Bharat Bandh: దేశ వ్యాప్తంగా కొనసాగుతోన్న భారత్‌ బంద్‌

27 Sep, 2021 16:44 IST|Sakshi

Bharat Bandh Highlights:

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో భారత్‌ బంద్‌ ర్యాలీలో భాగంగా కారులో వెళుతున్న నిరసనకారుడు.. తన కారును డీసీపీ  ధర్మేందర్‌ కుమార్‌ మీనా పాదాల మీదుగా తీసుకెళ్లాడు. బెంగళూరు సిటీ నార్త్‌ డివిజన్‌ డీసీపీ మీనా.. గోరగుంటెపాళ్య వద్ద వాహనాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుండగా ఈ  సంఘటన జరిగింది. ఈ ఘటన తర్వాత నిరసనకారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రమాదంలో డీసీపీ కాలుకి గాయలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు.

ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వం విఫలమైందని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికైత్ మండిపడ్డారు. పంటలను కనీస మద్దతు ధరకు విక్రయించడం లేదని విమర్శించారు. యోగి ఆదిత్యనాథ్ తన మ్యానిఫెస్టోలో చెరకు ధరను రూ. 375-రూ. 450 కి పెంచుతానని హామీ ఇచ్చాడని అయితే అతను దానిని రూ. 25 మాత్రమే పెంచారని అన్నారు. 

పోలీసుల బారికేడ్లను పగలగొట్టిన రైతులు
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ నేపధ్యంలో తమిళనాడు నిర్మానుష్యంగా మారింది. చెన్నైలోని అన్నాసలై ప్రాంతంలో పోలీసులతో ఘర్షణ పడిన రైతులు పోలీసుల బారికేడ్లను పగలగొట్టారు. దీంతో పరిస్థితి చెయ్యి దాటింది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.

గురుగ్రామ్-ఢిల్లీ సరిహద్దు: రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్ నేపథ్యంలో దేశ రాజధానిలో ప్రవేశించే వాహనాలను ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ సిబ్బంది తనిఖీ చేస్తుండగా గురుగ్రామ్-ఢిల్లీ సరిహద్దులో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయింది.

కేరళ: కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కేరళలో భారత్‌ బంద్‌ కొనసాగుతోంది. రాష్ట్రంలో పలు రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. రైతుల నిరసనకు మద్దతుగా.. తిరువనంతపురంలో వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌కు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలు భారత్ బంద్‌లో పాల్గొన్నాయి.

ఢిల్లీ- అమృత్‌సర్‌: ఢిల్లీ- అమృత్‌సర్‌ జాతీయ రహదారిపై రైతులు నిరసన తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా భారత్‌ బంద్‌ కొనసాగుతోంది. జాతీయ స్థాయిలో 19 ప్రతిపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయం మేరకు భారత్‌ బంద్‌ను విజయవంతం చేసేందుకు బీజేపీయేతర ప్రతిపక్షాలు నడుంబిగించాయి.

పంజాబ్‌- హర్యానా: భారత్‌ బంద్‌లో భాగంగా పంజాబ్‌-హర్యానా సరిహద్దులను మూసివేసి రైతులు నిరసన తెలుపుతున్నారు. ఉదయం 4 గంటల నుంచే సరిహద్దులను వేసివేసినట్లు ఓ రైతు మీడియాతో పేర్కొన్నాడు.

ఉత్తరప్రదేశ్‌: ఘజిపూర్ సరిహద్దులో రైతుల నిరసన కొనసాగుతోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్‌ కొనసాగుతోంది. రైతుల నిరసనలతో ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఘజిపూర్ వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి.

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్‌ను కొనసాగుతోంది. భారత్‌ బంద్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏపీలోని విజయవాడ బస్టాండ్ ఎదుట వామపక్ష, కాంగ్రెస్ పార్టీల ఆందోళన చేపట్టాయి.

కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వాహానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వామపక్ష పార్టీల బంద్‌కు వ్యాపార వాణిజ్య, విద్యా సంస్థలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. వర్షం సైతం లెక్క చేయకుండా విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద రైతులకు మద్దతుగా వామపక్ష, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఆందోళన చేస్తున్నారు.

మరిన్ని వార్తలు