడు.  తనకు ఐఏఎస్‌ ఆఫీసర్‌ కావడమే తన లక్ష్యమని, తాను ఐఏఎస్‌ ఆఫీసర్‌ అయ్యేదాకా మీరు సీఎంగా కొనసాగాలని, మీ దగ్గర పని చేయడం తన కోరికని, ప్రామిస్‌ చేయమని సీఎం జగన్‌ను కోరాడు అనుదీప్‌. ఆ చిన్నారి మాటలకు సీఎం జగన్‌ సహా అక్కడున్న​ వాళ్లంతా నవ్వుల్లో మునిగిపోయారు.  

ఇంగ్లీష్‌ మాట్లాడటంలో మంచి ప్రతిభను చూపుతున్న బెండపూడి విద్యార్థులను అభినందించిన సీఎం జగన్‌.. ఉన్నత శిఖరాలను అందుకోవాలని మనసారా ఆశీర్వదించారు.

చదవండి: ‘బెండపూడి’ జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులతో ముచ్చటించిన సీఎం జగన్‌

మరిన్ని వార్తలు