శనగ విత్తనాల పంపిణీ ప్రారంభం

27 Sep, 2020 05:27 IST|Sakshi

సాక్షి, అమరావతి: రబీలో అత్యధికంగా సాగు చేసే పంటల్లో ఒకటైన శనగ (బెంగాల్‌ గ్రామ్‌) విత్తనాల పంపిణీ శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 30 శాతం సబ్సిడీపై అనంతపురం, వైఎస్సార్, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో విత్తనాల పంపిణీని వ్యవసాయ శాఖ చేపట్టింది. రైతు భరోసా కేంద్రాల వద్ద విత్తనాలను రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు విక్రయిస్తున్నారు.  

► రబీలో శనగ సుమారు 4.30 లక్షల హెక్టార్లలో సాగవుతుంది. పైన పేర్కొన్న నాలుగు జిల్లాల్లో అధికంగా శనగను సాగుచేస్తుంటారు. 2019–20కి ఈ నాలుగు జిల్లాల నుంచి 5.04 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చింది. 
► ఈ ఏడాది రబీలో శనగ సాగును తగ్గించాలని వ్యవసాయ శాఖ ప్రచారం నిర్వహించినప్పటికీ రైతులు మాత్రం శనగ వైపే మొగ్గుచూపుతున్నారు. దీనికనుగుణంగా వ్యవసాయ శాఖ ప్రణాళికలు ఖరారు చేసి విత్తనాల పంపిణీ ప్రారంభించింది. 
► శనగకు మార్కెట్‌ లేక రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో శనగ కన్నా తక్కువ సాగు వ్యయంతో అత్యధిక ఆదాయాన్ని సాధించే పప్పుధాన్యాలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ రైతులకు విజ్ఞప్తి చేసింది.   

మరిన్ని వార్తలు