గనుల శాఖకు ఘన పురస్కారం

13 Jul, 2022 03:37 IST|Sakshi
కేంద్ర మంత్రులు అమిత్‌షా, ప్రహ్లాద్‌ జోషి నుంచి నగదు పురస్కారం అందుకుంటున్న రాష్ట్ర గనుల శాఖ అధికారులు

అన్వేషణ, వేలం, మైనింగ్‌లో ఏపీ అత్యుత్తమ విధానాలు

జాతీయ స్థాయిలో ప్రశంసలు.. ఖనిజ వికాస్‌ అవార్డు

అమిత్‌షా చేతుల మీదుగా అందుకున్న ద్వివేది, వెంకటరెడ్డి  

భారతి సిమెంట్స్‌కు కేంద్ర గనుల శాఖ ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: రాష్ట్ర గనుల శాఖ అనుసరిస్తున్న పారదర్శక విధానాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ప్రధాన ఖనిజాల అన్వేషణ, వేలం, మైనింగ్‌ కార్యకలాపాల పర్యవేక్షణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ గనులశాఖ పాటిస్తున్న అత్యుత్తమ విధానాలను ప్రశంసిస్తూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. రానున్న రెండేళ్లకుగానూ రాష్ట్రీయ ఖనిజ వికాస్‌ పురస్కారం కింద రూ.2.40 కోట్లు ప్రోత్సాహకంగా ప్రకటించింది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మంగళవారం ఢిల్లీలోని డాక్టర్‌ అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో మైన్స్‌ అండ్‌ మినరల్స్‌పై జరిగిన సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేతుల మీదుగా మైనింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గనులు శాఖ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి అవార్డు అందుకున్నారు.

రెండేళ్లుగా పారదర్శకంగా లీజులు..
దేశంలో ప్రధాన ఖనిజాల మైనింగ్‌పై ఉత్తమ విధానాలను అనుసరిస్తున్న రాష్ట్రాలకు కేంద్ర గనుల శాఖ ఏటా అవార్డులను ప్రదానం చేస్తోంది. రాష్ట్రీయ ఖనిజ వికాస్‌ పురస్కారం కింద ప్రోత్సాహకాలు అందిస్తోంది. గత రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పది రకాల ప్రధాన ఖనిజాలకు సంబంధించి అన్వేషణ, వేలం, మైనింగ్‌ కార్యక్రమాల పర్యవేక్షణలో పారదర్శకంగా వ్యవహరిస్తూ అత్యంత వేగంగా లీజులు జారీ చేస్తోంది. వేగంగా మైనింగ్‌ కార్యక్రమాలను చేపట్టేలా అత్యుత్తమ విధానాలను అనుసరిస్తోంది. దీనికి గుర్తింపుగా కేంద్రం అవార్డులను ప్రకటించింది. మైనింగ్‌ బ్లాకుల నిర్వహణను సమర్థంగా చేపట్టినందుకు అభినందిస్తూ 2022–23లో బాక్సైట్, ఐరన్‌ ఓర్‌ ఐదు కొత్త మినరల్స్‌ బ్లాక్‌లకు సంబంధించి జియోలాజికల్‌ నివేదికలను రాష్ట్రానికి కేంద్రం అందజేసింది. 

సీఎం తెచ్చిన సంస్కరణల ఫలితం..
మైనింగ్‌ రంగంలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఆనందదాయకమని గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు మైనింగ్‌ రంగంలో సృజనాత్మక పనులతోపాటు పలు సంస్కరణలు తెచ్చినట్లు వెల్లడించారు. కొత్త మినరల్‌ బ్లాకులకు సంబంధించి త్వరలోనే ఖనిజ అన్వేషణ, వేలం, మైనింగ్‌ ఆపరేషన్‌ ప్రక్రియలను పూర్తి చేస్తామని వీజీ వెంకటరెడ్డి తెలిపారు. మైనింగ్‌ రంగంలో సీఎం జగన్‌ తెచ్చిన సంస్కరణలు, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకత్వంతో జాతీయ స్థాయి గుర్తింపు సాధించామన్నారు. 

భారతి సిమెంట్స్‌కు ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ 
నేషనల్‌ కాంక్లేవ్‌లో భారతి సిమెంట్స్‌కు కేంద్ర గనుల శాఖ ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ ఇవ్వడం పట్ల సంస్థ యాజమాన్యాన్ని ద్వివేది, వెంకటరెడ్డి అభినందించారు. వరుసగా మూడేళ్లు సస్టెయినబుల్‌ మేనేజ్‌మెంట్‌ విధానాలను అవలంబించిన భారతి సిమెంట్స్‌కు ఈ గౌరవం దక్కడం అభినందనీయమన్నారు. 

మరిన్ని వార్తలు