Family Doctor: పల్లె తలుపు తట్టి.. ప్రజల నాడి పట్టి.. 

19 Dec, 2022 03:37 IST|Sakshi
ఎన్టీఆర్‌ జిల్లా చిట్యాల గ్రామంలో ఇంటికే వెళ్లి చిన్నారిని పరీక్షిస్తున్న డాక్టర్‌

‘ఫ్యామిలీ డాక్టర్‌’తో గ్రామీణులకు అత్యుత్తమ వైద్యం

నెలలో రెండుసార్లు గ్రామాల సందర్శన 

రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా ట్రయల్‌ రన్‌.. మధ్యాహ్నం వరకు అవుట్‌ పేషెంట్‌ సేవలు

ఆ తర్వాత మంచానికే పరిమితమైన వారి ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యం.. అంగన్‌వాడీలు, పాఠశాలల సందర్శన

14 రకాల పరీక్షలు, మందులు ఉచితం.. ఇప్పటి వరకు 12.72 లక్షల మందికి వైద్య సేవలు

ఖర్చు, ఇబ్బందులు తప్పాయని గ్రామీణుల ఆనందం

(చిట్యాల, వేములపల్లి గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధి వడ్డే బాలశేఖర్‌)
‘‘ఆరోగ్యం ఎలా ఉంది? సమయానికి మందులు వాడుతున్నారా?’’
‘‘బాగానే ఉంది..’’ సైగల ద్వారా కోటేశ్వరరావు సమాధానం.
‘‘పెద్ద డాక్టర్‌ రాసిచ్చిన మందులతో పాటు పోయినసారి మీరిచ్చిన బీపీ మందులు సమయానికి ఇస్తున్నామమ్మా.. ఫర్వాలేదు.. 
నా బిడ్డ ఆరోగ్యం బాగానే ఉంది’’ ఇదీ.. 
తమ ఇంటికే వచ్చి పరామర్శిస్తున్న డాక్టర్‌తో ఆనందంగా కోటేశ్వరరావు తల్లి నాగమ్మ సమాధానం. ‘‘సరే.. గుండె కొట్టుకోవడం, పల్స్‌ రేట్, బీపీ, షుగర్‌.. అన్నీ బాగానే ఉన్నాయి. ప్రస్తుతం వాడుతున్న మందులు అలానే కొనసాగించండి. ఏదైనా సమస్య వస్తే సిబ్బందిని సంప్రదించండి. లేదంటే నాకు ఫోన్‌ చేయండి. ధైర్యంగా ఉండండి..’’ డాక్టర్‌ భరోసా.

ఇలా ‘ఫ్యామిలీ డాక్టర్‌’ విధానంతో ఉన్న ఊరికే వైద్యు­లు వచ్చి ఆరోగ్య వివరాలను వాకబు చేస్తుం­డటంతో ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవ­స్థలు తొలగాయని గ్రామీణ ప్రాంత ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు ఓపీ (అవుట్‌ పేషంట్‌) సేవలు అందించి, ఆ తర్వాత నడవలేని స్థితిలో ఉన్న వారి ఇళ్ల వద్దకే వెళ్లి వైద్యం అందిస్తున్నారు.

గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేయడంతో పాటు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కోసం ‘ఫ్యామిలీ డాక్టర్‌’ అనే సరికొత్త కార్యక్రమానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. గత అక్టోబర్‌ 21న వైద్య శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ట్రయల్‌ రన్‌ ప్రారంభించగా ‘సాక్షి’ క్షేత్ర స్థాయిలో పర్యటించి అమలు తీరును పరిశీలించింది.

ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయి పీహెచ్‌సీ డాక్టర్‌ సుష్మ ప్రియదర్శిని చిట్యాల గ్రామంలో నివసించే పక్షవాత బాధితుడు కోటేశ్వరరావు ఇంటిని నెలకు ఒకసారి సందర్శిస్తున్నారు. ‘గతంలో బీపీ, షుగర్‌ పరీక్షల కోసం ఆస్పత్రికి ప్రత్యేకంగా ఆటోలో వెళ్లాల్సి రావడంతో డబ్బులు ఖర్చయ్యేవి. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవు’ అని ఆ కుటుంబం చెబుతోంది.

