23 నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ మండల దీక్షలు

3 Nov, 2023 03:06 IST|Sakshi

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై నవంబర్‌ 23 నుంచి భవానీ మండల దీక్షలు ప్రారంభించనున్నట్లు ఆలయ ఈవో కేఎస్‌.రామారావు తెలిపారు. ఆలయం మహామండపం ఆరో అంతస్తులో ఆలయ చైర్మన్‌ కర్నాటి రాంబాబు, వైదిక కమిటీ సభ్యులతో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ దీక్షలు 27 వరకు స్వీకరించవచ్చన్నారు.

23న మూలవిరాట్‌కు పూజలు నిర్వహించి పగడాల మాలాధారణ చేస్తారని, అనంతరం ప్రధాన ఆలయం నుంచి ఉత్సవమూర్తిని మహా మండపం ఆరో అంతస్తుకు ఊరేగింపుగా తీసుకువచ్చి అఖండ జ్యోతి ప్రజ్వలనతో దీక్ష స్వీకరణ మహోత్సవం ప్రారంభమవుతుందని వివరించా­రు. అర్ధమండల దీక్షలు డిసెంబర్‌ 13–17 వరకు స్వీకరించవచ్చన్నారు. 26న అమ్మవారి కలశజ్యోతి మహోత్సవం సత్యనారాయణపురంలోని శ్రీశివరామకృష్ణ క్షేత్రం నుంచి ప్రారంభమవుతుందన్నారు. జనవరి 3–7 వరకు దీక్ష విరమణలు కొనసాగుతాయని తెలిపారు.  

14 నుంచి కార్తీక మాసోత్సవాలు 
ఇంద్రకీలాద్రిపై ఈ నెల 14 నుంచి డిసెంబర్‌ 12 వరకు కార్తీక మాసోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం మల్లేశ్వర స్వామి, నటరాజ స్వామి వారి ఆలయాల వద్ద ఆకాశదీపాన్ని వెలిగించనున్నారు. 26న కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం, 27న కార్తీక పౌర్ణమి గిరి ప్రదక్షణ, బిల్వార్చన చేపడతారు. 15న దుర్గమ్మను గాజులతో అలంకరిస్తారు. 16న సరస్వతి యాగాన్ని, 17న నాగుల చవితి నిర్వహిస్తారు.

మరిన్ని వార్తలు