ఇళ్లు కట్టుకునేందుకు 7.69 లక్షల మంది సంసిద్ధత

16 Mar, 2021 03:45 IST|Sakshi

వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో రెండో ఆప్షన్‌ను ఎంచుకున్న లబ్ధిదారులు 

ఇప్పటికే 41వేల మందికి పైగా నిర్మాణాలు ప్రారంభం 

సాక్షి, అమరావతి:  దేశంలో ఎక్కడాలేని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో 7.69 లక్షల మందికి పైగా లబ్ధిదారులు తామే ఇళ్లు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చారు. వీరిలో ఇప్పటికే 41వేల మందికి పైగా నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడమే కాక అందులో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇంటి స్థలం పట్టాల మంజూరు సమయంలో గృహ నిర్మాణ శాఖ లబ్ధిదారులకు మూడు ఆప్షన్లను ఇచ్చి ఏ ఆప్షన్‌ కావాలంటూ వారి అభిప్రాయాన్ని తెలుసుకుంది. అవి..

► తొలి ఆప్షన్‌గా.. ప్రభుత్వం చూపిన నమూనా ప్రకారం ఇంటి నిర్మాణానికి నాణ్యమైన నిర్మాణ సామాగ్రిని ప్రభుత్వం సరఫరా చేస్తుంది. లేబర్‌ చార్జీలనూ చెల్లిస్తుంది. లబ్ధిదారులు దగ్గరుండి ఇల్లు కట్టుకోవచ్చు. 
► రెండో ఆప్షన్‌గా.. లబ్ధిదారుడు ఇంటి సామాగ్రి తెచ్చుకుని కట్టుకోవచ్చు. పనుల పురోగతి ఆధారంగా దశల వారీగా డబ్బులు లబ్ధిదారులకు ఇస్తామని తెలిపింది. అవసరమైతే ఇళ్ల స్థలాల దగ్గరకే తక్కువ ధరకు సిమెంట్, ఇసుక కూడా సరఫరా చేస్తుంది.
► మూడో ఆప్షన్‌గా.. లబ్ధిదారుడు ఇల్లు కట్టించి ఇవ్వమని కోరితే, ప్రభుత్వమే స్వయంగా కట్టి ఇస్తుంది. లే అవుట్లలో కట్టి చూపుతున్న మోడల్‌ ఇంటి తరహాలో, నాణ్యమైన మెటేరియల్‌తో కట్టించి ఇస్తారు. లబ్ధిదారులు ఎలా కోరుకుంటే అలా చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
దీంతో.. అత్యధికంగా 7,69,204 మంది లబ్ధిదారులు రెండో ఆప్షన్‌ను ఎంచుకున్నారు. వీరిలో ఇప్పటికే ఈ నెల 10 నాటికి 41,535 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించారు. వీరికి అవసరమైతే స్థలాల వద్దకే సిమెంట్, ఇసుకను తక్కువ ధరకే  ప్రభుత్వం సరఫరా చేస్తుంది. మిగతా సామాగ్రి కూడా సరఫరా చేయమంటే ప్రభుత్వం చేస్తుంది. లేదంటే లబ్ధిదారులే సామాగ్రి తెచ్చుకుని నిర్మాణాలు చేసుకుంటుంటే పనుల పురోగతి ఆధారంగా దశల వారీగా డబ్బులను ప్రభుత్వం చెల్లిస్తుంది.  ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు కాలనీల్లో నీటి సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది.  

రెండో ఆప్షన్‌ లబ్ధిదారులకు సిమెంట్, ఇసుక సరఫరా 
తొలిదశలో.. అత్యధిక మంది రెండో ఆప్షన్‌ ఎంచుకున్నారు. వారే నిర్మాణ సామాగ్రి తెచ్చుకుని నిర్మాణాలు చేసుకుంటే పనులు పురోగతి ఆధారంగా దశల వారీగా డబ్బులిస్తాం. వారు కోరుకుంటే ఇళ్ల స్థలాల దగ్గరకే తక్కువ ధరకు సిమెంట్, ఇసుక కూడా సరఫరా చేస్తాం. ఇంకా ఏమైనా సామాగ్రి సరఫరా చేయమని లబ్ధిదారులు అడిగితే చేస్తాం. ఇళ్ల నిర్మాణాలు చేసుకునే వారికి అన్ని విధాలా సహకారం అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. మంచి రోజు చూసుకుని మే తొలి వారంలో మరికొంత మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. 
–అజయ్‌ జైన్‌ గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  

మరిన్ని వార్తలు