సురక్షిత మాతృత్వం.. ఖర్చు లేని కాన్పు 

24 Nov, 2022 16:45 IST|Sakshi

జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు

సర్కార్‌ ఆస్పత్రులపై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకం

నాలుగు నెలల్లో 2,500 ప్రసవాలు

గర్భిణులకు సత్వర వైద్య సేవలు

తల్లీబిడ్డను క్షేమంగా ఇంటికి చేర్చేందుకు వాహనాలు

మాతృత్వం అనేది ఓ వరం. ప్రసవ ఘట్టం మహిళకు పునర్జన్మ వంటింది. దీనిని కొందరు స్వార్థపరులు తమ సంపాదనకు మార్గంగా మలుచుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో సురక్షిత మాతృత్వాన్ని ఉచితంగా ప్రసాదించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఇంటికి చేరుకునే వరకు అనేక విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరిచింది. ప్రధానంగా ప్రసూతి ఆస్పత్రుల్లో సేవలపై ప్రధాన దృష్టి సారించింది.  

మార్కాపురం(ప్రకాశం జిల్లా): తల్లీబిడ్డ క్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలిస్తున్నాయి. జిల్లాలోని వైద్యశాలలు, ఏరియా, కమ్యూనిటీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు, సిబ్బందిని నియమించడంతో ప్రజల్లో ప్రభుత్వ ఆస్పత్రులపై పూర్తి నమ్మకం ఏర్పడింది. గత ప్రభుత్వంలో వైద్య రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. డాక్టర్లు లేక మందుల కొరతతో ప్రజలు ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయించారు. తాజాగా పరిస్థితి మారింది. నాణ్యమైన వైద్యసేవలు అందుబాటులోకి రావడంతో సర్కార్‌ ఆస్పత్రులపై నమ్మకం ఏర్పడింది. జిల్లాలో మొత్తం వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలో 12 వైద్యశాలలు ఉన్నాయి. ఇందులో మార్కాపురంలో జిల్లా వైద్యశాల, ఒంగోలులో మాతాశిశు వైద్యశాల ఉన్నాయి. కనిగిరి, దర్శి, పొదిలి, చీమకుర్తి, పామూరు, దోర్నాల, కంభం, కొండపి ఉండగా గిద్దలూరు, యర్రగొండపాలెంలో ఏరియా వైద్యశాలలు ఉన్నాయి. ఇవి కాకుండా 9 కమ్యూనిటీ ఆస్పత్రులు ఉన్నాయి.

ఇవన్నీ వైద్య విధాన పరిషత్‌ కో ఆర్డినేటర్‌ పరిధిలో ఉండగా, డీఎంహెచ్‌ఓ పరిధిలో 64 పీహెచ్‌సీలు ఉన్నాయి. జిల్లాలో బేస్తవారిపేటలో అత్యధికంగా నాలుగు పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటిల్లో కాన్పులు చేస్తున్నారు. అనంతరం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో సురక్షితంగా ఇంటికి చేరుస్తున్నారు. నిపుణులైన డాక్టర్లు గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి వైద్య సేవలు రావడంతో ప్రభుత్వ వైద్యశాలలు కిటకిటలాడుతున్నాయి.  

జిల్లా వైద్యశాలలో ఇద్దరు గైనకాలజిస్టులు, ఇద్దరు సర్జన్లతో పాటు అనస్థీషియన్‌ (మత్తు డాక్టరు), నిపుణులైన నర్సింగ్‌ స్టాఫ్‌ ఉన్నారు. నెలకు సుమారు 180 నుంచి 200 మ«ధ్య కాన్పులు జరుగుతున్నాయి. ఆధునిక వైద్య పరికరాలు, ఆక్సిజన్‌ సౌకర్యం, బ్లడ్‌ బ్యాంక్, ఐసీయూ బెడ్లు, అందుబాటులో ఉండడంతో సమీప మండలాల్లోని గ్రామాల గర్భిణులు కాన్పుల నిమిత్తం జిల్లా వైద్యశాలలకు వస్తున్నారు. మొత్తంగా గత నాలుగు నెలల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో సుమారు 2,500 వరకు ప్రసవాలు జరిగాయి.  

ప్రోత్సాహకాలు.. 
ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం చేయించుకున్న వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాన్నిస్తోంది. పీహెచ్‌సీల్లో ప్రసవం చేయించుకున్న వారికి ఆరోగ్య ఆసరా కింద రూ.4 వేలు, జననీ సురక్ష యోజన కింద రూ.వెయ్యి ఇస్తోంది. మొత్తంగా రూ.ఐదు వేలు ఇస్తుండగా పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయితే రూ.4600 ఇస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంల ద్వారా ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తోంది.  

సురక్షితంగా ఇంటికి... 
ప్రభుత్వాస్పత్రులకు ప్రసవం కోసం వచ్చే గర్భిణులకు రవాణా నుంచి మందుల వరకు అన్నీ ఉచితమే. గర్భిణికి పురిటినొప్పులు రాగానే 108కు ఫోన్‌ చేస్తే ఆస్పత్రికి తీసుకెళ్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) నుంచి బోధనాస్పత్రి వరకూ ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చు. ప్రసవం అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తల్లీబిడ్డను ఇంటికి తరలించేటప్పుడు ఆస్పత్రుల్లోని నర్సులు, వాహనాల డ్రైవర్ల సమన్వయం కోసం ప్రత్యేకంగా యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆస్పత్రుల్లో జరిగే ప్రతి ప్రసవానికి సంబంధించిన వివరాలు మాతాశిశు సంరక్షణ పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఆ వివరాలను యాప్‌కు అనుసంధానించి బాలింతలను క్షేమంగా ఇంటికి తరలించేందుకు చర్యలు తీసుకుంటారు. బాలింతను వాహనంలో ఎక్కించుకున్నప్పుడు, ఆమెను ఇంటి దగ్గర దించాక ఈ యాప్‌లో డ్రైవర్‌ ఫొటో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. తల్లీబిడ్డల రక్షణ, భద్రతకు భరోసానిస్తూ అన్ని వాహనాలకూ జీపీఎస్‌ ట్రాకింగ్‌ సౌకర్యం ఉంటుంది.

మంచి వైద్య సేవలు అందాయి 
కాన్పు కోసం జిల్లా వైద్యశాలకు వచ్చాను. డాక్టర్లు, నర్స్‌లు మంచి వైద్య సేవలు అందించి సాధారణ కాన్పు చేశారు. పాప పుట్టింది. ఒక్క రూపాయి ఖర్చు కాలేదు. మంచి మందులు ఇచ్చారు. డాక్టర్లకు ధన్యవాదాలు. 
– నాగలక్ష్మి, రాగసముద్రం, తర్లుపాడు మండలం

మంచి సేవలందిస్తున్నాం  
జిల్లా వైద్యశాలలో గైనకాలజిస్టులు, సర్జన్‌లు, మంచి సేవా భావం కలిగిన వైద్య సిబ్బంది ఉన్నారు. నార్మల్‌ డెలివరీలు చేస్తారు. తక్షణ వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. హైరిస్క్‌ పేషెంట్లకు కూడా మా డాక్టర్లు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రోగులకు భరోసా ఇస్తాం. మందుల కొరత లేదు.            
– డాక్టర్‌ సుబ్బారెడ్డి, సూపరింటెండెంట్, జిల్లా వైద్యశాల, మార్కాపురం

మరిన్ని వార్తలు