ఇదే గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ వి.కృష్ణ గత ఆగస్టులో రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో కాలు విరిగింది. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వమే ఉచితంగా శస్త్ర చికిత్స నిర్వహించి ఉచితంగా మందులతో పాటు మూడు నెలల విశ్రాంతి సమయంలో వైఎస్సార్‌ ఆసరా కింద రూ.12,500 ఆర్థిక సాయం చేసింది. పీహెచ్‌సీ డాక్టర్‌ ఇంటికే వెళ్లి ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య వివరాలను వాకబు చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామానికి చెందిన కె.లక్ష్మి ఐదు నెలల గర్భిణి. గతంలో వైద్య పరీక్షల కోసం ప్రతి నెల 9వ తేదీన పెండ్యాల పీహెచ్‌సీకి వెళ్లేది. మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా అవసరమైతే గ్రామంలోని వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌కు వెళ్లేది. అయితే ప్రస్తుతం నెలలో రెండు రోజులు పీహెచ్‌సీ వైద్యురాలు గ్రామానికే వస్తున్నారు. ఆమెకే కాకుండా విలేజ్‌ క్లినిక్‌ పరిధిలోని 21 మంది గర్భిణులకు వైద్య సేవలు ఇంటి వద్దే అందుతున్నాయి. 

తొలగిన వ్యయ ప్రయాసలు 
దాదాపు 1,800 మంది నివసించే చిట్యాలలో 2019కి ముందు ప్రాథమిక ఆరోగ్య సేవల కోసం ఆరు కి.మీకి పైగా ప్రయాణించి వత్సవాయి పీహెచ్‌సీకి వెళ్లాల్సి వచ్చేది. స్పెషలిస్ట్‌ డాక్టర్‌ కోసం 30 కి.మీ పైగా దూరంలో ఉండే నందిగామ లేదంటే 80 కి.మీ పైనే ఉన్న విజయవాడకు వెళ్లక తప్పదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్‌ సేవలు ప్రారంభం అయ్యాయి. 12 రకాల వైద్య సేవలు, 14 పరీక్షలు, 67 రకాల మందులు అక్కడే అందుబాటులోకి వచ్చాయి.

టెలీ మెడిసిన్‌ ద్వారా గైనిక్, పీడియాట్రిషన్, ఇతర స్పెషాలిటీ వైద్యుల కన్సల్టెన్సీ లభిస్తుంది. తాజాగా ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం ద్వారా పీహెచ్‌సీ డాక్టర్‌ ప్రతి నెలా గ్రామానికే వస్తున్నారు. గ్రామంలో 239 మంది బీపీ, షుగర్‌ బాధితులున్నారు. 13 మంది గర్భిణులు, ఏడుగురు బాలింతలు, 18 మంది అనీమియా బాధితులకు డాక్టర్‌ సేవలు అందుతున్నాయి. వేములపల్లిలో 220 మంది బీపీ, షుగర్‌ బాధితులు, 21 మంది గర్భిణులు, 9 మంది బాలింతలకు పీహెచ్‌సీ డాక్టర్‌ నెలలో రెండు దఫాలు గ్రామానికే వచ్చి వైద్య సేవలు అందిస్తున్నారు.
ఎన్టీఆర్‌ జిల్లా వేములపల్లిలోని వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లో వైద్య సేవలు పొందుతున్న రోగులు 

అంగన్‌వాడీలు, స్కూళ్లకు కూడా..
ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లో భాగంగా రాష్ట్రంలోని 1,142 పీహెచ్‌సీల్లో ఇద్దరు చొప్పున వైద్యులకు ఆయా పరిధిలోని గ్రామ సచివాలయాలను కేటాయించారు. ఒక్కో సచివాలయం పరిధిలో నెలకు రెండుసార్లు సందర్శించి గ్రామంలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. 104 ఎంఎంయూతో పాటు వెళ్లి విలేజ్‌ క్లినిక్‌లలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఓపీ సేవలు అందిస్తున్నారు.

మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ గ్రామంలో మంచానికే పరిమితం అయిన వృద్ధులు, దివ్యాంగులు, పక్షవాత బాధితులు, ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారి ఇళ్లకే వెళ్లి పరామర్శించి అవసరమైన సేవలు అందచేస్తున్నారు. అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చిన్నారులు, పిల్లల ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. 

ఇప్పటి వరకు 12.72 లక్షల మందికి వైద్యం
రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్‌ ట్రయల్‌రన్‌ అక్టోబర్‌ 21న ప్రారంభం కాగా ఇప్పటి వరకు పీహెచ్‌సీ వైద్యులు 7,166 విలేజ్‌ క్లినిక్‌లను నెలలో రెండుసార్లు, 2,866 క్లినిక్‌లను నెలలో ఒకసారి సందర్శిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ 12,72,709 మందికి వైద్య సేవలు అందించారు. 

‘ఫ్యామిలీ డాక్టర్‌’తో గ్రామాల్లో అందే వైద్య సేవలు
► జనరల్‌ అవుట్‌ పేషెంట్‌ సేవలు
► బీపీ, షుగర్, ఊబకాయం లాంటి జీవనశైలి జబ్బుల కేసుల ఫాలోఅప్‌
► గర్భిణులకు యాంటినేటల్‌ చెకప్స్, బాలింతలకు పోస్ట్‌నేటల్‌ చెకప్స్, ప్రసవానంతర సమస్యల ముందస్తు గుర్తింపు. చిన్నపిల్లలో పుట్టుకతో వచ్చిన లోపాల గుర్తింపు.
► రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, చిన్న పిల్లలకు వైద్య సేవలు
► ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్స జరిగిన రోగులు, క్యాన్సర్, ఇతర ధీర్ఘకాలిక జబ్బులతో మంచానికే పరిమితం అయిన వారికి, వృద్ధులకు ఇంటి వద్దే వైద్యం. 
► పాలియేటివ్‌ కేర్‌
► తాగునీటి వనరుల్లో క్లోరినేషన్‌ నిర్ధారణ

గ్రామాల్లోనే 14 రకాల పరీక్షలు 
► గర్భం నిర్ధారణకు యూరిన్‌ టెస్ట్‌
► హిమోగ్లోబిన్‌ టెస్ట్‌
► ర్యాండమ్‌ గ్లూకోజ్‌ టెస్ట్‌ (షుగర్‌)
► మలేరియా టెస్ట్‌
► హెచ్‌ఐవీ నిర్ధారణ
► డెంగ్యూ టెస్ట్‌
► మల్టీపారా యూరిన్‌ స్ట్రిప్స్‌ (డిప్‌ స్టిక్‌)
► అయోడిన్‌ టెస్ట్‌
► వాటర్‌ టెస్టింగ్‌
► హెపటైటిస్‌ బి నిర్ధారణ
► ఫైలేరియాసిస్‌ టెస్ట్‌
► సిఫ్లిస్‌ ర్యాపిడ్‌ టెస్ట్‌
► విజువల్‌ ఇన్‌స్పెక్షన్‌ 
► స్పుటమ్‌ (ఏఎఫ్‌బీ) 

పెద్ద భారం తప్పింది
నాకు 72 ఏళ్లు. నడుము నొప్పి ఉంది. కర్ర సాయంతో కొద్ది దూరం నడవగలను. బీపీ, షుగర్‌కు నెల నెలా డాక్టర్‌కు చూపించుకునేందుకు నా కుమార్తె పట్ణణానికి తీసుకెళ్లేది. ఇప్పుడు వేములపల్లెకు ప్రభుత్వ డాక్టర్‌ నెలకు రెండు సార్లు వస్తున్నారు. డాక్టరమ్మ బాగా చూస్తోంది. మందులు రాసిచ్చింది. దగ్గరే కాబట్టి ఒక్కదాన్నే వస్తున్నా. పెద్ద భారం తొలగింది. లేదంటే నా కుమార్తె రోజంతా తన పని వదులుకోవాల్సి వచ్చేది. 
– వసంత నాగేంద్రమ్మ, ఎస్‌.అమరవరం, ఎన్టీఆర్‌ జిల్లా
 
