త్వరలో భావనపాడు పోర్టు టెండర్లు

25 Jul, 2021 02:15 IST|Sakshi
భావనపాడు పోర్టు ప్రతిపాదిత ప్రాంతం

మరో నాలుగు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి కూడా..

రామాయపట్నం పోర్టు పనులకు సెప్టెంబర్‌లో శ్రీకారం

కార్యాచరణ సిద్ధం చేసిన ఏపీ మారిటైమ్‌ బోర్డు

సాక్షి, అమరావతి: సముద్ర ఆధారిత వాణిజ్యం అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే 4 ఫిషింగ్‌ హార్బర్లు, రెండు పోర్టుల నిర్మాణానికి టెండర్లు పిలిచిన రాష్ట్ర ప్రభుత్వం మరో పోర్టు, నాలుగు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి టెండర్లు పిలవడానికి రంగం సిద్ధంచేసింది. ఇందులో శ్రీకాకుళం జిల్లా భావనపాడు వద్ద సుమారు రూ.3,670 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పోర్టుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారైందని, ఆర్థికశాఖ నుంచి అనుమతి రాగానే టెండర్లు పిలవనున్నట్లు ఏపీ మారిటైమ్‌ బోర్డు సీఈఓ కే మురళీధరన్‌ తెలిపారు.

అదే విధంగా మరో 4 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనులకు ఆర్థిక శాఖ ఆమోదానికి పంపామని, అవి రాగానే పోర్టు, ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణాలకు ఆగస్టులో టెండర్లు పిలవనున్నామన్నారు. ఇప్పటికే సుమారు రూ.1,500 కోట్ల వ్యయంతో జువ్వలదిన్నె(నెల్లూరు), ఉప్పాడ (తూర్పు గోదావరి), నిజాంపట్నం(గుంటూరు), మచిలీపట్నం(కృష్ణా) ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇప్పుడు బుడగట్లపాలెం (శ్రీకాకుళం జిల్లా), పూడిమడక (విశాఖ), కొత్తపట్నం (ప్రకాశం), బియ్యపుతిప్ప (పశ్చిమ గోదావరి) ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి టెండర్లు పిలవనున్నారు.

ప్రకాశం జిల్లా రామాయపట్నం ఓడరేవు పనులను సెప్టెంబర్‌ నుంచి శ్రీకారం చుట్టేందుకు మారిటైమ్‌ బోర్డు ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. ఈలోగా పోర్టుకు సంబంధించి అన్ని అనుమతులు సాధించడంపై దృష్టి పెట్టింది. అత్యంత కీలకమైన పర్యావరణ అనుమతుల కోసం ఈ నెల 28న రామాయపట్నంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ పోర్టు నిర్మాణ పనుల కాంట్రాక్టును నవయుగ ఇంజనీరింగ్‌ లిమిటెడ్, అరబిందో రియాల్టీ కలిసి దక్కించుకున్న సంగతి తెలిసిందే. పోర్టు నిర్మాణానికి కావాల్సిన నిధులను ఏపీ మారిటైమ్‌ బోర్డు రుణాల ద్వారా సమకూర్చుకోనుంది. సెప్టెంబర్‌లో పోర్టు నిర్మాణ పనులను సీఎం జగన్‌ చేతులు మీదుగా ప్రారంభించనున్నట్లు మురళీధరన్‌ తెలిపారు. మచిలీపట్నం పోర్టుకు టెండర్లు ఖరారయ్యేలోగా పర్యావరణ అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు