పాపికొండలు.. బెంగాల్‌ పులులు.. బంగారు బల్లులు

22 Aug, 2021 08:43 IST|Sakshi

అరుదైన జీవజాలానికి నిలయంగా పాపికొండలు అభయారణ్యం

మొత్తం 1045 రకాల జంతువులున్నట్టు గుర్తింపు

పాపికొండలు నడుమ గోదావరి..

దట్టమైన అటవీ ప్రాంతంతో సందర్శకులను ఆకట్టుకునే అందాలు

బెంగాల్‌ పులులున్నాయ్‌.. బంగారు బల్లులూ తిరుగుతున్నాయ్‌.. గిరి నాగులు చెట్టంత ఎత్తున తోకపై నిలబడి ఈలలేస్తున్నాయ్‌.. అలుగులు అలరారుతున్నాయ్‌.. కొమ్ము కత్తిరి పక్షులు కిలకిలరావాలు ఆలపిస్తున్నాయ్‌.. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆరంజ్‌ ఓకలీఫ్‌ సీతాకోక చిలుకలు సందడి చేస్తున్నాయ్‌. ఇలాంటి ఎన్నో.. ఎన్నెన్నో అరుదైన జీవజాలానికి పశ్చిమగోదావరి జిల్లాలో విస్తరించిన పాపికొండలు అభయారణ్యం నిలయంగా నిలుస్తోంది. జాతీయ పార్కుకు వన్నె తెస్తోంది.

బుట్టాయగూడెం: ప్రకృతి అందాలతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న పాపికొండలు అభయారణ్యం జీవ వైవిధ్యంతో అలరారుతోంది. పాపికొండలు అభయారణ్య ప్రాంతాన్ని 2008 నవంబర్‌ 4న కేంద్ర ప్రభుత్వం జాతీయ పార్కుగా ప్రకటించింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంతం మధ్య గలగల పారే గోదావరి నదికి ఇరువైపులా సుమారు 1,01,200 హెక్టార్ల పరిధిలో ఇది విస్తరించి ఉంది. 1978లో పాపికొండల అభయారణ్యం 591 కిలోమీటర్ల విస్తీర్ణంలోనే రిజర్వు ఫారెస్ట్‌గా ఉండేది. జాతీయ పార్కుగా ప్రకటించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం దీని పరిధిని విస్తరించింది. జంతు, వృక్ష సంపదను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనివల్ల ఇక్కడ జంతు జాతుల సంఖ్య మరింత పెరిగిందని వైల్డ్‌లైఫ్‌ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 1,045 రకాల జంతువులున్నట్టు గుర్తించారు. వీటిలో 4 పెద్ద (బెంగాల్‌) పులులు, 6 చిరుత పులులు, 30 అలుగులు (పాంగోలిన్‌), 4 గిరి నాగులు (కింగ్‌ కోబ్రా) ఉన్నట్టు గణించారు. 

చదవండి: సీఏ విద్యార్థిని అనుమానాస్పద మృతి 


అభయారణ్యంలో అరుదైన కొమ్ము కత్తిరి పక్షి  

జింకలు..   చుక్కల దుప్పులు
ఇక్కడ ఎలుగు బంట్లు, కొండ గొర్రెలు, జింకలు, కొండ చిలువలు, అడవి పందులు, ఆగలి, కురుడు పందులు, చుక్కల దుప్పులు, సాంబాలు, అడవి గొర్రెలు, ముళ్ల పందులు, అడవి కుక్కలు, కుందేళ్లు, ముంగిసలు వంటి జంతువులు అధికంగా ఉన్నట్టు వన్యప్రాణి విభాగం సర్వేల్లో తేలింది. వీటితో పాటు నెమలి, గద్ద, చిలకలు, పావురాలు, కోకిల, వడ్రంగి పిట్ట, గుడ్లగూబ, కొమ్ము కత్తిరి తదితర పక్షులూ ఉన్నాయి. అభయారణ్యంలో విలువైన వృక్ష సంపద ఎంతో ఉంది. ముఖ్యంగా వేగిస, మద్ది, బండారు, తబిస, సోమి, తాని, బెన్నంగి, గరుగుడు, గుంపెన, బిల్లుడు, తునికి, మారేడు తదితర వృక్ష సంపద ఉంది. ఇవిగాక విలువైన వెదురు వనాలు విరివిగా ఉన్నాయి. 

నేషనల్‌ విన్నర్‌  ‘ఆరంజ్‌ ఓకలీఫ్‌’
ఇక్కడ సుమారు 130 రకాల సీతాకోక చిలుకలు ఉన్నాయి. గత ఏడాది జాతీయ స్థాయిలో నిర్వహించిన ఉత్తమ సీతాకోక చిలుకల పోటీలకు పాపికొండలు నేషనల్‌ పార్క్‌లో ఉన్న మూడు రకాల సీతాకోక చిలుకలు పోటీ పడ్డాయి. ఫైనల్స్‌లో దేశవ్యాప్తంగా ఏడు రకాల సీతాకోక చిలుకలు ఎంపిక కాగా.. ఈ పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లా అటవీ ప్రాంతానికి చెందిన ఆరంజ్‌ ఓకలీఫ్‌ జాతీయ స్థాయిలో విజేతగా నిలిచింది. 


జాతీయ సీతాకోక చిలుకగా ఎంపికైన ఆరెంజ్‌ ఓకలీఫ్‌  

అభయారణ్యంలో  అలుగులు
పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో అరుదైన వన్యప్రాణులైన అలుగులు (పాంగోలిన్లు) ఉన్నాయి. వీటి మూతి మొసలిని పోలి ఉంటుంది. వీటి జీవిత కాలం 20 సంవత్సరాలు. ఈ అరుదైన వన్యప్రాణులు ఇక్కడ 30కి పైగా ఉన్నట్టు గుర్తించారు.

 
ట్రాప్‌ కెమెరాకు చిక్కిన ఎలుగుబంటి 

అత్యంత ప్రమాదకరమైన  కింగ్‌ కోబ్రా 
అభయారణ్య పరిధిలోని పశ్చిమ అటవీ ప్రాంతంలో అనేక సర్ప జాతులు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రమాదకరమైనది కింగ్‌ కోబ్రా (గిరి నాగు). దట్టమైన అడవిలో గల జలతారు వాగు ప్రాంతంలో సుమారు 30 అడుగుల గిరినాగు తిరుగుతున్నట్టు అటవీ అధికారులు చెబుతున్నారు. పగటిపూట చెట్లపై మాత్రమే ఉండే గిరి నాగులు రాత్రివేళ తోకపై నిటారుగా చెట్టు మాదిరిగా నిలబడి ఈల వేసినట్టుగా శబ్దాలు చేస్తుంటాయని గిరిజనులు చెబుతుంటారు.

చదవండి: Raksha Bandhan: ఆవుపేడతో అందమైన రాఖీలు

మరిన్ని వార్తలు