లింకు నొక్కితే ఖాతా ఖాళీ 

28 Mar, 2022 03:49 IST|Sakshi

వాట్సాప్‌ గ్రూపుల్లో కొత్త లింకులతో జాగ్రత్త  

క్లిక్‌ చేస్తే బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయం 

నకిలీ పేమెంట్‌ యాప్‌లతోనూ మోసాలు 

బ్యాంకు మేనేజర్లకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు 

ఆన్‌లైన్‌ మోసాల ఛేదనలో పోలీసుల నిస్సహాయత 

అమాయకులే టార్గెట్‌గా చెలరేగుతున్న సైబర్‌ మోసగాళ్లు  

రెండు రోజుల క్రితం కొన్ని గ్రూపుల్లో ‘ది కాశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమా లింక్‌ వచ్చింది.  సినిమా చూద్దామన్న ఆసక్తితో చాలామంది లింక్‌ ఓపెన్‌ చేశారు. రెండు నిమిషాలు సినిమా వచ్చింది. తర్వాత కొత్త లింక్‌ రావడంతో కొందరు దాన్ని క్లిక్‌ చేశారు. అంతే బ్యాంకు ఖాతాలోని డబ్బు మాయమైంది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక మదనపడుతున్నారు. ఈ నెల 19న అనంతపురం సప్తగిరి సర్కిల్‌లోని ఓ మొబైల్‌షాపులో ఇద్దరు యువకులు వచ్చి మొబైల్‌ ఫోన్‌ కొన్నారు. ఫోన్‌పే ద్వారా డబ్బు చెల్లించారు. ‘అమౌంట్‌ రిసీవ్‌డ్‌ సక్సెస్‌ఫుల్లీ’ అంటూ రావడంతో మొబైల్‌ షాపు యజమాని ఓకే అన్నారు. తర్వాత చెక్‌ చేస్తే ఒక్క పైసా అమౌంటు బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. తీరా చూస్తే నకిలీ ఫోన్‌పే యాప్‌ ద్వారా చెల్లింపులు చేశారని తేలింది.  
– సాక్షి ప్రతినిధి, అనంతపురం 

ఇవి మచ్చుకు రెండు ఉదాహరణలు మాత్రమే. మొబైల్‌ ఫోన్ల ద్వారా జరుగుతున్న లావాదేవీలు ఆన్‌లైన్‌ మోసగాళ్లకు అవకాశం మారుతున్నాయి. వివిధ మార్గాల్లో వేలకు వేలు కొల్లగొడుతున్నారు. బ్యాంకు ఖాతాల నుంచి ఉన్నట్టుండి డబ్బు మాయమైపోతోంది. చివరకు ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి పేమెంట్‌ యాప్‌లు కూడా నకిలీవి సృష్టించి మోసం చేస్తున్నారు. అమాయకులకు వివిధ వాట్సాప్‌ గ్రూపుల ద్వారా గానీ, నంబర్ల నుంచి నేరుగా గానీ  వెబ్‌సైట్‌ లింకులు పంపించడం, వాటిని నొక్కితే ఖాతాల నుంచి డబ్బు లాగేయడం పరిపాటిగా మారింది. ఇలాంటి మోసాలపై బ్యాంకు మేనేజర్లకు సైతం ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురంలోని ఓ బ్యాంకులో నెల వ్యవధిలోనే 58 ఫిర్యాదులు అందాయి. తాజాగా అనంతపురం జిల్లా ఓడీ చెరువుకు చెందిన శ్రీనివాసులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతా నుంచి రూ.40 వేలు మాయమైంది. బ్యాంకు మేనేజర్‌ను కలిస్తే తమకు సంబంధం లేదని చెప్పారు.  

బ్యాంకుల్లో భద్రమనుకుంటే.. 
బయట ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి వస్తాయో, రావోనన్న భయం. దీంతో బ్యాంకుల్లోనే దాచుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. కానీ అక్కడా భద్రత ఉండడం లేదని బాధితులు వాపోతున్నారు.  ఒకవైపు డిజిటల్‌ సేవలు అంటూ ప్రచారం చేస్తున్నారు కానీ మొబైల్‌ సేవల కోసం వెళితే డబ్బులు ఎగిరిపోతున్నాయి. దీనిపై బ్యాంకులను, పోలీసులను ఆశ్రయించినా పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు.  

