-

టిడ్కో ఇళ్లకు ఉచిత రిజిస్ట్రేషన్‌తో లబ్ధిదారులకు మేలు

28 Jan, 2022 05:45 IST|Sakshi
మంత్రి బొత్సను కలిసిన ప్రసన్నకుమార్, టిడ్కో డైరెక్టర్లు

మంత్రి బొత్సకు టిడ్కో చైర్మన్‌ కృతజ్ఞతలు

సాక్షి, అమరావతి: ఏపీ టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో తక్కువ ఆదాయ వర్గాల కోసం నిర్మిస్తున్న ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి అందించేందుకు సిద్ధమవడం.. పేదలకు ఎంతో మేలు చేకూర్చే నిర్ణయమని టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్‌ చెప్పారు. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో 2.62 లక్షలకు పైగా గృహాలకు రిజిస్ట్రేషన్‌ ఫీజు మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

ఈ మేరకు ప్రసన్నకుమార్‌ గురువారం మునిసిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల లబ్ధిదారులకు వందల కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్‌ ఫీజును ప్రభుత్వమే భరించడం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న గొప్ప నిర్ణయమంటూ సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు. పార్వతీపురాన్ని మన్యం జిల్లాగా ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి బొత్స సత్యనారాయణను సత్కరించారు. మంత్రిని కలిసినవారిలో టిడ్కో డైరెక్టర్లు రాఘవరావు, నాగేశ్వరమ్మ ఉన్నారు.  

సోమవారం నుంచి ఇళ్ల రిజిస్ట్రేషన్లు  
టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఈ నెల 31 నుంచి ప్రారంభమవుతుందని టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్‌ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయని, బ్యాంక్‌ లింకేజీ పూర్తయిన యూనిట్లను ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి లబ్ధిదారులకు అందిస్తామన్నారు. తొలుత శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. 

మరిన్ని వార్తలు