ఏపీ శాసనసభలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటన

23 Nov, 2021 01:52 IST|Sakshi

ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించడానికే మూడు రాజధానుల బిల్లు వెనక్కి

త్వరలోనే సమగ్ర బిల్లును మళ్లీ సభ ముందుకు తెస్తాం

ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సోమవారం ఉదయం సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అనంతరం రాజధాని వికేంద్రీకరణ ఉపసంహరణ బిల్లును ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనపై సభలో సీఎం మాట్లాడుతూ మరింత స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, సమతుల అభివృద్ధే ధ్యేయంగా వికేంద్రీకరణ బిల్లును మరింత సమగ్రంగా మళ్లీ సభ ముందుకు తెస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు రాజధాని వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనానికీ ఈ విషయాన్ని ఏజీ శ్రీరామ్‌ వివరించారు.

మూడు రాజధానులకు సంబంధించి ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్టపరంగా, న్యాయపరంగా అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరిచేందుకు, బిల్లును మరింత మెరుగుపరిచేందుకు, అన్ని ప్రాంతాలకు, అందరికీ విస్తృతంగా తెలియచేసేందుకు... ఇంకా ఏవైనా మార్పులు అవసరమైతే వాటిని కూడా జోడించేందుకు గతంలో ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకుని అన్ని అంశాలతో  పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లును త్వరలోనే మళ్లీ సభ ముందుకు తెస్తాం. రాష్ట్ర విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం’’  

అన్ని ప్రాంతాలు, అన్ని కులాలు, అన్ని మతాల ప్రజల ఆశలు, ఆకాంక్షలను ఈ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని వాటిని ఆవిష్కరించింది కాబట్టే రెండున్నరేళ్లుగా ఏ ఎన్నికల్ని తీసుకున్నా మనసారా దీవిస్తూ వచ్చారు’’    – అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని సమతుల అభివృధ్ధే లక్ష్యంగా వికేంద్రీకరణ బిల్లును సమగ్రంగా మళ్లీ సభ ముందుకు తెస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించారు. వికేంద్రీకరణ బిల్లును ఆమోదిం చిన వెంటనే మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఉంటే ఈపాటికే సత్ఫలితాలు వచ్చి ఉండేవన్నారు. అందరికీ న్యాయం చేయాలన్న ప్రభుత్వ సదుద్దేశాన్ని పక్కన పెట్టి కొంతమందికి అన్యాయం జరుగుతోందనే వాదనను ముందుకు తెచ్చి కొందరు రకరకాల అపోహలు, అను మానాలు, న్యాయపరమైన చిక్కులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వికేంద్రీకరణ బిల్లును ఉపసంహ రించుకోవడానికి దారి తీసిన పరిస్థితులను సోమవారం శాసనసభలో సీఎం జగన్‌ సోదాహరణంగా వివరించారు. కేంద్రీకరణ ధోరణులను నిరసిస్తూ హైదరాబాద్‌ లాంటి సూపర్‌ కేపిటల్‌ వద్దని 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు సుస్పష్టమైన చారిత్రక తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షల మేరకే వికేంద్రీకరణ వైపు అడుగులు వేశామని వివరించారు. రాష్ట్ర ప్రజల విస్తృత, విశాల ప్రయోజనాల కోసం వికేంద్రీకరణ బిల్లును సమగ్రంగా రూపొందించి మళ్లీ సభ ముందుకు తెస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో సీఎం జగన్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ...

శ్రీకృష్ణ కమిటీ నివేదిక తుంగలోకి..

  • 1953 నుంచి 1956 వరకు ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉంది. ఆ రోజుల్లో హైకోర్టు గుంటూరులో ఉండేది. 1956లో దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేసినప్పుడు కర్నూలు నుంచి రాజధానిని, గుంటూరు నుంచి హైకోర్టును హైదరా బాద్‌కు తరలించారు. ప్రజల ఆకాంక్షలు, శ్రీబాగ్‌ ఒడం బడికను పరిగణలోకి తీసుకుని రాయలసీమకు న్యాయం చేస్తామని అప్పట్లో చెప్పారు.
  • విభజన తర్వాత ఈ ప్రాంతంలో (అమరావతి) రాజధాని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఎంత వివాదాస్పమైందో అందరికీ తెలుసు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను అన్ని రకాలుగా ఉల్లంఘించి రాజధానిపై చంద్రబాబు సర్కార్‌ నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలుసు. ఈ ప్రాంతం(అమరావతి)లో 50 వేల ఎకరాల్లో రాజధాని నిర్మించాలని టీడీపీ హయాంలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

ప్రజలను తప్పుదోవ పట్టించడం ధర్మమేనా?

  • గత ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈ ప్రాంతమంటే నాకు వ్యతిరేకత లేదని ఈరోజు కూడా చెబుతున్నా. నా ఇల్లు ఇక్కడే ఉంది. ఈ ప్రాంతమంటే నాకు ప్రేమ కూడా. కానీ ఒక్కటి ఆలోచన చేయాలి. ఈ ప్రాంతం అటు విజయవాడకు దగ్గర కాదు.. ఇటు గుంటూరుకు కూడా దగ్గర కాదు. ఇక్కడ నుంచి గుంటూరు తీసుకుంటే 40 కిలోమీటర్లు. విజయవాడ తీసుకుంటే మరో 40 కిలోమీటర్ల దూరం ఉంది.
  • ఇక్కడ కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, డ్రైనేజీ, కరె ంట్‌ లాంటివి ఏర్పాటు చేయడానికి గత ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఎకరాకు రూ.2 కోట్లు అవుతుంది. 50 వేల ఎకరాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనకు రూ.లక్ష కోట్లు ఖర్చు అవుతుందని అప్పట్లోనే లెక్కలు వేశారు.
  • రూ.లక్ష కోట్లు అనేది ఈరోజు లెక్కల ప్రకారమే. రూ.లక్ష కోట్లు తెచ్చి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి పదేళ్లు పడుతుందో, ఇంకా ఎక్కువ కాలం పడుతుందో తెలియదు. కానీ ఇవాళ రూ.లక్ష కోట్లు ఖర్చయ్యేది పదేళ్ల తరువాత రూ.ఆరు లక్షల కోట్లో, ఏడు లక్షల కోట్లో అవుతుంది. అంటే కనీసం రోడ్లు వేయడం, డ్రైనేజీల నిర్మాణం, కరెంట్‌ ఇవ్వడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో మనం ఉంటే ఇక్కడ రాజధాని అనే ఊహాచిత్రం సాధ్యమవుతుందా? ఈ రకంగా ప్రజలను తప్పుదోవ పట్టించడం ధర్మమేనా?

ఉద్యోగాల కోసం హైదరాబాద్‌ వెళ్లాల్సిందేనా?

  • అసలు మనకంటూ, మన పిల్లలకంటూ ఏదైనా ఉద్యో గాలు వచ్చే పరిస్థితి ఉన్న ఒక  నగరం, ఒక ఎస్టాబ్లిష్‌మెం ట్‌ ఎప్పటికి వస్తుంది? చదువుకున్న మన పిల్లలు ఉద్యో గాల కోసం ఎప్పుడూ పెద్ద నగరాలైన హైదరా బాద్‌కో, బెంగళూరుకో, చెన్నైకో వెళ్లాల్సిందేనా? ఎప్పటికీ మన పరిస్థితిలో మార్పు ఉండదా? అనే ఆలోచనల మధ్య రాష్ట్రంలో అతి పెద్ద నగరం విశాఖపట్నం కనిపించింది.  
  • విశాఖలో ఇప్పటికే రోడ్లు, డ్రైనేజీ, కరెంట్‌తో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలున్నాయి. సుందరీకరణ, సదుపాయాలను మెరుగు దిద్దితే చాలు ఈరోజు కాక పోయినా ఐదేళ్లకో, పదేళ్లకో హైదరాబాద్‌ లాంటి పెద్ద నగరాలతో విశాఖ పోటీ పడే పరిస్థితి కచ్చితంగా ఉంటుంది.

అందరికీ మంచి జరగాలనే..

  • వాస్తవ పరిస్థితిని గుర్తెరిగి రాష్ట్రంలో మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌(కార్యనిర్వాహక రాజధాని),  అమరావతిలో లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌(శాసన రాజధాని), కర్నూలులో జ్యుడీషియల్‌ క్యాపిటల్‌(న్యాయ రాజధాని) ఏర్పాటు చేసి వికేంద్రీకరణతో ప్రజలందరికీ మంచి జరగాలనే తాపత్రయంతో అడుగులు ముందుకు వేశాం. 

ఈ పరిస్థితుల మధ్య రెండేళ్లలో ఏమేం జరిగాయో మన కళ్లముందే చూస్తున్నాం. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకర ణను వక్రీకరిస్తూ అపోహలు, న్యాయపరమైన చిక్కులు సృష్టిస్తున్న నేపథ్యంలో నేను ఈ ప్రకటన చేయాల్సి వస్తోంది. శ్రీబాగ్‌ ఒడంబడిక స్ఫూర్తితో, వెనకబడ్డ ఉత్తరాంధ్ర సహా అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో వికేంద్రీకరణ బిల్లుల్ని ప్రవేశపెట్టాం.

ప్రజల తీర్పుకు అనుగుణంగానే వికేంద్రీకరణ..
గత సర్కారు అనుసరించిన కేంద్రీకృత ధోరణులను ప్రజలు ఎంతగా వ్యతిరేకించారో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ద్వారా ప్రస్ఫుటంగా వ్యక్త మైంది. మరోసారి హైదరాబాద్‌ లాంటి సూపర్‌ క్యాపిటల్‌ మోడల్‌ వద్దని, అలాంటి చారిత్రక తప్పి దానికి ప్రభుత్వం పాల్పడరాదని ప్రజాతీర్పు స్పష్టం చేసింది. కాబట్టే వికేంద్రీకరణే సరైన విధానమని బలంగా నమ్మి అడుగులు ముందుకు వేశాం.

మరిన్ని వార్తలు