ఏఈపీఎస్‌ ద్వారానూ మోసాలు 
సైబర్‌ నేరగాళ్లు ఆధార్‌ ఎనేబుల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ (ఏఈపీఎస్‌) ద్వారానూ మోసాలకు పాల్పడుతున్నారు. గడిచిన రెండు నెలల్లో ఇలా మోసపోయిన బాధితులు జిల్లాలో 30 మందికి పైగానే ఉన్నారు. ఏటీఎం సౌకర్యం లేని ప్రాంతాల్లో నగదును ప్రజలు తీసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏఈపీఎస్‌ పద్ధతి ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఫింగర్‌ ప్రింట్‌ సాయంతో రోజుకు రూ.10 వేల వరకు డ్రా చేసుకునే అవకాశం ఉంది. దీంతో సైబర్‌ నేరగాళ్లు వివిధ రూపాల్లో ప్రజల వేలిముద్రలను సేకరించి ఏఈపీఎస్‌ ద్వారా డబ్బు దోచేస్తున్నట్లు తెలుస్తోంది.   

ఇలాంటి పొరపాట్లు చేయొద్దు.. 
► కొత్త నంబర్ల నుంచి వచ్చే వెబ్‌సైట్‌ లింకులపై క్లిక్‌ చేయకూడదు. 
► ఎవరైనా క్యాష్‌ ఇవ్వండి.. ఫోన్‌పే చేస్తామని అడిగితే నిరాకరించండి. నకిలీ యాప్‌ ద్వారా పంపితే అమౌంట్‌ వచ్చినట్టు చూపిస్తుంది కానీ మన ఖాతాలో జమకాదు. 
► ఇటీవల హిట్‌ సినిమాల పేర్లతో లింకులు వస్తున్నాయి. వీటిని క్లిక్‌ చేయడం ప్రమాదకరం. 
► మన ఫోన్‌ ఇతరులకు ఇవ్వొద్దు. క్యూఆర్‌ కోడ్‌ వంటి వివరాలను వారి ఫోన్‌ సాయంతో తస్కరించి మోసాలకు పాల్పడే అవకాశముంది. 
► ఆన్‌లైన్‌ బ్యాంకింగ్, పేమెంట్‌ యాప్‌లకు సంబంధించిన పాస్‌వర్డ్‌లు గోప్యంగా ఉంచుకోవాలి. 
► ఫోన్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ పాస్‌వర్డ్‌లు నమోదు చేయకూడదు. 

అప్రమత్తంగా ఉండాల్సిందే 
సైబర్‌ నేరగాళ్ల వలలో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి లింకులూ క్లిక్‌ చేయొద్దు. సామాజిక మాధ్యమాల్లో గుర్తుతెలియని వ్యక్తుల మెసేజ్‌లకు స్పందించొద్దు. ముఖ్యంగా వివిధ బ్యాంకుల పేరుతో వచ్చే కాల్స్‌కు ఓటీపీలు చెప్పవద్దు. సైబర్‌ నేరాల నియంత్రణలో భాగంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. 
– ఫక్కీరప్ప కాగినెల్లి, ఎస్పీ 

బ్యాంకులు లింకులు పంపవు 
చాలాసార్లు పాన్‌ కార్డ్, ఆధార్‌ కార్డ్‌ లింక్‌ కాలేదని బ్యాంకుల పేరుతో లింకులు వస్తుంటాయి. కానీ ఏ బ్యాంకులూ అలా చేయవు. అలా వచ్చాయంటే నకిలీవని గుర్తించాలి. వాటిపై క్లిక్‌ చేయొద్దు. వెబ్‌సైట్‌ ద్వారా ఆధార్‌ను లాక్‌ చేసుకోవాలి. ఈజీ లావాదేవీల కోసం ప్రైవేటు యాప్‌లను ఆశ్రయించడం మంచిది కాదు.   
–జి.భాస్కర్‌రెడ్డి, చీఫ్‌ మేనేజర్, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 

మరిన్ని వార్తలు