సంతృప్త స్థాయిలో అర్హులందరికీ లబ్ధి

1 Nov, 2021 02:49 IST|Sakshi

పథకాలకు సకాలంలో దరఖాస్తు చేసుకోని వారికి మళ్లీ అవకాశం

కొత్తగా 3.89 లక్షల మంది వివిధ పథకాలకు అర్హులుగా గుర్తింపు

గతంలో అర్హులైనా ఖాతాల్లో నగదు జమ కాని వారు 1.11 లక్షల మంది

వీరందరి ఖాతాల్లో డిసెంబర్‌లో రూ.652 కోట్లు జమ         

ఏడాదిలో రెండుసార్లు అర్హుల గుర్తింపు.. డిసెంబర్, జూన్‌లో నగదు జమ 

సాక్షి, అమరావతి: నవరత్నాలు – సంక్షేమ క్యాలెండర్‌ అమలులో భాగంగా అర్హులెవరూ నిరాశ చెందరాదని, అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో ఏడాదిలో రెండు సార్లు వారికి లబ్ధి చేకూర్చేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గత సర్కారు హయాంలో అర్హులైనప్పటికీ లబ్ధి చేకూర్చకుండా ఎలా కోతలు పెట్టాలనే ఆలోచన చేయగా అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి జగన్‌ సంతృప్త స్థాయిలో అర్హులకు ఫలాలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో గత ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు అమలైన సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులైనప్పటికీ సకాలంలో దరఖాస్తు చేసుకోని వారికి ఊరటనిస్తూ మరో అవకాశం కల్పించారు.

ఇక సామాజిక తనిఖీల సందర్భంగా అనర్హులుగా తేలిన వారికి కూడా ఆ తరువాత అర్హత పొందితే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఇందులో భాగంగా వివిధ పథకాలకు ఇప్పటివరకు 4,92,013 మంది దరఖాస్తు చేసుకోగా 3,89,786 మంది అర్హులుగా తేలారు. గతంలో పథకాల అమలు సందర్భంగా సాంకేతిక కారణాలతో నగదు జమ కాని వారు 1,11,757 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ డిసెంబర్‌లో నగదు జమ చేయనున్నారు. 5,01,543 మందికి మొత్తం రూ.652.79 కోట్ల మేర నగదు జమ కానుంది. నవరత్నాలు – సంక్షేమ క్యాలెండర్‌ అమలు సందర్భంగా అర్హులైన లబ్ధిదారులెవరైనా మిగిలిపోతే వారిని గుర్తించి ఏడాదిలో రెండుసార్లు ప్రయోజనం చేకూర్చాల్సిందిగా ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా నవంబర్‌ దాకా అర్హులుగా గుర్తించిన దరఖాస్తుదారులందరికీ డిసెంబర్‌లో లబ్ధి కలగనుంది. ఆ తరువాత మే వరకు అర్హులుగా గుర్తించే లబ్ధిదారులకు జూన్‌లో లబ్ధి చేకూర్చాలని నిర్ణయించారు. కాగా, ‘గడువులోగా దరఖాస్తు చేసుకోనప్పటికీ అర్హులకు మరోసారి అవకాశం కల్పించి ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడువు తీరిన తరువాత దరఖాస్తు చేసుకున్న అర్హులను గుర్తించడంతో పాటు ఇప్పుడు అర్హత పొందిన వారికి కూడా డిసెంబర్‌లో నగదు జమ చేస్తాం’ అని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్‌ అజయ్‌జైన్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు