పంజాబ్‌ను మించి ఏపీ.. నాబార్డు అధ్యయన నివేదిక ఏం చెప్పిందంటే?

28 Oct, 2022 09:10 IST|Sakshi

సాక్షి, అమరావతి:  గత దశాబ్ద కాలంలో దేశంలో వ్యవసాయ రుణాల పంపిణీ మూడు రెట్లు పెరిగినట్లు నాబార్డు నివేదిక వెల్లడించింది. 2011–12లో దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణాల పంపిణీ రూ.5.11 లక్షల కోట్లు ఉండగా 2020–21 నాటికి మూడు రెట్లు పెరిగి రూ.15.58 లక్షల కోట్లకు చేరుకున్నాయి. పదేళ్లలో 11.9 శాతం వృద్ధి నమోదైంది. పంజాబ్‌ను మించి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణ లభ్యత మెరుగ్గా ఉండటం గమనార్హం. నాబార్డు నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ..
చదవండి: ఏపీ సర్కార్‌ కీలక ఉత్తర్వులు.. వారికి సచివాలయాల్లో ఉద్యోగాలు..

2011–12 నుంచి స్వల్పకాలిక పంట రుణాలతో పాటు దీర్ఘకాలిక టర్మ్‌ రుణాలు పెరిగాయి. 2017–18లో దీర్ఘకాలిక టర్మ్‌ రుణాల పంపిణీలో వృద్ధి 9.9 శాతం ఉండగా 2020–21 నాటికి 43.17 శాతానికిచేరింది. 
వ్యవసాయ యాంత్రీకరణ, పంపు సెట్లు, నీటి పారుదల నిర్మాణాలు, తోటల అభివృద్ధి, ఫామ్‌ పాండ్‌లు, మైక్రో ఇరిగేషన్, పొలంలో ఉత్పాదక సామర్థ్యం పెంపు తదితరాలకు నాబార్డు, బ్యాంకులు దీర్ఘకాలిక టర్మ్‌ రుణాలను మంజూరు చేస్తున్నాయి. 
బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణాల పంపిణీ పెరగడంతో వడ్డీ వ్యాపారుల నుంచి రైతులకు విముక్తి లభించినా బ్యాంకు రుణాల మంజూరులో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలున్నాయి. 
దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా వ్యవసాయ రుణాల పంపిణీ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్‌ రాష్ట్రాల్లో హెక్టార్‌కు రుణ లభ్యత మెరుగ్గా ఉంది. మిగతా  రాష్ట్రాల్లో చాలా చోట్ల హెక్టార్‌కు రుణ లభ్యత రూ.లక్ష లోపే ఉంది. 

2019 – 20లో ఆంధ్రప్రదేశ్‌లో హెక్టార్‌కు రూ.1.29 లక్షలు, పంజాబ్‌లో రూ.లక్షకు పైగా రుణ లభ్యత ఉంది. 
వ్యవసాయ రుణాల పంపిణీ పెరగడంలో కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2019 మార్చి 31 నాటికి 1,896 లక్షల కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు మంజూరయ్యాయి. 
2011–12లో స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు రూ.3.96 లక్షల కోట్లు ఉండగా 2020–21 నాటికి రూ.8.85 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీర్ఘకాలిక టర్మ్‌ రుణాలు ఇదే సమయంలో రూ.1.14 లక్షల కోట్ల నుంచి రూ.6.73 లక్షల కోట్లకు పెరిగాయి. 

మరిన్ని వార్తలు