బాలింతకు వైద్య సేవలు..
ఇటీవల పాప పుట్టింది. నాకు పుట్టుకతోనే ఫిట్స్‌ సమస్య ఉంది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ప్రసవానికి నిరాకరించడంతో వత్సవాయి పీహెచ్‌సీ డాక్టర్‌ విజయవాడకు రిఫర్‌ చేశారు. అక్కడి వైద్యులు కాన్పు చేశారు. ఫిట్స్‌ సమస్యకు కూడా వైద్యం చేశారు. డిశ్చార్జి అయి ఇంటికి వచ్చాక వైద్యులు రెండు సార్లు మా ఇంటికి వచ్చి మా ఆరోగ్యం గురించి వాకబు చేశారు. అవసరమైన మందులిస్తున్నారు.  
– అద్దంకి మౌనిక, చిట్యాల, ఎన్టీఆర్‌ జిల్లా
 
కొత్త అనుభూతి..
నెలలో ఏ రోజు ఏ గ్రామానికి వెళ్లాలో మాకు ముందుగానే టైమ్‌ టేబుల్‌ నిర్దేశించారు. ఉదయమే 104 ఎంఎంయూతో పాటు గ్రామానికి వెళ్తాం. ముందు రోజే సంబంధిత గ్రామ ప్రజలకు ఆరోగ్య సిబ్బంది సమాచారం ఇస్తారు. ప్రజల వద్దకే వెళ్లి సేవ చేస్తుండటం ఓ కొత్త అనుభూతి. 
– డాక్టర్‌ సుష్మ ప్రియదర్శిని, వత్సవాయి పీహెచ్‌సీ, ఎన్టీఆర్‌ జిల్లా
 
నిరంతరం సమీక్షిస్తున్నాం
సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టిన ప్రతిష్టాత్మక ఫ్యామిలీ డాక్టర్‌ ట్రయల్‌రన్‌ విజయవంతంగా నడుస్తోంది. నిరంతర సమీక్షతో క్షేత్ర స్థాయిలో సమస్యలు గుర్తించి పరిష్కరిస్తున్నాం. మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరువయ్యేలా చర్యలు చేపడుతున్నాం. రోగులు, వైద్యం వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తున్నాం. దీని ద్వారా ప్రతి వ్యక్తి ఆరోగ్య చరిత్ర ‘ఆయుష్మాన్‌ భారత్‌’ డిజిటల్‌ ఖాతాల్లో నిక్షిప్తం అవుతుంది.  
– ఎం.టి.కృష్ణ బాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి
 
వైద్య రంగంలో సమూల మార్పులు

ఒకప్పుడు గ్రామీణ ప్రజలు ప్రభుత్వ వైద్యులు ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. ఆ పరిస్థితులను సీఎం జగన్‌ సమూలంగా రూపుమాపారు. వైద్య, ఆరోగ్య శాఖలో సంస్కరణలు చేపట్టారు. ఇందులో భాగంగా ఫ్యామిలీ డాక్టర్‌ అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డాక్టర్లు ప్రజలకు అందుబాటులోకి వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు.

టీడీపీ హయాంలో పీహెచ్‌సీల్లో వైద్యులు, సిబ్బంది, మందులు ఉండేవి కాదు. ఇప్పుడు విలేజ్‌ క్లినిక్‌ల ద్వారా 67 మందులు, 14 వైద్య పరీక్షలు, వైద్య సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచాం. 
– విడదల రజని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

మరిన్ని వార్తలు