Andhra Pradesh: రైతుకు ఫుల్‌ ‘పవర్‌’

3 Jun, 2021 04:10 IST|Sakshi

వ్యవసాయ ఉచిత విద్యుత్తుకు నగదు బదిలీతో మెరుగైన ఫలితాలు

శ్రీకాకుళంలో పైలెట్‌ ప్రాజెక్టు విజయవంతం

రైతుల ఖాతాల్లోకే డబ్బులు జమ

బిల్లులు కట్టి ధీమాగా నాణ్యమైన కరెంట్‌ కోసం ప్రశ్నించే వీలు

విద్యుత్తు సంస్థల్లోనూ పెరిగిన జవాబుదారీతనం.. రాష్ట్రవ్యాప్తంగా పథకం విస్తరణకు సన్నాహాలు

స్మార్ట్‌ మీటర్లకు టెండర్ల ఆహ్వానం

సాక్షి, అమరావతి: వ్యవసాయ ఉచిత విద్యుత్తుకు నగదు బదిలీ విధానం, స్మార్ట్‌ మీటర్లు అమర్చడం ద్వారా కనిపిస్తున్న ఫలితాలపై రైతన్నల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమం పైలెట్‌ ప్రాజెక్టుగా అమలవుతున్న శ్రీకాకుళం జిల్లాలో ఈ దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. ప్రతి నెలా నేరుగా రైతుల ఖాతాల్లోనే బిల్లుల మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తోంది. తమ చేతుల మీదుగా విద్యుత్తు సంస్థలకు బిల్లులు చెల్లిస్తూ ధీమాగా నాణ్యమైన కరెంట్‌ ఉచితంగా పొందుతున్నారు. తమ ఖాతాల్లోనే నేరుగా ప్రభుత్వం నుంచి విద్యుత్తు సబ్సిడీ మొత్తం జమ అవుతుండటం, వారే నేరుగా బిల్లులు చెల్లిస్తుండటంతో నాణ్యమైన విద్యుత్తు సేవల కోసం ప్రశ్నించే హక్కు లభించిందని రైతులు పేర్కొంటున్నారు.  విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులున్నా, ఎక్కడైనా లో వోల్టేజీ సమస్యలు ఉత్పన్నమైనా వెంటనే నిలదీసే వీలుంది. మరోవైపు విద్యుత్తు సంస్థల్లోనూ జవాబుదారీతనం పెరిగింది. డిజిటల్‌ మీటర్లు అమర్చడం వల్ల అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పర్యవేక్షించగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విధానం విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలుకు సిద్ధమవుతున్నారు.

26 వేల పంపుసెట్లకు మీటర్లు..
వైఎస్సార్‌ వ్యవసాయ ఉచిత విద్యుత్తు పథకాన్ని మరింత జవాబుదారీతనంతో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించనున్నారు. వ్యవసాయ సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లోకే జమ చేసే విధానాన్ని ఖరీఫ్‌ నుంచి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఏడాదిగా ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ పథకం మంచి ఫలితాలనిచ్చింది. ప్రతి నెలా ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి సబ్సిడీ సొమ్మును జమ చేసింది. ఆ తర్వాత ఈ మొత్తం తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) ఖాతాకు అందింది. ఈ విధానంలో మరింత జవాబుదారీతనంతో విద్యుత్‌ సరఫరా జరిగినట్టు పరిశీలనలో తేలింది. జిల్లాలో మొత్తం 26 వేల పంపుసెట్లకు మీటర్లు అమర్చారు. శ్రీకాకుళం డివిజనలో 10, టెక్కలి, పాలకొండ డివిజన్లలో 8 వేల చొప్పున పైలెట్‌ ప్రాజెక్టు కింద చేపట్టారు.

నాణ్యమైన మీటర్లు..
విద్యుత్‌ వినియోగాన్ని లెక్కించేందుకు ఏర్పాటు చేసిన డివైజ్‌ లాంగ్వేజ్‌ మెసేజ్‌ స్పెసిఫికేషన్‌ (డీఎల్‌ఎంఎస్‌) మీటర్ల వల్ల వ్యవసాయ క్షేత్రాల్లో విద్యుత్తు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని ఈపీడీసీఎల్‌ అధికారులు తెలిపారు. దేశీయంగా తయారైన ఈ మీటర్లను టెండర్‌ ప్రక్రియ ద్వారా ముందే సమకూర్చుకున్నారు. టెస్టింగ్‌ లేబొరేటరీల్లో వీటిని పరీక్షించారు. నాణ్యమైన పాలీ కార్బొనేట్‌ మెటీరియల్‌తో తయారు చేయడం వల్ల ఇవి అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకున్నాయి. వర్షాకాలంలోనూ ఎలాంటి  విద్యుత్‌ షాక్‌లు, షార్క్‌ సర్క్యూట్‌ లాంటివి నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు.

ఇక స్మార్ట్‌ మీటర్లు
రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ క్షేతాల్లో స్మార్ట్‌ మీటర్లు అమర్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మూడు డిస్కమ్‌లు ఇప్పటికే ఇందుకు సంబంధించిన టెండర్లు పిలిచాయి. జూలైలో ఈ ప్రక్రియ తుదిదశకు చేరుకునే వీలుంది. ఈ మీటర్ల ద్వారా లోడ్‌  తెలుసుకుని తగిన సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం స్మార్ట్‌ మీటర్‌ ద్వారా ప్రధాన కార్యాలయం పర్యవేక్షించే వీలుంటుంది. దీంతో జవాబుదారీ తనం పెరుగుతుంది. 32 యాంప్స్‌ సామర్థ్యం గల ఫ్యూజ్‌లను అమరుస్తారు. వీటి ద్వారా 20 అశ్వశక్తి సామర్థ్యం (హెచ్‌పీ) విద్యుత్‌ లోడ్‌ వాడుకోవచ్చు. అంటే రైతు 20 హెచ్‌పీ మోటార్‌ అమర్చుకున్నా అభ్యంతరం చెప్పాల్సిన అవసరమే ఉండదు. స్మార్ట్‌ మీటర్‌ వీలుకాని చోట ఇన్ఫ్రారెడ్‌ రీడింగ్‌ (ఐఆర్‌ పోర్ట్‌) పద్ధతిలో రీడింగ్‌ తీస్తారు. ఈ క్రమంలో డీఎల్‌ఎంఎస్‌ మీటర్‌ విద్యుత్‌ ప్రసరణ తీరుతెన్నులను అర్థమయ్యే భాషలోకి మార్చి ఐఆర్‌ విధానానికి తెలియచేస్తుంది. లో వోల్టేజీ ఉంటే పసిగట్టి హెచ్చరిస్తుంది. 300 ఎంఎం వెడల్పు, 700 ఎంఎం పొడవుతో మైల్డ్‌ స్టీల్‌తో తయారయ్యే మీటర్‌కు గాల్వనైజ్డ్‌ ఎర్త్‌ కూడా ఇస్తారు. అందువల్ల ఎలాంటి షాక్‌లకు అవకాశం లేకుండా పూర్తి భద్రతతో ఉంటుందని అధికారులు వివరించారు.

మరిన్ని వార్తలు