లబ్ధిదారులకే ఫ్లాట్ల నిర్వహణ పగ్గాలు

21 Nov, 2022 05:50 IST|Sakshi
భోపాల్‌లో పేదల అపార్ట్‌మెంట్లను పరిశీలిస్తున్న టిడ్కో చైర్మన్‌ ప్రసన్నకుమార్, ఇతర అధికారులు

భోపాల్‌ పీఎంఏవై–యూ ఇళ్లను పరిశీలించిన అధికారులు 

అదే తరహాలో ఏపీలోనూ ‘టిడ్కో’ సముదాయాల్లో సంక్షేమ సంఘాలు 

ప్రతీ వెయ్యి నివాసాలకు ఒకటి చొప్పున ఏర్పాటు 

సాక్షి, అమరావతి: పట్టణాల్లో ఇళ్లులేని పేదలు, మధ్యతరగతి వర్గాల కోసం నిర్మిస్తున్న టిడ్కో ఇళ్ల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన–అర్బన్‌ (పీఎంఏవై–యు) పథకంలో నిర్మించిన ఇళ్లను అధికారులు పరిశీలించారు. అక్కడ అమలుచేస్తున్న విధానాలను అధ్యయనం చేసి, మనకు ఇక్కడ అనువైన నిబంధనావళిని రూపొందిస్తున్నారు.

రాష్ట్రంలో 88 యూఎల్బీల్లో 2.62 లక్షల టిడ్కో ఇళ్లను అన్ని సౌకర్యాలతో జీ+3 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. ఇవి ప్రాంతాన్ని బట్టి 1000 నుంచి 12 వేల వరకు ఉన్నాయి. ప్రతి వెయ్యి నివాసాలకు ఒక సంక్షేమ సంఘం చొప్పున ఫ్లాట్ల యజమానులతోనే కమిటీ ఏర్పాటుచేసి వీటి అంతర్గత నిర్వహణను యజమానులకే అప్పగించేందుకు చర్యలు చేపట్టారు.

కమిటీల ఏర్పాటు తర్వాత ఒక్కో ఫ్లాట్‌కు రూ.100 నుంచి రూ.150 మధ్య నిర్వహణ రుసుం వసూలు చేసి, వారే నిర్వహించుకునేలా ఏర్పాట్లుచేస్తున్నారు. మరోవైపు.. పీఎంఏవై–యు కింద భోపాల్‌లో తొమ్మిది అంతస్తుల్లో ఫ్లాట్లను నిర్మించగా, రాజ్‌కోట్‌లో అంతకుమించి అంతస్తుల్లో అపార్ట్‌మెంట్లను నిర్మించి, దిగువ, మధ్యాదాయ వర్గాలకు కేటాయించారు. వాటి నిర్వహణను సైతం వాటి యజమానులకే కేటాయించినప్పటికీ, నిర్వహణ రుసుం భారీగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.  

భోపాల్‌లో రూ.850, రాజ్‌కోట్‌లో రూ.200 
ఇక మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్మించిన పీఎంఏవై–యూ అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్‌కు రూ.850 చొప్పున సంక్షేమ సంఘం వసూలుచేస్తుండగా, గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ప్రతి ఫ్లాట్‌ యజమాని రూ.30 వేల డిపాజిట్‌తో పాటు ప్రతినెలా రూ.200 చెల్లిస్తున్నారు. ఈ నగదుతో ఆయా సంఘాలు అపార్ట్‌మెంట్‌ ప్రాంగణంలోని అంతర్గత పారిశుధ్యం, విద్యుత్, తాగునీటి మోటార్ల నిర్వహణ, రక్షణ వంటి అంశాలకు ఖర్చుచేస్తున్నారు. రెండ్రోజులుగా భోపాల్‌లోని నివాసాలను టిడ్కో చైర్మన్‌ జమాన్న ప్రసన్నకుమార్, గృహనిర్మాణ శాఖ అధికారుల బృందం పరిశీలించింది. గృహాల నిర్మాణం, సౌకర్యాల విషయంలో మన రాష్ట్రమే మెరుగ్గా ఉన్నట్లు వారు తెలిపారు. 

ఆ రాష్ట్ర ప్రభుత్వాల వాటా తక్కువ  
పట్టణ పేదల కోసం మధ్యప్రదేశ్, గుజరాత్‌ చేపట్టిన అపార్ట్‌మెంట్ల నిర్మాణంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వాటా మన రాష్ట్రంతో పోలిస్తే చాలా తక్కువ. అక్కడి నివాసితులతో రెసిడెన్షియల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు ఏర్పాటుచేసిన తరువాత లబ్ధిదారులు భూగర్భ డ్రైనేజీ, నీటి సరఫరా, వీధిలైట్లు, అంతర్గత రోడ్ల శుభ్రత వంటి వాటికోసం భోపాల్‌లో ప్రతి ఇంటి నుంచి రూ.850 వసూలు చేస్తున్నారు. మన రాష్ట్రంలోనూ అవి నామమాత్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.  
– జమాన్న ప్రసన్నకుమార్, ఏపీ టిడ్కో చైర్మన్‌ 

మరిన్ని వార్తలు