కార్డులు ఇక్కడ.. మీరెక్కడ?

10 Oct, 2020 04:03 IST|Sakshi

చిరునామాలో లేని బియ్యం కార్డుల లబ్ధిదారులు 

పంపిణీకి ఎదురవుతున్న ఇబ్బందులు 

సచివాలయాల్లోనే 4.23 లక్షల బియ్యం కార్డులు 

సాక్షి, అమరావతి: ప్రభుత్వం బియ్యం కార్డులు మంజూరు చేసినా లబ్ధిదారులు ఆ చిరునామాలో లేకపోవడంతో పంపిణీ చేయలేకపోతున్నారు. ఇలాంటి 4.23 లక్షలకుపైగా కార్డులు సచివాలయాల్లో పేరుకుపోయాయి. ప్రజాపంపిణీ వ్యవస్థలో మెరుగైన విధానం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం రేషన్‌ కార్డుల స్థానంలో బియ్యం కార్డులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇతర సంక్షేమ పథకాలతో ముడిపెట్టకుండా బియ్యం పంపిణీ కోసమే ఈ కార్డులు ఇస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.50 కోట్లకు పైగా కార్డులున్నాయి. వీటిస్థానంలో బియ్యం కార్డులు పంపిణీ చేసేందుకు గ్రామ, వార్డు వలంటీర్లు వెళ్లగా 4,23,249 కార్డుదారులు చిరునామాల్లో లేరని గుర్తించారు. కుటుంబంలో ఒకరు ఇంట్లోనే ఉండి మిగిలినవాళ్లు వలస వెళ్లినచోట కార్డుల పంపిణీకి ఇబ్బందులు ఉండటంలేదు. కుటుంబసభ్యులంతా ఉపాధి కోసం వలస వెళ్లినచోటే సమస్య వస్తోంది.
 
► సబ్సిడీ సరుకులు కావాలనుకున్న వారు మాత్రమే బియ్యం కార్డులు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 
► ప్రస్తుతం ఉన్న వాటిలో దాదాపు 10 లక్షల కార్డుల లబ్ధిదారులు సరుకులు తీసుకోవడం లేదు. 
► అందుకే పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలకు బియ్యం కార్డుతో సంబంధంలేకుండా చేశారు. సంక్షేమ పథకాల వారీ అర్హతలు రూపొందించారు.  
► కార్డుల మంజూరును నిరంతర ప్రక్రియగా చేశారు. అర్హులు గ్రామ సచివాలయాల్లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 
► అర్హత లేదని రద్దుచేసిన కార్డులను.. అర్హతకు సంబంధించిన ఆధారాలు చూపి తిరిగి తీసుకోవచ్చు. 
► కార్డులో అనర్హుల పేర్లు తొలగించుకుంటే మిగిలిన అర్హులు కార్డు తీసుకోవచ్చు. 
► ప్రతినెలా 32 లక్షల నుంచి 35 లక్షల మంది వారు ఉంటున్న చోటే పోర్టబులిటీ సౌకర్యంతో బియ్యం, సరుకులు తీసుకుంటున్నారు.   

మరిన్ని వార్తలు