ఆంధ్రప్రదేశ్‌: నేటి బంద్‌కు సర్వం సన్నద్ధం

27 Sep, 2021 04:11 IST|Sakshi

మధ్యాహ్నం వరకు బస్సులు నిలిపివేత

విద్య, వాణిజ్య, వ్యాపార సంస్థల మూత.. పలు పరీక్షలు, శిక్షణ తరగతులు వాయిదా

బీజేపీ మినహా మిగతా పార్టీలన్నీ బంద్‌కు మద్దతు

ప్రజలంతా సహకరించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా వినతి

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపిస్తూ 500కు పైగా రైతు, ప్రజాసంఘాలు సోమవారం తలపెట్టిన భారత్‌ బంద్‌కు రాష్ట్రంలో పూర్తి సన్నాహాలు చేసినట్టు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌.కె.ఎం.) ప్రకటించింది. బంద్‌కు అధికార వైఎస్సార్‌సీపీ సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. కేంద్ర కార్మిక, ఉద్యోగ సంఘాలు, ఇతర ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు బంద్‌లో పాల్గొంటున్నట్టు తెలిపాయి. బంద్‌కు సహకరిస్తామని రాష్ట్ర మంత్రి పేర్ని నాని తెలిపారు. రాష్ట్రంలో మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులను నిలిపేస్తున్నారు. విద్య, వాణిజ్య, వ్యాపారసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటిస్తున్నాయి. సినిమా హాళ్లలో ఉదయం పూట ఆటలు రద్దుచేస్తున్నట్టు సినిమా థియేటర్ల యాజమాన్యాలు ఇప్పటికే నోటీసు బోర్డులు పెట్టాయి.

లారీలు, ఆటోలను తిప్పబోమని ఆయా సంస్థలు ప్రకటించాయి. రవాణా పూర్తిగా స్తంభించనున్నందున అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని ఎస్‌.కె.ఎం. బాధ్యులు వై.కేశవరావు, రావుల వెంకయ్య, వడ్డే శోభనాద్రీశ్వరరావు తదితరులు విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాల ప్రయోజనాల కోసం జరుగుతున్న ఈ బంద్‌కు ప్రజలంతా సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో జరిగే బంద్‌తోనైనా కనువిప్పు కలగాలని, అందుకుబంద్‌ సరైన అవకాశమన్నారు.

బంద్‌ ఎందుకంటే..
కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని కోరుతూ 10 నెలలుగా సాగుతున్న పోరాటానికి మద్దతుతోపాటు ఆ చట్టాల రద్దు కోసం, కోట్లాదిమంది కార్మికుల ప్రయోజనాలను కాలరాసేలా తీసుకువచ్చిన లేబర్‌ కోడ్స్‌ను రద్దు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా కోరుతోంది. ప్రతి పంటకు కనీస మద్దతు ధరకు చట్టం చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను నిలిపివేయాలని, ఉపాధి హామీ కూలీల రోజువారీ వేతనాన్ని పెంచాలని, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా చెప్పి మాట తప్పడాన్ని నిరసిస్తోంది. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయవద్దని నినదిస్తోంది.

పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా జాప్యం చేయడాన్ని విమర్శించింది. బంద్‌పై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతు, ప్రజాసంఘాలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. అన్ని వర్గాల మద్దతు కూడగట్టాయి. ఈ బంద్‌కు బీజేపీ మినహా ప్రధాన పార్టీలన్నీ మద్దతునిచ్చాయి. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం స్వచ్ఛందంగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆర్టీసీ బస్సులను నిలిపేసింది. ప్రతిపక్ష టీడీపీ తన శ్రేణులను బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చింది. బంద్‌ను జయప్రదం చేసేందుకు వామపక్షాలు 15 రోజులుగా పలు కార్యక్రమాలను నిర్వహించాయి.

నేడు పాఠశాలలకు సెలవు
భారత్‌ బంద్‌కు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల సూచన మేరకు సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సురేష్‌ తెలిపారు. ఈ సెలవుకు ప్రత్యామ్నాయంగా మరో రోజు పనిదినంగా నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు ఆదివారం ఆయన 
ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  

సివిల్స్‌ కోచింగ్‌కు ఎంపిక పరీక్ష వాయిదా
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే సివిల్స్‌ పరీక్షలకు ఉచిత కోచింగ్‌ ఇచ్చేందుకు సోమవారం జరగాల్సిన ఎంపిక పరీక్షను బంద్‌ కారణంగా వాయిదా వేసినట్టు ఏపీ స్టడీ సర్కిల్‌ సంచాలకుడు ఉసురుపాటి వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇస్తున్న ఈ ఉచిత కోచింగ్‌ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,573 మంది దరఖాస్తు చేశారని, వీరికి సోమవారం నిర్వహించాల్సిన పరీక్షను వాయిదా వేశామని పేర్కొన్నారు.

ఏపీపీజీఈసెట్‌లో నేటి పరీక్షలు వాయిదా
భారత్‌ బంద్‌ నేపథ్యంలో సోమవారం జరగాల్సిన ఏపీపీజీఈసెట్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సెట్‌ చైర్మన్, కన్వీనర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం జియో ఇంజనీరింగ్, జియో ఇన్ఫర్మేటిక్స్, ఫార్మసీ, కంప్యూటర్‌ సైన్సు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సబ్జెక్టులలో ప్రవేశ పరీక్షలను వాయిదా వేశామని, ఇదే సెట్‌కు సంబంధించి మంగళ, బుధవారాల్లో జరగాల్సిన పరీక్షలు యథాతథంగా జరుగుతాయని వివరించారు.

వార్డు సభ్యులకు శిక్షణ 29 నుంచి..
పంచాయతీ వార్డు సభ్యులకు సోమవారం నుంచి జరగాల్సిన శిక్షణ కార్యక్రమాలను ఉత్తరాంధ్ర తుపాను ప్రభావం, భారత్‌ బంద్‌ నేపథ్యంలో 2 రోజులు వాయిదా వేసినట్టు ఏపీ ఎస్‌ఐఆర్‌డీ డైరెక్టర్‌ జె.మురళి తెలిపారు. ఈనెల 29 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు