బాబూ.. టీకా తెప్పించవూ!

10 May, 2021 03:14 IST|Sakshi

బంధువుల కంపెనీయే కనుక మాట్లాడి తెప్పించండి.. అది చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంపై నిందలా?

ప్రస్తుతం వ్యాక్సిన్‌ క్రయవిక్రయాలన్నీ కేంద్రం నియంత్రణలోనే

ఏ రాష్ట్రానికి ఎంత కోటానో, ఏ వయసు వారికి వెయ్యాలో నిర్దేశిస్తున్న కేంద్రం 

రాష్ట్రానికి ఇప్పటిదాకా వచ్చిన వ్యాక్సిన్లు 73.49 లక్షలే

అదనపు కోటా కోసం ఇప్పటికే సీఎం రెండు లేఖలు.. ప్రభుత్వ విభాగాల నుంచీ కేంద్రానికి అభ్యర్థనలు

కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ల కోటాను నిర్దేశిస్తూ కేంద్రం సమాధానం

వాటికి మాత్రమే డబ్బు చెల్లించి వ్యాక్సిన్‌ తీసుకోవాలని స్పష్టీకరణ

కంపెనీలను నేరుగా అభ్యర్థించిన రాష్ట్రం.. టీకా కేటాయిస్తే వెంటనే డబ్బు చెల్లిస్తామని స్పష్టీకరణ

కేంద్రం ఆదేశాల మేరకే నడుచుకుంటున్న కంపెనీలు

ఈ వాస్తవాలు తెలిసి కూడా చంద్రబాబు నేలబారు రాజకీయాలు

భారత్‌ బయోటెక్‌ సంస్థ రామోజీ తనయుడి వియ్యంకుడిదే

బాబు నేరుగా మాట్లాడి తెప్పించ వచ్చు కదా అంటున్న మంత్రులు  

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ మొత్తం కేంద్రం కనుసన్నల్లో నడుస్తోంది. ఏ రాష్ట్రానికి ఎంత కోటా ఇవ్వాలనేది కంపెనీలకు కేంద్రమే నిర్దేశిస్తోంది. కంపెనీలకు ఎంత డబ్బు చెల్లించాలో రాష్ట్రాలక్కూడా కేంద్రమే చెబుతోంది. అంతేకాదు!! కంపెనీల నుంచి తీసుకున్నాక ఏ వయసు వారికి వ్యాక్సిన్‌ ఇవ్వాలన్నదీ కేంద్రం నిర్దేశమే. ఈ వాస్తవాల నడుమ అటు కేంద్రానికి, ఇటు కంపెనీలకూ అభ్యర్థనలు చేస్తూ... లేఖలు రాస్తూ వీలైనంత ఎక్కువ వ్యాక్సిన్లు పొందటానికి రాష్ట్రం ప్రయత్నిస్తోంది. దేశంలో రెండు కంపెనీలే ఉత్పత్తి చేస్తున్నాయి కనక.. వాటి ఉత్పత్తి సామర్థ్యం ఇంకా పెరగలేదు కనక కేంద్రం నుంచి కూడా సానుకూల స్పందన రావటం లేదు. దీంతో వ్యాక్సిన్‌ మొదటి డోసు వేసుకున్న వారికి సకాలంలో రెండో డోసు వేయకపోతే మళ్లీ మొదటి నుంచి వేయాల్సి వస్తుందనే వాస్తవాన్ని వివరిస్తూ... ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వ్యాక్సిన్‌ ఇస్తామని, అది కూడా రెండో డోసుకు ప్రాధాన్యమిచ్చి... ఆ తరవాత మొదటి డోసు వేస్తామని ఈ మేరకు అనుమతివ్వాలని కూడా కేంద్రాన్ని రాష్టం కోరింది. ఆ మేరకే చేస్తోంద కూడా. ఇన్ని వాస్తవాలు తెలిసి కూడా... తెలుగుదేశం పార్టీ జనాన్ని రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందటానికి దుష్ప్రచారానికి దిగుతుండటం రాష్ట్రంలో ఎవ్వరికీ మింగుడు పడటం లేదనే చెప్పాలి. రెండో డోసు వారికి తొలుత పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా కూడా వ్యాక్సిన్‌ కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ తమ కార్యకర్తలను పంపిస్తోందని... వ్యాక్సిన్‌ వేయకపోవటంతో వెనుదిరుగుతున్నారనే ప్రచారానికి ఒడిగడుతోందని విమర్శలున్నాయి. ఈ విమర్శలను పతాక శీర్షికల్లో ప్రచురిస్తూ ఈనాడుతో సహా కొన్ని బాబు అనుకూల పత్రికలు ఛానెళ్లు తమ ప్రభు భక్తిని చాటుకుంటున్నాయి.  

నిజానికి కేంద్ర నియంత్రణలు, కంపెనీల పరిమిత విక్రయాలు... ఇవన్నీ నిజం కాదనుకున్నా, లేవని భావించినా వ్యాక్సిన్‌ విషయంలో చంద్రబాబు కాస్త పరిణితితో వ్యవహరించే అవకాశం ఎటూ ఉంది. చౌకబారు విమర్శలు మాని... వ్యాక్సిన్‌ తయారీ కంపెనీల్లో ఒకటైన భారత్‌ బయోటెక్‌.. రాష్ట్రానికి ఎక్కువ కోవాగ్జిన్లు విక్రయించేలా ప్రయత్నించవచ్చు. ఎందుకంటే ఈ కంపెనీ స్వయానా రామోజీరావు కుమారుడి వియ్యంకుడిది. చంద్రబాబుకూ వీరు సన్నిహితులే కాబట్టి ఈ కంపెనీ ద్వారా రాష్ట్రానికి కావలసిన వ్యాక్సిన్లు తెప్పించాలని రెండ్రోజులుగా రాష్ట్ర మంత్రులు అభ్యర్థిస్తున్నారు కూడా. కాకపోతే రాజకీయ లబ్ధి తప్ప వేరేవీ పట్టని చంద్రబాబు... ప్రభుత్వంపై బురద చల్లటానికి, జనాన్ని రెచ్చగొట్టడానికి మాత్రమే ప్రాధాన్యమిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.  

టీకా వేసే సామర్థ్యంలో ఏపీ ముందంజ 
దేశంలోనే రోజుకు ఎక్కువ డోసులు టీకా వేసే సామర్థ్యం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ఉందని, ఒక్క రోజులో ఏకంగా 6.28 లక్షల మందికి టీకా వేసి గత నెల 14న నిరూపించింది. టీకా దొరికితే రాష్ట్ర ప్రభుత్వమే కొని వేయడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. కంపెనీలకు లేఖలు సైతం రాసింది. టీకా కొనుక్కోవడం మన చేతుల్లో లేకపోవడంతో కేంద్రానికి ఇప్పటికే ముఖ్యమంత్రి నుంచి అధికారుల వరకు ఐదు దఫాలు లేఖలు రాశారు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రధాని మోదీకి రెండు లేఖలు రాశారు. అధికారులు ఇప్పటికీ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతో ప్రతిరోజూ దీనిపై అభ్యర్థిస్తూనే ఉన్నారు. ప్రతిపక్ష నేత మాత్రం దీన్ని రాజకీయం చేయాలని, వ్యాక్సిన్‌ సకాలంలో వేస్తే ఎక్కడ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందో అన్నట్టు వ్యవహరిస్తుండటం నిపుణులనే కాదు సామాన్యులనూ ఆశ్చర్యపరుస్తోంది. 

