Illegal Layouts: కొనుగోలుదారులూ అదంతా మాయ! ఆ సర్వే నంబర్లలో లేఅవుట్‌కు అనుమతులున్నాయా?

17 Aug, 2022 21:03 IST|Sakshi
ఎటువంటి అనుమతుల్లేకుండా విక్రయాలు సాగిస్తున్న వరిశాం రామ్‌నగర్‌ లేఅవుట్‌

రణస్థలంలో అధికారులు, రియల్టర్ల మాయాజాలం 

అనుమతులు లేకుండానే లే అవుట్లు, రిజిస్ట్రేషన్లు 

ఒక్క వరిశాంలోనే 9 ప్లాట్ల అడ్డగోలు అమ్మకాలు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: లేఅవుట్‌లో ఉన్న భూములకు కన్వర్షన్‌ జరిగిందా? ప్లాన్‌ అప్రూవల్‌ వచ్చిందా? వాస్తవంగా ప్లాట్లు వేశారా? రోడ్లు, సామాజిక అవసరాలకు భూమిని మినహాయించారా? ప్రభుత్వ భూములు, సాగునీటి కాలువలున్నాయా..?  సొంతింటి కల సాకారం చేసుకోవాలనే ఆతృతతో ప్లాట్లు కొనుగోలు చేస్తున్న ప్రజలు ఇప్పుడవేవీ తెలుసుకోవడం లేదు. స్థలం దొరికిందని ఆదరాబాదరాగా చెల్లింపులు చేసేస్తున్నారు. లొసుగును బయటపెట్టాల్సిన అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో కూడా చెక్‌ పెట్టడం లేదు. దీంతో చివరికి కొనుగోలుదారులు మోసపోవాల్సి వస్తోంది. రణస్థలం మండలం వరిశాంలో ఉన్న రామ్‌నగర్‌ లేఅవుట్‌లో ప్లాట్లు కొనుగోలు చేస్తున్న వారి పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది.    

అంతా మాయ.. 
వరిశాంలోని రామ్‌నగర్‌ లే అవుట్‌లో సర్వే నంబర్‌.23–7ఎ, 23–11, 23–12, 23–13, 23–14, 23–15లో గల ఏడెకరాల భూమిలో లేఅవుట్‌ వేసినట్టుగా నిర్వాహకులు కాగితాల్లో చూపిస్తున్నారు. ఎన్ని ప్లాట్లు వేశారో ఎవరికీ తెలియడం లేదు. అక్కడ ల్యాండ్‌ పొజిషన్‌ లేదు. దానికి కారణం వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా కన్వర్షన్‌ చేయించలేదు. లేఅవుట్‌ వేసేందుకు అనుమతి తీసుకోలేదు. అంతా కాగితాల్లోనే మాయాజాలం ప్రదర్శించి రణస్థలం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు.

ముందస్తు ఒప్పందమో మరేమిటో తెలియదు గానీ అధికారులు కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. తమకు డాక్యుమెంట్‌ వచ్చిందని రిజిస్ట్రేషన్‌ చేసేస్తున్నారు. పక్కాగా ఉన్న ప్లాట్లపై జరిగే క్రయ, విక్రయాలకు అనేక ప్రశ్నలు, అభ్యంతరాలు తెలిపే రిజిస్ట్రేషన్‌ అధికారులు.. వరిశాంలోని రామ్‌నగర్‌ లేఅవుట్‌కు సంబంధించి వస్తున్న అక్రమ డాక్యుమెంట్లపై కనీసం అడగడం లేదు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్‌ వచ్చీ రాగానే రిజిస్ట్రేషన్‌ చేసేస్తున్నారు. దీనివెనక ఉన్న లాలూచీ ఏంటో వారికే తెలియాలి.

  

ల్యాండ్‌ కన్వర్షన్, ప్లాన్‌ అప్రూవల్‌ లేని రామ్‌నగర్‌ లేఅవుట్‌లోని నంబర్‌.74 ప్లాట్‌ క్రయ, విక్రయాలకు సంబంధించి జరిగిన రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌

కొనుగోలుదారులు మునిగినట్టే.. 
వ్యవసాయ భూమిని లేఅవుట్‌గా వేయాలంటే ముందుగా ల్యాండ్‌ కన్వర్షన్‌ చేయాలి. దాని కోసం రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వానికి భూమి విలువలో 5శాతం చెల్లించి ల్యాండ్‌ కన్వర్షన్‌ చేసుకోవాలి. దీని తర్వాత లేఅవుట్‌ వేసేందుకు వుడా లేదంటే సుడా నుంచి ప్లాన్‌ అప్రూవల్‌ తీసుకోవాలి. ఇందుకు భూమి విలువలో 12శాతం చెల్లింపులు చేయాలి. తదననుగుణంగా వచ్చిన అనుమతుల మేరకు రోడ్లు, సామాజిక అవసరాల కోసం స్థలం మినహాయించి మిగతా స్థలాన్ని ప్లాట్లుగా విభజన చేయాలి.

కానీ వరిశాంలోని రామ్‌నగర్‌ లేఅవుట్‌ భూమికి కన్వర్షన్‌ గాని, ప్లాన్‌ అప్రూవల్‌ గాని తీసుకోలేదు. ప్రభుత్వానికి ఒక్క పైసా చెల్లించకుండానే కాగితాల్లో లేఅవుట్‌ సృష్టించారు. అందమైన బ్రోచర్లతో ప్లాట్లను అమ్మేస్తున్నారు. వారికి నమ్మకం కలిగేలా కొనుగోలుదారు పేరున సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయించేస్తున్నారు. అంతే తప్ప వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడం లేదు. లేఅవుట్‌లో విద్యుత్‌ సౌక ర్యం గాని, కాలువలు గాని ఉండడం లేదు.

రోడ్లు, సామాజిక అవసరాల కోసం ఖాళీగా స్థలాన్ని మినహాయించిన పరిస్థితి లేదు. అసలు కొనుగోలుదారుల ప్లాట్‌ ఎక్కడో భౌతికంగా తెలియదు. దీనివల్ల కొనుగోలు చేసిన స్థలంలో భవిష్యత్‌లో ఇళ్లు కట్టుకోవాలంటే అనుమతి రాదు. ప్లాన్‌ ఇచ్చేందుకు అవకాశం ఉండదు. ఇవన్నీ రెగ్యులర్‌ చేస్తే తప్ప ఇంటి నిర్మాణానికి అనుమతి రాదు. కన్వర్షన్, ప్లాన్‌ అప్రూవల్‌కు మళ్లీ డబ్బులు చెల్లించాలి. రోడ్లు, సామాజిక అవసరాల కోసం కొనుగోలు చేసిన స్థలాల నుంచే కేటాయించాల్సి వస్తోంది. ఫలితంగా కొనుగోలు చేసే స్థలం విస్తీర్ణం కూడా తగ్గిపోనుంది. ఈ పరిస్థితి రాకుండా ముందుగా లేఅవుట్‌కున్న అనుమతులు పరిశీలించాలి. ప్లాన్‌ అప్రూవల్‌తో ఉన్న ప్లాట్లను గుర్తించి కొనుగోలు చేయాలి. ఇలా జరగకపోవడం వల్ల కొనుగోలుదారులు నిండా మునిగిపోతున్నారు. మరో వైపు ఇలాంటి వ్యవహారాలతో ప్రభుత్వ పరంగా ఆదాయానికి గండిపడుతోంది.   

రెండు తేదీల్లో తొమ్మిది ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు..  
వరిశాంలోని అనధికారికంగా వేసిన రామ్‌నగర్‌ లేఅవుట్‌లో రెండు తేదీల్లో ఏకంగా తొమ్మిది ప్లాట్లకు రణస్థలం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. సర్వే నంబర్‌ 23–7ఎలో 60, 64, 65, 66, 74, 75, సర్వే నంబర్‌ 23–14లో 8, 23–14,23–15లో 6 నెంబర్ల గల ప్లాట్లకు గత నెల 25న రిజిస్ట్రేషన్లు చేశారు. సర్వే నంబర్‌ 23–14, 23–15లో గల 23వ ప్లాట్‌ను ఆగస్టు 3న రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇదంతా పక్కా పథకం ప్రకారం జరిగినట్లు తెలుస్తోంది.   

మరిన్ని వార్తలు