ఇప్పటి వరకు కేంద్రానికి ఐదు లేఖలు 
► తమకు టీకా అదనంగా కావాలని, రోజుకు 6 లక్షల డోసులు పైగా వేసే సామర్థ్యం ఉందని ముఖ్యమంత్రి, అధికారులు కేంద్రాన్ని అభ్యర్థించారు. 2021 ఏప్రిల్‌ 9వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ‘1,140 పీహెచ్‌సీలు, 259 అర్బన్‌ హెల్త్‌ పీహెచ్‌సీలు ఉన్నాయి. విలేజ్‌/వార్డు వలంటీర్లు కృతనిశ్చయంతో ఉన్నారు. తక్షణమే 25 లక్షల డోసుల వ్యాక్సిన్‌ ఇవ్వాలి’ అని లేఖలో విజ్ఞప్తి చేశారు.  
► 2021 ఏప్రిల్‌ 16న ముఖ్యమంత్రి మరోమారు ప్రధానికి లేఖ రాశారు. ‘ఏప్రిల్‌ 14న టీకా ఉత్సవ్‌లో భాగంగా ఒకే రోజు 6.28 లక్షల పైచిలుకు డోసులు వేశాం. 45 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్‌ పూర్తి కావాలంటే తక్షణమే 60 లక్షల డోసులు పంపించండి’ అని ఆ లేఖలో విన్నవించారు.  
► 2021 మార్చి 26వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌.. రానున్న నెల రోజుల్లో కోటి డోసులు వ్యాక్సిన్‌ ఇస్తే వేయడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌కు లేఖ రాశారు.  
► 2021 ఏప్రిల్‌ 30న వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌... రెండో డోసు పూర్తి చేయటానికి తక్షణం వ్యాక్సిన్లు కేటాయించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.  
► 2021 ఏప్రిల్‌ 24న వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర (సర్వీసెస్‌) కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ‘18–45 ఏళ్ల మధ్య వారికి టీకా ఇచ్చేందుకు మాకు 4.08 కోట్ల డోసుల అవసరం ఉంది. మేం కొనుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. రోజుకు 6 లక్షల డోసులు వేసే సామర్థ్యం ఉంది. వీలైనంత త్వరగా మాకు వ్యాక్సిన్‌ అందించండి’ అని కోరారు. 

కేంద్రం నుంచి లేఖలు ఇలా.. 
► 2021 ఏప్రిల్‌ 29న జాతీయ హెల్త్‌ మిషన్‌ అధికారులు రాష్ట్రానికి లేఖ రాశారు. ‘మీకు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా నుంచి 9,91,700 డోసులు అలాట్‌ చేశాం. మే 1కి మీకు ఈ వ్యాక్సిన్‌ అందుతుంది’ అని లేఖలో పేర్కొన్నారు.  
► అదే రోజు మరో లేఖ అందింది. ‘మీకు భారత్‌ బయోటెక్‌ సంస్థ నుంచి 3,43,930 డోసులు కేటాయించాం. ఈ వ్యాక్సిన్‌ మీకు మే 1 నాటికి వస్తుంది. మీరు టీకా ప్రక్రియ కొనసాగించండి’ అని పేర్కొన్నారు. 
టీకా లభ్యత పెరిగే వరకూ ఏమీ చేయలేం 
అన్ని రకాలుగా టీకా గురించి కేంద్రాన్ని అడుగుతున్నాం. మేమే కొనుక్కుంటామని కూడా చెప్పాం. దీనిపై లేఖ రాశాం. ప్రతిరోజూ ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూనే ఉన్నాం. ప్రస్తుతం ఉన్న లభ్యతను బట్టి రెండో డోసు మాత్రమే వేస్తున్నాం. 18 ఏళ్ల వయసు దాటిన వాళ్లందరికీ టీకా వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. డబ్బు పెట్టి కొనేందుకూ సిద్ధంగా ఉన్నాం. కానీ లభ్యత లేదు. కోటా ప్రకారమే వస్తోంది. 
– అనిల్‌కుమార్‌ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ   

మరిన్ని వార్తలు